Wednesday, January 22, 2025

కూలిన ఫ్లై ఓవర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హస్తినాపురం: ఎల్‌బినగర్‌లో బుధవారం తెల్లవారు జామున రెండు పిల్లర్ల మద్యన ఫ్లై ఓవర్ బ్రిడ్జి స్లాబు ఆకస్మాత్తుగా కుప్ప కూలింది. నిర్మాణం పనులు చేస్తున్న కూలీల్లో ఏడుగురు బ్రిడ్జి పై నుండి కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులందరు సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో పునీత్ (23) అనే కూలీ పరిస్థితి విషమంగా ఉన్నది. గాయపడ్డ వారంతా బీహర్ రాష్ట్రం బైసాలి జిల్లాకు చెందిన వారు. సాగర్ రింగు రోడ్డు వద్ద స్కై ఓవర్, ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టిన ఎస్‌ఆర్‌డిపి వారు పెద్ద స్థాయి జంక్షన్ నిర్మాణం పనులు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో చౌరస్తాను అనుసరించి ఉన్న బైరామల్‌గూడ గ్రామం చెరువు కాలి స్థలంలో దాదాపు ఫర్లాంగు పొడవున 14 పిల్లర్లతో బ్రిడ్జి నిర్మిస్తున్నారు. 10వ పిల్లర్లపై స్లాబు నిర్మించిన కూలీలు, మంగళవారం 11,12వ పిల్లర్ల మద్యన 15 మీటర్ల పొడవుతో 7 మీటర్ల వెడల్పుతో 15 అడుగుల ఎత్తులో స్లాబు నిర్మాణం పనులు కొనసాగించారు.

హైదరాబాదు శివారులో బెల్లపల్లి సమీపాన తయారవుతున్న సిమెంట్ మిక్సింగు మెటేరియల్‌ను తెప్పించి రెండు పిల్లర్ల మద్యన స్లాబు పోసి చదును చేస్తుండగా బుధవారం తెల్లవారు జామున 3.30 గంటల సమీపంలో ఆకస్మాత్తుగా కుప్పకూలింది. స్లాబుపై సిమెంటు లేవలింగ్ చేస్తున్న పునీత్ (23), జితేందర్ (24), బిక్కి (24), హరేరామ్ (23), బజరంగ్ (19) మరో ఇద్దరు కూలీలు బ్రిడ్జితో పాటు కుప్పకూలి సిమెంటు స్టీలు రాడ్ల మద్యన చిక్కిపోయారు. ఇందులో పునీత్ అనే కూలీ తలకు తీవ్ర గాయమైంది. సూపర్‌వైజరు గోపాల్ వెంటనే దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. స్థానిక ఎంఎల్‌ఎ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేశ్‌కుమార్, జిహెచ్‌ఎంసి ఈస్ట్ జోనల్ కమిషనర్ పంకజ, ఎల్బీనగర్ డిప్యూటీ కమిషనర్ సురేందర్‌రెడ్డి ఇంజినీరింగ్, పోలీసు అధికారులు బుధవారం ఉదయం సంఘటన స్థలికి చేరుకొని జరిగిన ప్రమాదం గురించి తెలుసుకొని సహాయక చర్యలు చేపట్టారు. మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రులను కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

తీవ్రంగా గాయపడ్డ పునీత్ (23)కు కిమ్స్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స జరుగుతున్నట్లు తెలిసిందని తోటి కూలీలు తెలుపుతున్నారు. కూలిన బ్రిడ్జి పక్కనే ఇటీవల అర కిలోమీటరు పొడవున పెద్ద స్థాయి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించి సాగర్ రింగు జంక్షన్లో సిగ్నల్ రహితం చేశారు. దీని పైన సుమారు 60 అడుగుల ఎత్తులో స్కై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేస్తున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే నాగార్జునసాగర్, విజయవాడ, శంషాబాద్ విమానాశ్రయం, ఎల్‌బినగర్, సంతోష్‌నగర్ రహదారి మార్గంలో వెళ్లే వాహనాల వారు ఎక్కడ ఆగకుండా నేరుగా బ్రిడ్జిల పైన నిర్మించిన జంక్షన్ ద్వారా వెళ్లేందుకు ఆధునిక సౌకర్యం ఏర్పడనుంది. వర్షం కురిసినపుడు ఇక్కడ వరదలు ప్రవహించి రాకపోకలు నిలిచిపోయినందున ఈ బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టారు. ఎస్‌ఆర్‌డి ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు, సెక్యూరిటీ ఇన్‌చార్జి దామోదరసింగ్ దగ్గరుండి పెద్ద సంఖ్య కూలీలతో కూలిన మెటేరియల్‌ను తొలగింప చేసి సిమెంటు, స్టీలు కింద ఇంకా ఎవరైన మనుషులు ఉన్నారేమో అని వెదికారు. పోలీసులు డాగ్ స్కాడ్‌తో శోధించి ఎవరూ లేరని తెలిపారు.

క్షతగాత్రులకు మంత్రి కెటిఆర్ పరామర్శ…
కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతన్న బాధితులను మంత్రి కెటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలసి పరామర్శించి ప్రమా దం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధితుల చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది అని కెటిఆర్ స్పష్టం చేశారు. ఘటనపై దర్యాప్తు చేసేందుకు జిహెచ్‌ఎంసి, జేఎన్‌టియూ హైదరాబాద్ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఘటనకు నిర్లక్షమే కారణమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిర్మిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి కూలిపోవడానికి బిఎస్‌ఆర్ కంపెనీ కంట్రాక్టర్ నిర్లక్షమే కారణమని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి, చంపాపేట డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూధన్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎల్‌బినగర్ ఇన్‌చార్జి మల్‌రెడ్డి రాంరెడ్డి, బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామరంగారెడ్డి కార్యకర్తలతో సంఘటనా స్థలిని పరిశీలించి విచారం వ్యక్తం చేశారు. స్లాబు నిర్మిస్తున్న కూలీలు యంత్రాలతో చదును చేస్తుండగా రెండు పిల్లర్ల మద్యన నిర్మిస్తున్న స్లాబు కింద ఏర్పాటు చేసిన సపోర్టు రాడ్లు కదిలి కూప్పకూలి వుండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి కాంట్రాక్టర్ నిర్లక్షమే కారణమని ఆగ్రహించి కంట్రాక్టర్ శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసి, గాయపడ్డ ప్రతి ఒక్కరికి పది లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News