Saturday, November 2, 2024

వృద్ధి లెక్కలు!

- Advertisement -
- Advertisement -

Unemployment in India 8.32 per cent in August

 

ఆర్థిక రంగానికి సంబంధించి తాజాగా వెలువడిన వార్తలు ఏక కాలంలో ఆనందాన్ని, అసంతృప్తిని కలిగించేవిగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు మాసాల్లో (ఏప్రిల్ జూన్) స్థూల దేశీయాభివృద్ధి (జిడిపి) పెరుగుదల 20.1 శాతంగా నమోదయింది. అలాగే గడచిన నెల (ఆగస్టు) లో ఎగుమతులు 45 శాతం పెరిగాయి. కొవిడ్ తీవ్రత వల్లనూ, పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి అమల్లో అవకతవకలు వంటి కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల కారణంగానూ దేశ ఆర్థిక రంగం కనీవినీ ఎరుగని అధమ స్థాయికి కూరుకుపోయిందన్న ఆందోళన నేపథ్యంలో ఈ రెండు సమాచారాలు కొత్త ఆశలు కలిగించేవిగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక వృద్ధిని చూపి ప్రభుత్వ వర్గాలు జబ్బలు చరుచుకుంటున్నాయి. ఇది ఎన్‌డిఎ ప్రభుత్వ ఘన విజయమని చెప్పుకుంటున్నాయి. గత ఏడాది పాతాళాన్ని తాకిన వృద్ధి ఊహించినట్టే ఆంగ్ల V అక్షరం మాదిరిగా తిరిగి విశేషంగా పుంజుకుంటున్నదనే వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. దేశంలో కరోనా మొదటిసారి విజృంభించి జాతీయ స్థాయి కఠిన లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన గత ఆర్థిక సంవత్సరం (2020-21) తొలి మూడు మాసాల జిడిపి పెరగడానికి బదులు 24.4 శాతం తరుగుదల (మైనస్) ను రికార్డు చేసింది.

దానితో పోల్చినప్పుడు ఈ ఏడాది తొలి త్రైమాసికం పెరుగుదల గణనీయమైనదే. అదే సమయంలో అంతకు ముందరి (2019 20) ఆర్థిక సంవత్సరం మొదటి మూడు మాసాల కాలంలో సాధించిన ప్రగతితో పోల్చుకుంటే ఈ ఏడాది అదే కాలంలో వృద్ధి కనీసం 7 శాతం తక్కువని రుజువవుతున్నది. అందుచేత కరోనాకు ముందున్న స్థితికి దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తిగా కోలుకోవలసి ఉన్నది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు మాసాల విశేష వృద్ధికి ఎప్పటి మాదిరిగానే వ్యవసాయ, తయారీ రంగాల వికాసమే మూలకారణం. కొవిడ్ రెండవ వేవ్ విజృంభించిన ఈ కాలంలో స్థానిక లాక్‌డౌన్లు అమల్లో ఉన్నప్పటికీ తయారీ రంగం 49.6 శాతం వృద్ధిని చవిచూడడం విశేషమేనని నిపుణులు భావిస్తున్నారు. అలాగే గతంతో పోల్చుకుంటే దేశంలో వినియోగం ఈ కాలంలో చెప్పుకోదగినంతగా పెరగడం, ఎగుమతులు వృద్ధి చెందడం కూడా ఈ ఏడాది తొలి త్రైమాసికం జిడిపి విశేష వికాసానికి తోడ్పడ్డాయని బోధపడుతున్నది. గడిచిన నెల (ఆగస్టు) లో ఎగుమతులు 45 శాతం పెరగడం విశేషమే. ఇది గత ఏడాది ఆగస్టులో రికార్డు అయిన దాని కంటే 45.1 శాతం అధికం కాగా, అంతకు ముందటి ఏడాది (2019) ఆగస్టులో సాధంచిన వృద్ధి కంటే 27.5 శాతం ఎక్కువ కావడం హర్షదాయం.

అయితే ఈ ఆనందం గాలిని తీసివేస్తూ ఈ ఆగస్టులో దేశ వాణిజ్య లోటు గత నాలుగు మాసాల కాలం లో ఎప్పుడూ లేనంత అత్యధికంగా నమోదయింది. బంగారం దిగుమతులు అపరిమిత స్థాయిలో పెరగడం వల్లనే ఈ వాణిజ్య లోటు సంభవించిందని చెబుతున్నారు. 2020 ఆగస్టు నెలలోని బంగారం దిగుమతుల కంటే ఈ ఏడాది అదే నెలలోని దిగుమతులు 82.22 శాతం అధికం. 2020 ఆగస్టులో 3.7 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకోగా, ఈ ఏడాది ఆగస్టులో ఈ దిగుమతుల విలువ 6.7 బిలియన్ డాలర్లు. దేశ ఆర్థిక వృద్ధి రేటు పెరుగుదల ప్రయోజనాలు ఎవరికి చేరుతున్నాయోగాని దేశ జనాభాలోని అత్యధిక భాగంగా ఉన్న పేద, మధ్య తరగతి ప్రజలకు మాత్రం అణుమాత్రమైనా, ఆవంతైనా చెందడం లేదు. ఇది అందరి కళ్లముందున్న చేదు సత్యమే. ప్రభుత్వ రంగంలో విద్య, వైద్యం ఎంత హీనంగా ఉన్నాయో కొవిడ్ విజృంభణ నేపథ్యంలో నగ్నంగా రుజువైంది. ఆన్‌లైన్ విద్య నిరుపేద, దిగువ మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు గగన కుసుమమైపోయింది. కొవిడ్‌లో ప్రాణాలరచేత పట్టుకొని హాహాకారాలు చేసిన మెజారిటీ ప్రజలను తగు రీతిలో ఆదుకోలేక చతికిలపడిన తీరులోనే ప్రభుత్వ వైద్య రంగం దుస్థితి కళ్లకు కట్టింది.

కరోనా వరుస లాక్‌డౌన్ల వల్ల, కేంద్ర ప్రభుత్వ అతి సంస్కరణల విధానాల వల్ల జనం ఉద్యోగాలు, ఉపాధులు కోలోడంతో అప్పటికే ఉన్న నిరుద్యోగం మరింత పెరిగిపోయింది. గడిచిన ఆగస్టులో దేశంలో నిరుద్యోగం 8.32 శాతంగా నమోదయింది. దేశ వ్యాప్తంగా మరి 16 లక్షల మంది నిరుద్యోగంలోకి జారిపోయారు. ఉద్యోగాలు, ఉపాధులు కోల్పోయి ఉన్నదీ లేనిదీ అమ్ముకొని బతుకుతున్న సాధారణ జనాన్ని నేరుగా నగదు అందించడం వంటి పథకాలతో ఆదుకుంటే వారి కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక రంగం నిజమైన అభివృద్ధిని సాధిస్తుంది. కాని అటువంటి హితవులు కేంద్ర పాలకుల చెవికెక్కడం లేదు. కార్పొరేట్ శక్తుల మీద ఉన్న ప్రేమ ఓటు వేసి తమను అధికారంలోకి పంపించే సాధారణ ప్రజల మీద పాలకులకు లేకపోడమే ఆర్థిక రంగ అభివృద్ధి డొల్ల తనానికి అసలైన కారణం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News