Wednesday, January 22, 2025

లోక్‌సభ ఎన్నికల్లో నిరుద్యోగమే ప్రధాన అంశం : ఖర్గే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బీజీపీ సృష్టించిన నిరుద్యోగ సమస్యే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన అంశం అవుతోందని, ఉద్యోగాల కోసం యువత నిరీక్షిస్తోందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పష్టం చేశారు. ఈమేరకు ఆదివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. యువత ఉద్యోగాల కోసం ఎంతగానో ఎదురు చూస్తోంటే మనమంతా జనాభా పీడకలను కంటున్నామని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి నిరుద్యోగ రేటు మూడు రెట్లు పెరిగిందని చెప్పారు. దేశంలో ఐఐటి, ఐఐఎంలు వంటి ప్రముఖ విద్యాసంస్థలను పరిశీలిస్తే 12 ఐఐటీల్లో దాదాపు 30 శాతం మంది విద్యార్థులు రెగ్యులర్ ప్లేస్‌మెంట్‌లు పొందడం లేదని, 21 ఐఐఎంల్లో కేవలం 20 శాతం మాత్రమే సమ్మర్ ప్లేస్‌మెంట్లు ఇంతవరకు పూర్తయ్యాయని పేర్కొన్నారు.

ఐఐటీలు, ఐఐఎంల్లోనే ఈ పరిస్థితి ఉంటే దేశ వ్యాప్తంగా యువత భవిష్యత్తును బీజేపీ ఎలా నాశనం చేసిందో ఊహించుకోవచ్చని ధ్వజమెత్తారు. దేశం లోని ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఇటీవల విడుదలైన ఐఎల్‌ఒ నివేదికను ప్రస్తావిస్తూ ఏటా దేశంలో కార్మికుల శక్తిలో దాదాపు 70 లక్షల నుంచి 80 లక్షల వరకు యువత చేరుతోందని, 2012 2019 మధ్య కాలంలో ఉద్యోగాల కల్పనలో సున్నా అభివృద్ధి కనిపించిందని, కేవలం 0.01 శాతమే చూపించిందని పేర్కొన్నారు.

రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోడీ కీ గ్యారంటీ యువకుల హృదయాల్లో, ఆలోచనల్లో దుస్వప్నంగా ప్రతిధ్వనిస్తోందని విమర్శించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ‘పెహ్లీ నౌక్రీ పక్కీ ’ హామీని మేనిఫెస్టోలో పెట్టిందని, అధికారం లోకి రాగానే కాంగ్రెస్ అమలు చేసి తీరుతుందని స్పష్టం చేశారు. యువకుల్లో 25 ఏళ్ల లోపు వారు ఎవరైనా డిప్లొమా లేదా డిగ్రీ అర్హత పొంది ఉంటే ఉద్యోగం కోసం డిమాండ్ చేసే చట్టపరమైన అర్హత ఉంటుందని, వారికి ఏటా కనీసం రూ. లక్ష అందజేయడమవుతుందని ఖర్గే చెప్పారు. దీనివల్ల పనికి, శిక్షణకు మధ్యనున్న అవాంతరాలు తొలగుతాయని, కెరీర్ అభివృద్ధికి తాజా అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News