దూలం విరిగిపడి 14 మంది కార్మికులకు గాయాలు
ముంబయి: నగర శివార్లలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని ఎంటిఎన్‌ఎల్ జంక్షన్ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌కు చెందిన సిమెంట్ దూలం విరిగిపడి 14 మంది కార్మికులు గాయపడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున 4.41 సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన కార్మికులను వెంటనే విలే పార్లేలోని విఎన్ దేశాయ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని అక్కడి డాక్టర్లు తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు 21-49 మధ్య వయసున్న కార్మికులు ఫ్లైఓవర్‌కు చెందిన సిమెంట్ దూలంపైన ఉండి పనిచేస్తుండగా అది విరిగి కిందపడింది. తూర్పు-పశ్చిమ ముంబయిని అనుసంధానం చేయడంతోపాటు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు శాంటాక్రూజ్-చెంబూర్ లింక్ రోడ్డుపై ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. కాగా, ఈ సంఘటనపై ముంబయి మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్‌మెంట్ అథారిటీ దర్యాప్తునకు ఆదేశించినట్లు రాష్ట్ర పర్యావరణ, పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాకరే తెలిపారు.