సిటీ బ్యూరో ః గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఉద్యోగం ఒక కలలాగానే మిగిలిపోతుందనే నిరాశ, నిస్పృహకు లోనై నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకోవడం నిరుద్యోగ యువతను తీవ్రంగా కలిచివేసిందని అఖిల భారత యువజన సమాఖ్య(ఏ ఐ వై ఎఫ్) నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ఆత్మహత్యకు పాలకులు, అధికారుల అసమర్థతే కారణమంటూ ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ లోని చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, వలీ ఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శికె. ధర్మేంద్ర లు మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీలో చోటుచేసుకున్న నిర్లక్షం కారణంగా వేలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
లోపభూయిష్టమైన విధానాలతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టివేసారని వారు ఆరోపించారు.ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతో పోటీ పరీక్షలకు జిల్లాల నుండి హైదరాబాద్ కు వచ్చి కోచింగ్ తీసుకుంటున్న నిరుద్యోగులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత పాలకులదని, కానీ నిర్లక్ష్యపు విధానాల కారణంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోపాల కారణంగా అన్ని పోటీ పరీక్షలు రద్దు కావడం, వాయిదా పడటంతో నిరుద్యోగులు ఆందోళనలకు గురౌతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐవైఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ నెర్లకంటి శ్రీకాంత్, కనుకుంట్ల శంకర్, యుగంధర్, నానబాల రామకృష్ణ,కార్యవర్గ సభ్యులు షేక్ మహమూద్, మాజీద్, ఉపేందర్, శ్రీనాధ్, సత్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.