Monday, December 23, 2024

ఈ నెల 28న నల్గొండలో నిరుద్యోగ సభ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రేవంత్ రెడ్డి , ఉత్తమ్‌కుమార్ రెడ్డి మధ్య సయోధ్య కుదిరింది. ఈ నెల 28న నిరుద్యోగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, నల్గొండ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య సయోధ్య కుదిరింది. కాంగ్రెస్ పార్టీ నేత నదీమ్ అహ్మద్ ఈ ఇద్దరి నేతల మధ్య సయోధ్య కుదిర్చారు. దీంతో నల్గొండలో రద్దు చేసిన నిరుద్యోగ సభను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28న నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్శిటీలో నిరుద్యోగ సభను నిర్వహించనున్నారు. ఈ నెల 21న నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్శిటీలో నిరుద్యోగ నిరసన సభను నిర్వహించనున్నట్టుగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం ప్రకటిం చారు అయితే నల్గొండ ఎంపిగా ఉన్న తనకు తెలియకుండానే ఈ సభను ప్రకటించడంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఈ విషయమై పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావ్ థాక్రేకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 21న నల్గొండలో నిర్వహించతలపెట్టిన నిరుద్యోగ సభను బుధవారం సాయంత్రం రద్దు చేస్తున్నట్టుగా పిసిసి ప్రకటించింది. ఈ విషయమై నదీమ్ అహ్మద్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డితో మాట్లాడారు. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చారు. దీంతో నల్గొండలో నిరుద్యోగ సదస్సును నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28వ తేదీన మహాత్మాగాంధీ యూనివర్శిటీలో నిరుద్యోగ సభను నిర్వహించనున్నారు.
నిరుద్యోగ నిరసన దీక్షల తేదీలను ప్రకటించిన కాంగ్రెస్
నిరుద్యోగ సమస్యలపై పోరాటాన్ని మరింత ముమ్మరం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. రాష్ట్రంలో నిర్వహించనున్న నిరుద్యోగ నిరసన దీక్షల తేదీలను పిసిసి ప్రకటించింది. శుక్రవారం నల్గొండలో జరగాల్సిన నిరుద్యోగ నిరసన సభను ఎంపిలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచన మేరకు ఈనెల 28కి వాయిదావేశారు. ఈనెల 24న ఖమ్మం, 26న ఆదిలాబాద్, మే1న రంగారెడ్డి జిల్లాలో నిరుద్యోగ నిరసన సభలు నిర్వహించాలని హస్తం నేతలు నిర్ణయించారు.
రేణుక నివాసంలో కాంగ్రెస్ నేతల భేటీ…
మరోవైపు ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని రేణుకా చౌదరి నివాసంలో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఖమ్మంలో జరగనున్న నిరుద్యోగ బహిరంగ సభపై చర్చించారు. ఈ సమావేశంలో రేవంత్‌రెడ్డి, బలరాం నాయక్, షబ్బీర్ అలీ, అంజన్‌కుమార్, గడ్డం ప్రసాద్, సురేశ్ షెట్కార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలపై పోరాడేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగానే టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ వ్యవహారంపై ఉద్యమాన్ని మరింత కొనసాగించాలని నిర్ణయించింది. ఈనేపథ్యంలోనే విశ్వవిద్యాలయాల్లో నిరుద్యోగ నిరసన దీక్ష సభలు ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రధానంగా ప్రశ్నపత్రాలు ఏ విధంగా లీక్ అయ్యాయి..? అందుకు బాధ్యులు ఎవరు..? అన్న కోణంలో యువతకు వివరించి, తద్వారా ఓటర్లను తమవైపు ఆకర్షితులను చేసుకునే దిశలో కాంగ్రెస్ పార్టీ అడుగులు ముందుకు వేస్తోంది.
రాష్ట్రానికి ప్రియాంక గాంధీ రాక…
ఈ క్రమంలోనే మే 4 లేదా 5న హైదరాబాద్ సరూర్‌నగర్ మైదానంలో భారీ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రియాంక గాంధీని ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. ఇందులో భాగంగానే అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లపై కాంగ్రెస్ దృష్టి సారించింది. మరోవైపు టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ అంశంపై ఇప్పటికే ఆందోళనలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంపై ఉద్యమాన్ని వేగవంతం చేసింది. సిట్ విచారణపై నమ్మకం లేదని, సిబిఐకి కానీ, సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే విచారణ చేపట్టిన ధర్మాసనం సిట్ దర్యాప్తునకు సంబంధించి పూర్తి వివరాలు తమకు నివేదించాలని ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News