సుల్తాన్‌పూర్ ( ఉత్తరప్రదేశ్ ): ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్‌పూర్ రైల్వేస్టేషన్ బయట పడిఉన్న సంచి బుధవారం అక్కడివారిని భయాందోళనలకు గురి చేసింది. దీంతో పోలీసులు ముందు జాగ్రత్తగా స్టేషన్‌ను ఖాళీ చేయించడానికి పూనుకున్నారు. ఆ సంచిలో ఏముందో తనిఖీ చేయడానికి ఫోరెన్సిక్ బృందాన్ని పిలిపించారు. పోలీసుల సమాచారం ప్రకారం ఆ సంచిలో బ్యాటరీ, వైరు, బ్యాంక్ పాస్‌బుక్ ఉన్నాయి. అది మద్యానికి బానిసై సస్పెండయిన కానిస్టేబుల్‌దని చెప్పారు. సస్పెండయిన కానిస్టేబుల్ నరేంద్ర ప్రతాప్ సింగ్ కాన్పూర్ జిల్లా పంకి గ్రామానికి చెందిన వాడు. దర్యాప్తు చేయగా తాను ఆ సంచిలో బ్యాటరీ, వైరు ఉంచలేదని చెబుతున్నాడని ఎస్‌పి విపిన్‌కుమార్ మిశ్రా చెప్పారు. మద్యానికి బానిసైన ప్రతాప్ తాను ఆ సంచిని ఎక్కడ ఉంచాడో గుర్తు తెచ్చుకోలేక పోతున్నాడని తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని మిశ్రా పేర్కొన్నారు. కానిస్టేబుల్ సింగ్ గత మూడేళ్లుగా విధులకు గైర్హాజరు అవుతున్నందున సస్పెండ్ చేయడమైందని, ఆయనను డిస్మిస్ చేసే ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు.