Monday, December 23, 2024

నిరుద్యోగ విశ్వరూపం

- Advertisement -
- Advertisement -

దేశంలో విద్యాధికుల్లో నిరుద్యోగ తీవ్రత ఏ స్థాయిలో ఉందో బుధవారం ముంబై ఎయిర్ పోర్టులో నిరుద్యోగుల తొక్కిసలాట దృశ్యాలే నిదర్శనంగా చెప్పవచ్చు. ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా 2000 లోడర్ల పోస్టులకు ప్రకటన ఇస్తే 25 వేలకు పైన నిరుద్యోగులు ముంబై ఎయిర్ పోర్టును పోటెత్తింప చేయడంతో వారిని నియంత్రించలేక సిబ్బంది అష్టకష్టాలుపడ్డారు. ఎయిర్ పోర్టులో నిర్వహించిన ఇంటర్వూలకు హాజరైన నిరుద్యోగులకు ఆహారం, నీరు లేక అనేక మంది అస్వస్థతకు గురైన దృశ్యాలు దేశంలోని నిరుద్యోగిత తీవ్ర రూపాన్ని పాలకులకు తెలియజెప్పాయి. నిజానికి ఈ ఉద్యోగాలు పెద్దగా విద్యార్హతలు లేని వారి కోసం ఉద్దేశించనవి. విమానం ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయినప్పుడు అందులో ప్రయాణికులకు సంబంధించిన లగేజీని దించడం లేదా లోడ్ చేయడం వీరి ప్రధాన విధి. వీరిని లోడర్లుగా పిలుస్తారు. ఈ పోస్టుల కోసం కనీస విద్యార్హతలు అవసరం లేదు. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటే చాలు.

అయినా ఈ చిరుద్యోగాల కోసం పిజిలు, డిగ్రీలు, చివరికి పిహెచ్‌డిలు చేసిన వారు కూడా హాజరయ్యారంటే పరిస్థితి ఎలా ఉందో వివరించనక్కర లేదు. ఈ ఉద్యోగాలకి ఇచ్చే జీతం నెలకు రూ. 25 వేలు. ఓవర్ డ్యూటీ చేస్తే మరో ఐదు వేలు వస్తాయి. ఈ ముప్పై వేల జీతానికే 25 వేల మందికి పైగా వచ్చి ఎయిర్ పోర్టు కిక్కిరిసిపోయేలా చేయడంతో విమానయాన ఉన్నతాధికారులే కాకుండా దేశమంతా ఆశ్చర్యపోయిన పరిస్థితి ఏర్పడింది. గడిచిన నెల జులై 2 తేదీన గుజరాత్‌లోని అంక్లేశ్వర్ హోటల్‌లో రసాయనిక పరిశ్రమ 40 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తే అప్పుడు కూడా వేల మంది హాజరై ఆ హోటల్ పరిసరాలు కూలిపోయే పరిస్థితులు కనిపించాయి. ఈ రెండు సంఘటనలు కనిపించినవి. ఇంకా కనిపించని నిరుద్యోగ తొక్కిసలాటలు దేశమంతటా సర్వసాధారణంగా మారిపోయాయి.

కాని ఈ చేదు నిజాన్ని అటు కేంద్ర పాలకులు గాని, ఇటు రాష్ట్రాల పాలకులు గాని గుర్తించడం లేదు. నిరుద్యోగ సమస్యలను నిర్మూలించడాన్ని పార్టీలు ఏవైనా, పాలకులు ఎవరైనా సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఉద్యోగాల సృష్టికి, నైపుణ్యాల పెంపుకి చిత్తశుద్ధి, శాస్త్రీయ దృక్పథంతో కూడిన విధానాలు అమలు చేయడం లేదు. ఫలితమే నిరుద్యోగం విశ్వరూపం దాలుస్తున్నది. ఇది మున్ముందు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో తెలియని విధంగా ఉంది. గుజరాత్‌లో, మహారాష్ట్రలో చిరుద్యోగాల కోసం జరిగిన ఈ తొక్కిసలాటలను కేంద్రం గాని, రాష్ట్రాలు గాని తేలికగా కొట్టిపారేస్తున్నాయి. పైగా దీనిని రాజకీయం చేస్తున్నారని అధికార పార్టీలు విపక్షాలపై దుమ్మెత్తి పోస్తున్నాయి. కాని క్షేత్రంలో నెలకొన్న వాస్తవాలను అంగీకరించడం లేదు. ఈ సంఘటనలు జరగడానికి నెల ముందు దేశంలో ప్రసిద్ధి గాంచిన ప్రపంచ కార్మిక సమాఖ్య, మానవ అభివృద్ధి సంస్థలు సంయుక్తంగా ‘భారత ఉపాధి నివేదిక 24’ విడుదల చేసిన నివేదిక కూడా నిరుద్యోగ తీవ్రతను గణాంకాలతో సహా వివరించాయి. దేశంలో మొత్తం నిరుద్యోగుల్లో 83 శాతం దాకా యువకులే నిరుద్యోగులుగా ఉన్నారని ఆ నివేదిక స్పష్టం చేసింది.

గడిచిన రెండు దశాబ్దాల్లో విద్యావంతుల శాతం గణనీయంగా పెరుగుతుండగా, నిరుద్యోగుల శాతం అంతకంటే రెట్టింపుతో పెరుగుతున్నదని ఇది దేశ ఆర్థిక పరిస్థితికి ప్రమాదమేనని ఆ నివేదిక తేల్చి చెప్పింది. ఇప్పటి దాకా ప్రపంచంలో భారత దేశంలో యువ జనాభా అత్యధికంగా ఉండడం వల్ల అది దేశ ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుందని ఆర్థికవేత్తలు, సామాజిక వేత్తలు చెబుతున్నారు. దీన్ని ‘డెమోగ్రాఫిక్ డివిడెండ్’ గా చెప్పేవారు. కాని ఇది లాభం కంటే ఎక్కువ నష్టం చేకూరుస్తున్నదని ఐఎల్‌ఒ రిపోర్టు చెబుతున్నది. ఐఎల్‌ఒ నివేదికను పాలకులు ఆసాంతం చదివి మెదళ్లకు పదును పెడితే తప్ప దేశంలో గుజరాత్, ముంబై సంఘటనలు మున్ముందు సర్వసాధారణం కాబోతాయనడంలో అతిశయోక్తి లేదు. దేశం నిరుద్యోగం పెరగడానికి రోజురోజుకూ పెరుగుతున్న డిజిటలైజేషన్, సాఫ్ట్‌వేర్ రంగంలో పెను తుఫాన్ సృష్టిస్తున్న కృత్రిమ మేధ సాంకేతికతో పాటు వ్యవసాయంలో యాంత్రీకరణ, నైపుణ్య శిక్షణా కేంద్రాల కొరత లాంటివి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాల సృష్టి ఆధునిక సవాళ్లకు అనుగుణంగా పెరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు మారాలి. కాలం చెల్లిన విద్యా విధానంలో కూడా పరిశ్రమల అవసరాల అనుగుణంగా సమూల ప్రక్షాళన జరగాలి. ద్విముఖంగా ఈ పోరు ప్రభుత్వాల నుంచి పెరిగితే తప్ప నిరుద్యోగ ప్రళయం ఆగదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News