Friday, November 22, 2024

విద్యలో మనమెక్కడ?

- Advertisement -
- Advertisement -

UNESCO Report 2021 on Education in India Revealed

దేశంలో విద్యా రంగం ఎంత అధ్వాన్న స్థితిలో ఉందో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) అద్దంలో స్పష్టంగా చూడొచ్చు. దేశ వ్యాప్తంగా 11 లక్షల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అందులో 69 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఏర్పడ్డాయనీ, భారత దేశంలో విద్యాస్థాయిపై విడుదలైన యునెస్కో నివేదిక 2021 వెల్లడించింది. దేశంలో ఒకే టీచర్‌తో నడుస్తున్న పాఠశాలలు లక్ష వరకు ఉన్నట్టు ఈ నివేదిక కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. ‘ఉపాధ్యాయులు లేరు తరగతులూ లేవు’ అనే శీర్షిక కింది వెలువడిన ఈ నివేదిక మన దేశంలో విద్యా రంగం గురించి మరెన్నో బాధాకరమైన అంశాలను పూసగుచ్చింది. దేశంలో 18-29 సంవత్సరాల్చొన వారు 22 శాతం ఉన్నారు. అంటే 26 కోట్ల 10 లక్షల మంది. 10-24 వయసులోని యువత 35 కోట్ల 60 లక్షల మంది. సంపద పెంచడానికి అవసరమైన యువత ఇంతగా ఉండగా, వారికి ఆధునిక చదువులు, నైపుణ్యాలు కలిగించలేకపోడం మన పాలకుల వైఫల్యమే. ఐదవ తరగతి చదువుకొంటూ రెండవ తరగతి వాచకం నిర్దుష్టంగా చదవడం చేతగాని విద్యార్థులు దేశంలో అసంఖ్యాకంగా ఉన్నారు. అలాగే 10వ తరగతిలోని విద్యార్థులు 8వ తరగతి లెక్కలు చేయలేకపోడం, వాక్యాలు రాయలేకపోడం వంటి దుర్గతి మన విద్యా రంగాన్ని పీడిస్తున్నది.

మొత్తంగా దేశంలో తయారవుతున్న పట్టభద్రుల్లో, సాంకేతిక విద్యోన్నతుల్లో వస్తూత్పత్తికి అవసరమైన తెలివితేటలుండి పరిశ్రమల యజమానులను సంతృప్తి పరచగల నేర్పు, నైపుణ్యాలు గలవారు బహు తక్కువగా ఉండడమే మన విద్యా రంగం చేతగాని తనాన్ని రుజువు చేస్తున్నది. ప్రాక్టికల్స్ కంటే పాఠాలకే ప్రాధాన్యమిచ్చే పనికిరాని విద్యా విధానం మనది అనడం సాహసమనిపించవచ్చు గాని ముమ్మాటికీ వాస్తవం. యునెస్కో నివేదిక ప్రకారం పూర్వ ప్రాథమిక విద్య నేర్పుతున్న ఉపాధ్యాయుల్లో 7.7 శాతం మంది, ప్రాథమిక స్థాయి చదువు చెబుతున్న వారిలో 4.6 శాతం మంది, ప్రాథమికోన్నత టీచర్లలో 3.3 శాతం మంది ఆ స్థాయికి తగిన విద్యార్హతలు లేనివారేనని వెల్లడైంది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో విద్యకు కేటాయింపులను గత ఏడాది కంటే 6.13 శాతం తగ్గించిన చేదు వాస్తవమే మన పాలకులకు ఆ రంగాన్ని చక్కదిద్దడంపై గల మక్కువ వెల్లడవుతున్నది. విద్య పట్ల కేంద్ర ప్రభుత్వమే ఇంత చిన్నచూపు చూపుతుంటే రాష్ట్రాలు ఇంకెంత తక్కువ ప్రాధాన్యత ఇస్తాయో ఊహించవచ్చు. సర్వశిక్షాఅభియాన్ ప్రాథమిక విద్యా స్థాయిలో బాలికల చదువును మెరుగుపరిచే జాతీయ కార్యక్రమం, మధ్యాహ్న భోజన పథకం, విద్యా హక్కు చట్టం, బేటీ బచావో, బేటీ పడావో, కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ, మైనారిటీ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పన వంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడమే తప్ప అవి దేశంలోని బాలల్లో సాధిస్తున్న విద్యా వికాసం ఎటువంటిదో తెలియదు.

దానిని పరిశీలించి తగిన మెరుగుబాటు చర్యలు తీసుకునే వ్యవస్థ దాదాపు లేదనే చెప్పవచ్చు. 201920 సంవత్సరంలో సెకండరీ విద్యా స్థాయిలో చదువు మానేసిన వారు (డ్రాపౌట్లు) ఆ తరగతుల్లోని మొత్తం విద్యార్థుల్లో 17 శాతం కాగా, ప్రాథమికోన్నత (68 తరగతులు) స్థాయిలో 1.8 శాతం, ప్రాథమిక స్థాయిలో 1.5 శాతం ఉన్నట్టు వెల్లడైంది. ముందుకు వెళుతున్నకొద్దీ చదువులు మానేస్తున్న వారి శాతం ఎక్కువగా ఉన్నట్టు రూఢి అవుతున్నది. దీనికి ప్రభుత్వం వైపు నుంచి తగిన శ్రద్ధాసక్తులు కొరవడడమే కారణం. దేశంలో పూర్వ ప్రాథమిక నుండి సెకండరీ స్థాయి వరకు 15 లక్షల పాఠశాలలున్నాయి, 97 లక్షల మంది టీచర్లున్నారు. 26.5 కోట్ల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన విద్యా వ్యవస్థ. కాని ఫలితాలు మాత్రం కడుదయనీయం. ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యాప్రమాణాలు దారుణంగా పడిపోయాయనే సంగతిని పదేపదే చెప్పుకోనక్కర లేదు. ఉత్తరప్రదేశ్‌లో 3.3 లక్షల టీచర్ పోస్టులు ఖాళీ ఉండగా, బీహార్‌లో 2.21 లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ కాకుండా ఉన్నాయి. అలాగే బెంగాల్‌లో 1.1 లక్షల అధ్యాపక ఖాళీలు ఏర్పడ్డాయి. ఇన్నిన్ని లక్షల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న దేశంలో విద్య వికసిస్తుందని ఆశించలేము.

చదువు బాగుంటే చక్కెర చుట్టూ చేరే చీమల బారుల్లా విద్యార్థులు పాఠశాలలకు ఎగబడుతారు. శిథిలమైపోయి భయపెట్టే గోడలు, పై కప్పులు, విరిగిన తలుపులు, దుర్వాసన చిమ్మే టాయ్‌లెట్లు, అసలు మరుగుదొడ్లే లేని, ఉన్నా స్త్రీలకు ప్రత్యేకంగా ఎటువంటి ఏర్పాటూ లేని పాఠశాలలు దేశంలో అసంఖ్యాకంగా ఉన్నాయి. ఇలాంటి పాఠశాలలకు విద్యార్థులు ఎందుకు వస్తారు? దేశంలో దాదాపు 90 నుంచి 95 శాతం పాఠశాలలు మౌలిక సదుపాయాల లేమితో బాధపడుతున్నాయని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియా ఒక సందర్భంలో అన్నారు. దేశంలోని 84.1 శాతం పాఠశాలల్లో గ్రంథాలయాలున్నప్పటికీ అందులో 69.4 శాతం లైబ్రరీల్లో ఒక్క పుస్తకమూ లేదని నిగ్గు తేలింది. ఇటువంటి ఊసర క్షేత్రంలో చదువుల మొలకలు ఎలా పుడతాయి, ఎలా బలపడి మొక్కలై పూలు పూస్తాయి?

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News