సికింద్రాబాద్ పరిధి నల్లగుట్టలోని డెక్కన్ నైట్‌వేర్ స్పోర్ట్స్ దుకాణంలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. గత నాలుగు గంటలుగా మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా మంటలు అదుపులోకి రావడం లేదు. భారీగా
భవనం చుట్టూ పక్కల ప్రాంతాల్లో భారీగా పొగ కమ్ముకున్నది. అగ్నికీలలు ఎగిసిపడుతుండడంతో మరో నాలుగు భవనాలకు సైతం మంటలు వ్యాపించాయి. భవనంలో మరికొందరు చిక్కుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు భవనంలో చిక్కుకున్న ఐదుగురిని సిబ్బంది రక్షించారు. మంటలు, తీవ్రమైన పొగ వల్ల సహాయక చర్యలకు విఘాతం కలుగుతున్నది. తీవ్రమైన పొగతో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు.
వారి ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా మంటలు భారీగా పెరుగుతుండడంతో ముందు జాగ్రత్తగా అధికారులు భవనం పక్కనున్న కాచీబౌలి కాలనీని పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. చుట్టుపక్కల ఇండ్ల నుంచి గ్యాస్ సిలిండర్లను తరలిస్తున్నారు. భవనం చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా కమ్ముకున్న పొగ కారణంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.