Sunday, January 19, 2025

రాజ్యాంగం పట్ల అవగాహన అవసరం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : భారత రాజ్యాంగం పట్ల దేశంలోని ప్రతి ఒక్కరికీ సంపూర్ణ అవగాహన అవసరమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. ఆదివారం కర్మన్‌ఘాట్‌లో జరిగిన ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ రాష్ట్రస్థాయి ప్రతినిధుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశంలో అక్షరాస్యత శాతం బాగా పెరిగిందని, ఈ నేపథ్యంలో రాజ్యాంగం పట్ల అవగాహన అవసరమని వినోద్‌కుమార్ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు అవగాహన కలిగితే ఈ దేశ ప్రజలను అభ్యుదయ మార్గం వైపు నడిపిస్తాయి అని అన్నారు.

రాజ్యాంగం పట్ల సంపూర్ణ అవగాహన కలిగితే సామాజిక స్పృహ పెంపొంది.. అది వ్యక్తిగత జీవితానికి, సమాజంలో శాంతియుత వాతావరణానికి దిక్సూచిగా మారుతుందని ఆయన తెలిపారు. ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్‌లోనే ప్రజల ప్రాథమిక హక్కులు కాపాడబడుతున్నాయని, అందుకు రాజ్యాంగమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. ప్రపంచ శాంతి, దేశ శాంతి కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని, అందుకు కంకణ బద్దులు కావాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. కులాలు, మతాల పేరిట విద్వేషాలను పెంచి పోషిస్తున్న పార్టీలు, కుహనా జాతీయవాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఈ మేరకు ప్రజలను చైతన్యవంతులను చేయాలని ఆయన సూచించారు. సమావేశంలో ఆర్గనైజేషన్ ప్రతినిధులు కె.వి.ఎల్, బొమ్మగాని ప్రభాకర్, డాక్టర్ సుధాకర్, తిప్పర్తి యాదయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News