ప్రపంచం నేడు ఆర్థిక మాంద్యంలో ఉంది. ఉద్యోగ కల్పనలో ఇండియా, చైనా, కెనడా లాంటి దేశాలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటాయి. పాలక విధానాలు కార్పొరేట్ల కొమ్ముకాస్తున్నాయి. పేదల స్థితిని, నిరుద్యోగాన్ని, సామాన్యుల కొనుగోలు శక్తిని పట్టించుకోడం లేదు. చైనా యువత నేడు తీవ్ర పోటీని ఎదుర్కొంటోందని షాంఘై సహాయ ఆచార్యురాలు జియా మియావో అన్నారు. ఉపాధి, జీవితాలలో చైనా యువత నిరాశల్లో మునిగి ఉంది. పెరుగుతున్న నిరుద్యోగం, పరిశ్రమల మూసివేతలు, ఉద్యోగుల తొలగింపులతో, కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ అనిశ్చితతో సవాళ్లను ఎదుర్కొంటోంది, సతమతమవుతోంది.
తేజో రహిత సంస్కృతిని అలవర్చుకుంది. 2022 సెప్టెంబర్‌లో టిక్ టాక్‌తో సంభవించిన నిశ్శబ్ద నిష్క్రమణలో ఈ మనస్తత్వ మూలాలు ఉన్నాయి. 16-20 ఏళ్ల యువత నిరుద్యోగం 20 శాతానికి పెరిగిందని, (2021లో ఇది 16.2%) నగరాలలో ఈ వయసు ఉద్యోగులు 5.4 శాతమని, నగర వాసుల సగటు మాసిక ఆదాయం రూ.48 వేలని 2022 ఆగస్టు అధికారిక సర్వే తెలిపింది. ఫిబ్రవరి 2023లో 16- 24 ఏళ్ల నిరుద్యోగులు 18.1 శాతం. కొన్ని కంపెనీలు 996 (ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు వారానికి 6 రోజులు) శ్రమ సంస్కృతిని అమలు చేస్తున్నాయి. ఉద్యోగ వయో పరిమితిని 35 ఏళ్లు చేయాలని, పెరుగుతున్న వృద్ధ జనాభాకు అనుగుణంగా పదవీ విరమణ వయసును పెంచాలని చైనా నిర్ణయించింది. చైనా ప్రభుత్వం విధించిన నియామక వయో పరిమితితో చైనా ఉద్యోగ సంతలో 35 ఏళ్ల యువత సంక్షోభంలో పడింది. ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
అనేక సంస్థలు యువ ఉద్యోగులను ఇష్టపడతాయి. యువకుల తక్కువ ఆరోగ్య నిర్వహణ ఖర్చులు, అపరిమిత శక్తి సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకొని కంపెనీలు వారిని ఉద్యోగాలలో నియమించుకోడం సమంజసమే. ఏది ఏమైనా ఈ వయో పరిమితి అనుభవ శ్రామిక శక్తి వృథాకు దారి తీస్తుంది. అసమతుల్య శ్రామిక నిర్మాణం ఏర్పడుతుంది. ప్రభుత్వాలు ఉద్యోగాలను కల్పించకపోతే… కుచించుకుపోతున్న శ్రామిక శక్తి, పెద్ద వయసు వ్యక్తులు శ్రామిక వ్యవస్థలో ఉన్న నేపథ్యం లో 35 ఏళ్ల ఉద్యోగ వయో పరిమితి, అధిక పదవీవిరమణ వయసు ఆశించిన, అవసరమయిన ప్రజాప్రయోజనాలను చేకూర్చవు.
వాణిజ్య సంస్థల వయసు పక్షపాతం, పెద్ద వయసు ఉద్యోగ దరఖాస్తుదారుల తిరస్కరణలనువెంటనే తప్పనిసరిగా నిలిపివేయాలి. విమానయాన సేవకులు, నర్సులు, భవన నిర్మాణ కార్మికులు వంటి కొన్ని ఉద్యోగాలు మినహా, వయసు, అందం, ఆహార్యం, ఇతర అంశాలకు బదులుగా పని సామర్థ్యం, అర్హత, యోగ్యతల ఆధారంగా ఉద్యోగ దరఖాస్తుదారులను కంపెనీలు అంచనావేయాలి. 35 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న ఉద్యోగ అభ్యర్థులు ఎక్కువ అనుభవజ్ఞులు. పెద్ద వయసులో ఉద్యోగం కోసం లేదా ఉద్యోగం మారడానికి ప్రయత్నించడం వలన వృత్తి సవాళ్ళను దీటుగా ఎదుర్కొంటారు. యువ దరఖాస్తుదారులు చేయలేని విధంగా సంస్థల పోటీతత్వాన్ని నిర్మించి పెంపొందించడంలో వారు సాయపడగలరు. ఇది ప్రారంభ కార్మిక వ్యయం కంటే అనేక రెట్లు విలువైనది. దీర్ఘకాల అభివృద్ధి దృష్ట్యా నిర్దేశించిన సున్నితమయిన గుడ్డి పరిమితులను తొలగించడం ద్వారా కంపెనీలు ప్రయోజనం పొందగలవు.
అంతేకాక కార్యాలయంలో వయసు ఆధార వివక్షను నిషేధించడానికి శాసనపరమైన చర్యలను ప్రవేశపెట్టాలి. ప్రస్తుతం చైనా కార్మిక చట్టంలో అలాంటి నిబంధన లేకపోవడం వల్ల పెద్ద వయసు కార్మికుల పట్ల కంపెనీల పక్షపాతం ఏర్పడింది. వారి ప్రయోజనాలను మరింత మెరుగ్గా పరిరక్షించేందుకు చట్టాలు, నియమాలను మెరుగుపర్చాలి. ప్రజలకు కూడా వయసు సంక్షోభం గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి. ఉద్యోగ సంతల అవసరాలకు అనుగుణంగా వారు తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలి. ఇవి వాస్తవాలు మాత్రమే కాదు, కష్టమయిన పోరాటాలు కూడా. వయసు పట్ల పక్షపాతాన్ని వదిలించుకోడం యజమానులకు, ఉద్యోగులకు మాత్రమే కాక, వృద్ధాప్య వ్యతిరేక పోరాటంలో, ఆధునీకరణ మార్గంలో దేశానికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ పరిష్కారాలను వెంటనే ఆచరణలో పెట్టాలి.
1928 -39ల మధ్య ప్రపంచం తీవ్ర ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంది. అమెరికా, ఇంగ్లండ్ లాంటి పెట్టుబడిదారీ దేశాలు అపాయంలో పడ్డాయి. పెట్టుబడిదారీ విధానాన్ని బతికించడానికి ఇంగ్లండ్ పెట్టుబడిదారీ ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ అనేక సంక్షేమ పథకాలను సూచించారు. వాటిని అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్ డీల్ (కొత్త ఒప్పందం) పేరుతో అనేక రూపాల్లో ధారావాహికంగా అమలు చేశారు. ఈ పథకాలు ప్రజల అభిమానాన్ని చూరగొన్నాయి. మన దేశంతో సహా అనేక పెట్టుబడిదారీ దేశాలు ఆ పథకాలను అమలు చేశాయి, చేస్తూనే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలూ అదే బాటలో పయనిస్తున్నాయి. అయితే అవి అభివృద్ధికి దారితీయని, కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే పథకాలు. కమ్యూనిజాన్ని సడలించి చైనా నమూనా సోషలిజాన్ని పాటిస్తున్న చైనా ఇప్పుడు ఈ పథకాలను అమలు చేయడం లేదు. పెరిగిన కళాశాల విద్యతో ఉద్యోగార్థులు పెరిగారని అందుకే నిరుద్యోగం పెరిగిందని చైనా సమర్థించుకుంటోంది.
ఈ పరిస్థితులు నేడు అన్ని దేశాలకూ వర్తిస్తాయి. వలస వస్తున్న విద్యార్థులతో, చదువరులతో ఉద్యోగాలు చేయించుకుంటూ, దేశ ఉత్పత్తిని పెంచుకుంటూ అదే పరిస్థితిని రాజకీయ సామాజిక సమస్యలకు దారి తీయని విధంగా అమెరికా తన అభివృద్ధికి వాడుకుంటోంది. సామ్రాజ్యవాద వ్యతిరేక శిబిరంలో ప్రధాన ప్రత్యామ్నాయ పాత్ర పోషించ గల చైనా అమెరికా శిబిరానికి విమర్శల అస్త్రాలను అందించరాదు. స్వదేశీ సమస్యల పరిష్కారంలోనూ ఆదర్శంగా నిలవాలి.
సంగిరెడ్డి హనుమంత రెడ్డి
9490204545