ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు ఇంకో అవకాశం
ఈనెల 21 నుంచి మార్చి 31వరకు మీసేవా కేంద్రాల ద్వారా
దరఖాస్తులకు ఆహ్వానం ఇదే చివరి అవకాశం,
వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచన జిఒ 14 జారీ
మనతెలంగాణ/హైదరాబాద్ : జిఓ 58, 59 కింద మరోసారి పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనికి సంబంధించి జిఓ 14ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ జారీ చేశారు. ఈనెల 21వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇదే చివరి అవకాశమని, లబ్ధిదారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2014 డిసెంబర్ 30వ తేదీన రెండు జీఓలను విడుదల చేసింది.
అందులో జిఓ 58 ప్రకారం 125 చదరపు గజాల్లోపు ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న వారికి, జిఓ 59 ప్రకారం మధ్య తరగతి ఆపై తరగతికి చెందిన ప్రజలు నిర్మించుకున్న ఇళ్ల విస్తీర్ణం ఆధారంగా ప్రభుత్వం ధరలను ఖరారు చేసింది. ఇలా 2014, 2015, 2017 సంవత్సరంలో ఫ్రిబవరిలో ఒకసారి, డిసెంబర్‌లో మరోసారి పేదలకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 11.19 లక్షల దరఖాస్తులు రాగా, ఉచితంగా 6.18 లక్షల మంది దరఖాస్తులను ప్రభుత్వం పరిష్కరించింది. మిగతా వాటికి వాటి విస్తీర్ణం ఆధారంగా ధర నిర్ణయించి క్రమబద్ధీకరించింది. వీటి పరిష్కారానికి ఆర్డీఓ నేతృత్వంలోని తహసీల్దార్‌లతో కూడిన కమిటీలను ప్రభుత్వం నియమించడంతో పాటు వాటి పరిష్కారానికి 90 రోజుల సమయాన్ని ఇచ్చింది.