సాధారణ ప్రజల బతుకులను దుర్భరం చేస్తున్న అధిక ధరల సమస్య ఇప్పుడు ఎవరికీ పట్టడం లేదు. నిత్యం వుండే దానికి నెత్తీనోరూ బాదుకొంటే మాత్రం ఏమి ప్రయోజనం అనే ఒక అతి నిస్సహాయ స్థితికి చేరుకోడం వల్లనే దీనిపై ప్రజలు పూర్వంలా తీవ్రంగా స్పందించడం లేదని అనిపిస్తున్నది. గతంలో ధరలు ఏ మాత్రం పెరిగినా గగ్గోలు వినిపించేది. మీడియాలో విమర్శలు వెల్లువెత్తేవి. బయట ప్రజా సంఘాల ధర్నాలు, ఉద్యమాలు ఉగ్ర రూపం ధరించేవి. పోలీసులు లాఠీలకు పని చెప్పేవారు. ఇప్పుడు అటువంటి దృశ్యాలు మచ్చుకైనా కనిపించడం లేదంటే ప్రజలు సుఖంగా బతుకుతున్నారని అనుకోవాలా? ఎంత మాత్రం కాదు. ఈ నిర్లిప్తత కూడా ప్రపంచీకరణ ఫలితమే అని ఉదారవాద ఆర్థిక సంస్కరణ వాదులు ఘనంగా చెప్పుకొంటే ఎవరేమీ చేయలేరు. ఏ సమస్యనైనా అదంతేలే అనే ధోరణిలో మామూలుగా తీసుకోడం, ఎవరి పాట్లు వారే పడడం, ఏ ఇద్దరూ దాని గురించి మాట్లాడుకోకపోడం, వున్నదీ లేనిదీ తాకట్టుపెట్టో, చేబదులు అడిగో, అప్పు చేసో ఆ సమయానికి ఎంత ధర అయినా చెల్లించి కొనుక్కోడంతోనో లేక పస్తులతో గడిపేయడంతోనో సరిపెట్టుకొంటున్నారని బోధపడుతున్నది. సంఘ శక్తి, సంఘటిత ప్రతిఘటన అనేవి పూర్తిగా మాయమైపోయాయి. టమేటో ధర నిన్నగాక మొన్నే రూ.
200 దాటిపోయి సామాన్యుల కళ్ళల్లో నీళ్ళు ఇంకిపోయేలా చేసింది. ఇప్పటికీ కిలో రూ. 50 లేదా రూ. 40 కి తగ్గడం లేదు. పోషకాహార లేమితో దేశ ప్రజలు నీరసించిపోతున్నారంటే అందుకు ఇంత కంటే వేరే కారణం ఏమి కావాలి? తాజాగా ఉల్లి కిలో రూ. 80కి చేరుకొని ఇంకా రూ. 50 దగ్గర నుంచి దిగిరానంటోంది. ధాన్యాల పరిస్థితీ అలాగే వుంది. 2013 నుంచి 2023 వరకు గల పదేళ్ళ కాలంలో వీటి ధర విపరీతంగా పెరిగిపోయింది. ఇతర కూరగాయలూ తరచూ సాధారణ ప్రజలకు గాయాలు చేస్తున్నాయి. ఆకు కూరలు కూడా సామాన్యులకు అందుబాటులో లేని విధంగా అటకెక్కిపోతున్నాయి. ఈ అధిక ధరలకు వాతావరణ పరిస్థితులను కారణంగా చూపి కేంద్ర పాలకులు తప్పించుకొంటున్నారు. అదేమని అడిగితే ఎగుమతి సుంకాలు పెంచుతున్నామని అయినా ధరలు తగ్గడం లేదని చెబుతారు. దేశ వ్యాప్తంగా నిల్వ సదుపాయాలు పెంచి ముందస్తుగానే ఆయా సరకుల నిల్వలను సేకరించి ఆపత్కాలంలో ప్రజలను ఆదుకోడం పాలకులకు చేతకాని పనా? కానేకాదు. వారి దృష్టి ఎప్పుడూ తమకు అపారంగా ఎన్నికల నిధులు సమకూర్చే బడా వ్యాపారులకు గరిష్ఠ స్థాయి లాభాలు చేకూర్చడం ఎలా అనే దాని మీదనే. పప్పు సప్పు, కూర నార లేకుండానే కలో గంజో తాగి గడుపుదామంటే బియ్యం ధరలు కూడా పెరిగిపోతున్నాయి.
కిలో రూ. 3035 వుండిన ముతక బియ్యం ఇప్పుడు రూ. 4045 అమ్ముతున్నది. పాత సోనా మసూరి రూ. 60 నుంచి 68కి చేరుకొన్నది అని వినియోగదార్లు వేదన చెందుతున్నారు. బియ్యం ధర కిలో వద్ద రూ. 8 నుంచి రూ. 15 పెరిగిందంటే సామాన్యులు బతికేదెలా? నూనెలు, పప్పులు కూడా చెట్టెక్కి కూచొన్నాయి. ఇంటి అద్దె, పిల్లల చదువులు వగైరాలు చూసుకొంటూ ఈ అధిక ధరల్లో సరకులు కొని తినడం సాధ్యమేనా? ఉల్లి ధరను పరిమితుల్లో వుంచడానికి గత ఆగస్టులో కేంద్రం 40% ఎగుమతి సుంకాన్ని విధించింది. అక్టోబర్‌లో కనీస ఎగుమతి ధరను టన్నుకి 800 డాలర్లు చేసింది. అయినా పెద్దగా ప్రయోజనం కనిపించ లేదు. 2017 జూన్ నుంచి అదే పనిగా పెట్రోల్, డీజెల్ ధరలు పెంచుతూ వచ్చారు. దాని ప్రతికూల ప్రభావం సరకుల ధరల మీద విపరీతంగా పడింది. వర్తకులు సరకులను ఒక చోటి నుంచి మరో చోటికి తీసుకెళ్ళేటప్పుడు అయ్యే రవాణా ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. ఈ ఏడాది తొలకరి బాగా ఆలస్యం కావడంతో పంటలు దెబ్బతిన్న మాట వాస్తవం. మన చేతుల్లో లేని వాతావరణ మార్పులను చూపి ప్రభుత్వాలు చేతులు దులుపుకోడం ఎంత మాత్రం క్షంతవ్యం కాదు. ఒక వైపు పాలస్తీనా, ఇంకొక వైపు ఉక్రెయిన్ యుద్ధాలు ముసురుకొచ్చాయి.
వాటి ప్రభావం పెట్రోల్ ధరల మీద విపరీతంగా పడుతున్నది. ప్రస్తుతం 90 డాలర్ల వద్ద వున్న క్రూడాయిల్ ధర పెరిగిపోయి ఒకప్పటి లాగా వంద డాలర్లు దాటిపోతే అప్పుడు ఎదురయ్యే గడ్డు పరిస్థితి మరింత తీవ్రంగా వుంటుంది. రూపాయి విలువ పతనం అధిక ధరల అగ్గి మీద ఆజ్యం అవుతున్నది. దేశంలో ఇప్పటికే ధనిక, పేద వ్యత్యాసాలు దారుణంగా పెరిగిపోయాయి. ఎప్పటికీ దిగిరాని ధరలు ఈ దూరాన్ని మరింతగా పెంచుతాయి. ఎన్నికల్లో కూడా ధరల సమస్య తగినంతగా ప్రస్తావనకు రాకపోడం ఈ దేశ దుస్థితి అనుకోవాలి. ప్రజల్లో చైతన్యం లేకపోడం కేంద్రంలోని బాధ్యత లేని పాలకులకు వరం వంటిది. వ్యవసాయ రంగం మీద ఆధారపడే కూలీనాలీ జనానికి కూడా దిక్కుతోచనీయకుండా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేశారు. మందు లేని మొండి రోగం మాదిరిగా తయారైన అధిక ధరల సమస్యకు పరిష్కారం లేనట్టేనా?