Thursday, January 23, 2025

వృద్ధిలో మేటి

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వాలుంటే (డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు) బాగా అభివృద్ధి జరుగుతుందని చెప్పే పార్టీలకు ధీటైన జావాబిచ్చారు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, మున్సిపల్ వ్యవహారాల శాఖామంత్రి కె.తారక రామారావు. డబుల్ ఇంజన్ ప్రభుత్వాలున్న వాటికంటే తెలంగాణ రాష్ట్రంలో అనూహ్యమైన ఆర్ధికాభివృద్ధి జరిగిందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజన జరిగేనాడు 2013-14వ ఆర్ధిక సంవత్సరంలో 4,51,580 కోట్ల జి.ఎస్.డి.పి. ఉంటే రికార్డుస్థాయిలో 2021-22వ ఆర్ధిక సంవత్సరం నాటికి ఏకంగా 11,48,114 కోట్ల రూపాయలకు పెరిగిందని మంత్రి కె.టి.ఆర్. తెలిపారు. అంటే 128.3 శాతం అభివృద్ధిని సాధించామని, ఇది డబుల్ కంటే ఎక్కువని ఆర్.బి.ఐ.రికార్డులు స్పష్టంచేశాయి.

దేశంలో మరే ఇతర రాష్ట్రం సాధించనంతటి అభివృద్ధి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే జరిగిందని మంత్రి కె.టి.ఆర్. ట్విట్టర్‌లో తెలిపారు. ఈ గణాంకాలు తాను చెబుతున్నది కాదని, సాక్షాత్తూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్.బి.ఐ) నివేదికలు స్పష్టంచేస్తున్నాయని, ఆర్.బి.ఐ.ట్వీట్‌కు మంత్రి కెటిఆర్ రీ ట్వీట్ చేస్తూ ఈ విషయాలను వెల్లడించారు. అంతేగాక రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం కూడా రాష్ట్ర విభజన సమయంలో అంటే 2013-14వ ఆర్ధిక సంవత్సరంలో ఒక లక్షా 12 వేల 162 రూపాయలుగా ఉంటే అది 2021-22వ ఆర్ధిక సంవత్సరానికి 2 లక్షల 75వేల 443 రూపాయలకు పెరిగిందని మంత్రి కె.టి.ఆర్. తెలిపారు. ఈ ఘనతను సాధించడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే ప్రధాన కారణమని ఈ ఫలితాలు స్పష్టంచేస్తున్నాయి.

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా ఇంతటి రికార్డు స్థాయి అభివృద్ధిని ఏ రాష్ట్రమూ సాధించలేదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అడుగడుగునా ఎన్నో ఇబ్బందులను సృష్టిస్తూన్నప్పటికీ, రుణాల సేకరణకు అడ్డుపుల్లలు వేస్తున్నప్పటికీ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు యధావిధిగా కొనసాగుతూనే ఉన్నాయని, అందుచేతనే ఇంతటి అభివృద్ధి సాధ్యమయ్యిందని కొందరు సీనియర్ అధికారులు సగర్వంగా వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలు, రోడ్లు, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు, భవనాలు తదితర భారీ నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులు పెద్ద సంఖ్యలో నిర్మిస్తుండటం, గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వృత్తులకు చేతినిండా పని కల్పించడం, ఉపాధి హామీ పనులు, గ్రామీణ రోడ్లు, చేపల చెరువులు, మండు వేసవిలో కూడా మిషన్ కాకతీయ పథకంలో సుమారు 54 వేల చెరువుల్లో పుష్కలంగా నీరుండటం, జలాశయాల్లో నీరుండటం, పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయానికి నిరంతరాయంగా 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తుండటంవంటి పథకాలతో ప్రజలకు అన్నిరకాలుగా పనులు లభించడంతో అనూహ్యమైన ఎకనమిక్ యాక్టివిటీ పెరగడంతో తలసరి ఆదాయం రికార్డుస్థాయిలో పెరిగిందని ఆర్ధికశాఖలోని కొందరు సీనియర్ అధికారులు వివరించారు.

ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా పెరిగిందని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ఆ పథకాలకు నిధులను ఖర్చు చేస్తున్న విధానాలు, ఆర్ధిక క్రమశిక్షణ పాటిస్తున్న వైనం, ఆర్ధిక వనరుల సమీకరణకు అనుసరిస్తున్న విధానాలను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్.బి.ఐ) కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కీర్తించింది కూడా. పరిమితులకు మించి అప్పులు చేసి ఆర్ధికంగా దివాళా తీసిన రాష్ట్రాల్లో 48 శాతం అప్పులతో జమ్ము-కాశ్మీర్ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతుండగా కేవలం 16.1 శాతం స్వల్ప అప్పులతో తెలంగాణ రాష్ట్రం చివరిస్థానంలో ఉందని ఆర్.బి.ఐ. నివేదిక స్పష్టంచేసింది.

అభివృద్ధి పథకాలకు ఖర్చు చేసే క్యాపిటల్ వ్యయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిన నిధులను యధావిధిగా, నిజాయితీగా ఖర్చు చేస్తుండటాన్ని ఆర్.బి.ఐ. ప్రస్ఫుటంగా గుర్తించింది. పన్నుల వసూళ్ళల్లోగానీ, రాష్ట్ర సొంత ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో ప్రజలపై ఎలాంటి అదనపు భారాన్ని మోపకుండా ఆదాయాన్ని రాబట్టుకొంటున్న విధానాన్ని ఆర్.బి.ఐ.కొనియాడింది కూడా. అంతేగాక ఎఫ్.ఆర్.బి.ఎం. నిబంధనలకు లోబడే తెలంగాణ ప్రభుత్వం రుణాలను సేకరించుకొందని గత జనవరిలో ఆర్.బి.ఐ. నిర్ధారించిందని గుర్తు చేస్తున్నారు. అందుకే డబుల్ ఇంజన్ రాష్ట్రాల కంటే కూడా తెలంగాణ రాష్ట్రం రికార్డుస్థాయిలో ఆర్ధికాభివృద్ధిని సాధించిందని అంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News