వైశాలి : పనీపాటా లేకుండా కేవలం అదేపనికి దిగే మగవారి వల్లనే జనాభా సమస్య తలెత్తుతోందని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. దీనిపై పెద్ద ఎత్తున బిజెపి ఇతర నేతల నుంచి విమర్శలు తలెత్తాయి. ముఖ్యమంత్రి హోదాలోని వ్యక్తి హుందాగా మాట్లాడాల్సి ఉందని, సభ్యతను పాటించాలని చురకలు వెలువడుతున్నాయి. సిఎం నితీశ్ ఇప్పుడు రాష్ట్రంలో సమాధాన్ యాత్ర పేరిట ప్రజల వద్దకు వెళ్లుతున్నారు. ఈ క్రమంలో వైశాలిలో జరిగిన బహిరంగ సభలో ఆదివారం ఆయన జనాభా సమస్య పెరుగుదల అనర్థాలకు దారితీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో ఆయన మగవారిని తిట్టిపోశారు. జనాభా సమస్యకు మూలం తిని నిద్రపోయే క్రమంలో మగవారు చేసే పనులే కారణం అన్నారు. మగవారికి సమస్యల పట్ల బాధ్యత లేదని, ఇక ఆడవారు చాలా వరకూ చదువురాని వారు కావడంతో మగవారి ఆగడాలకు తలూపాల్సి వస్తోందని, దీనితోనే జనాభా సమస్య తలెత్తుతోందని నితీశ్ తెలిపారు.
మహిళలు చదువుకుని ఉంటేనే ఈ తీవ్ర సమస్యకు అడ్డుకట్ట పడుతుందని, వారికి చదువు అయినా వచ్చి ఉండాలి, లేదా తరచూ గర్భం దాల్చకుండా చూసుకునే పద్ధతులు అయినా తెలుసుకుని ఉండాలని, ఎందుకంటే మగవారికి తాము చేసే పని వల్ల కలిగే ఫలితం గురించి ఆలోచన ఉండదని , మగవారు ఆ క్షణాలలో జరిపే ఆగడాలను ఆడవారు భయంతోనే భక్తితోనే కాదనలేకపోవడం వల్ల ఈ విధంగా జనం సంఖ్య పెరుగుతోందని సభలో తెలిపారు. ఈ మగవారికి తాము రోజుకురోజు చేస్తున్నదాని వల్ల కలిగేదేమిటనే ఇంగితజ్ఞానం లేదని సిఎం పేర్కొన్నారు. జనాభా సమస్య గురించి మాట్లాడటం వరకూ బాగానే ఉంది కానీ సిఎం ఈ విధంగా నిండుసభలో పచ్చిబూతులకు దిగడం జుగుప్సాకరంగా ఉందని, బీహార్ పరువు తీసేలా ఉందని రాష్ట్ర బిజెపి నేత సామ్రాట్ చౌదరి మండిపడ్డారు. ఇంతటి పరుష పదజాలం వాడటం ప్రచారం కోసమా లేక తెలివితక్కువ తనమా అని నిలదీశారు. రాష్ట్ర పరువును, ముఖ్యమంత్రి పీఠం గౌరవాన్ని తీసిపారేశారని చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.