Monday, December 23, 2024

బాల ప్రపంచం: యునిసెఫ్ పాత్ర

- Advertisement -
- Advertisement -

ఎన్నో సమస్యలు వాటి పరిష్కారానికి ఎన్నో వేదికలు ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడ్డాయి. అలాంటి వాటిలో యునిసెఫ్ ఒకటి. బాలల కోసం ఏర్పడిన యునిసెఫ్ బాలల ప్రపంచాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేయా లి. భావి తరాల భద్రతలో ‘యునిసెఫ్’ పాత్ర కీలకం. ప్రపంచంలో అనేక దేశాలు, వాటిని పాలించడానికి అనేక ప్రభుత్వాలు, రాజ్యాంగాలు, అవి సజావుగా కొనసాగడానికి వివిధ వ్యవస్థలు, యంత్రాంగాలు ఏర్పడుతున్నాయి. వీటితో పాటు అనేక వేదికలు, సంస్థలు ప్రపంచ ప్రజల శ్రేయస్సు కోసం నెలకొల్పబడుతున్నాయి. ప్రపంచంలో నెలకొల్పబడే వివిధ రకాల సంస్థల వలన, యంత్రాంగాల వలన ప్రజల సమస్యలు, జీవన స్థితిగతులు మెరుగుపడితే ఆ సంస్థల మనుగడ సాధ్యపడుతున్నది. నిరుపయోగంగా మారితే ఆ సంస్థల విలువ శూన్యమై అంతరించకతప్పదు. ప్రపంచంలో శాంతి కోసం నెలకొల్పబడిన నానాజాతి సమితి ఆ కోవలోకే వస్తుంది. యుద్ధాలను, అశాంతిని నిలువరించడంలో విఫలమైన నానాజాతిసమితి నిర్వీర్యమై పోయి దాని స్థానంలో 1945, అక్టోబర్ 24వ తేదీన అమెరికాలో న్యూయార్క్ కేంద్రంగా ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించింది.

ఐక్యరాజ్య సమితిలో ఆరు ప్రధానాంగాలు వివిధ లక్ష్యాల సాధన కోసం ఏర్పడ్డాయి. ఇవి కాకుండా వివిధ రకాల సమస్యల పరిష్కారం కోసం, విశ్వజనావళి శ్రేయసు కోసం ఐరాస ఆధ్వర్యంలో ప్రస్తుతం 15 ప్రత్యేక ఏజెన్సీలు ఏర్పడ్డాయి. వాటిలో యునిసెఫ్ ఒకటి. రెండవ ప్రపంచ యుద్ధంలో బాధితులైన తల్లుల, పిల్లల సంరక్షణకు పాటుబడి, వారికి అత్యవసర ఆర్ధిక, ఆహార సరఫరా చేయడానికి ఏర్పడిన ‘యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఫండ్’ సంక్షిప్త నామం యునిసెఫ్. యునిసెఫ్ 1946వ సంవత్సరం డిసెంబర్ 11వ తేదీన న్యూయార్క్ కేంద్రంగా ఏర్పడింది. ఐరాస సర్వసభ్య సమితి రెండవ ప్రపంచ యుద్ధం వలన ఏర్పడిన పరిస్థితుల నుండి బాలల దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని, వర్ధమాన దేశాల్లో బాలల స్థితిగతులను మెరుగుపరచడానికి యునిసెఫ్ ప్రయత్నించింది. 1953వ సంవత్సరంలో యునిసెఫ్ ఐక్యరాజ్య సమితిలో ఒక విభాగంగా మారింది. 1953 తర్వాత కూడా ఈ ప్రత్యేక విభాగం యునిసెఫ్ అనే పేరుతో కొనసాగుతున్నా దీనిలో ఎమర్జెన్సీ, ఇంటర్నేషనల్ అనే పదాలనుతొలగించి ‘యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్’ గా పిలువబడుతున్నది.

బాలల సంక్షేమం కోసం ఏర్పడిన అతిపెద్ద ప్రపంచ సంక్షేమ సంస్థ యునిసెఫ్. బాల్యాన్ని కాపాడి, వారికి సరైన విద్య, వైద్య, ఆరోగ్య సదుపాయాలు కల్పించడం, పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు, వ్యాధుల నియంత్రణ చర్యలు, మాతా శిశు సంరక్షణ వంటి చర్యలు చేపట్టడం కోసం ఐరాస సహాయ పునరావాస పాలనా విభాగం ద్వారా ఏర్పడిన ఒక ప్రత్యేక విభాగం యునిసెఫ్. శిశు మరణాలను అరికట్టడం, బాలల భద్రత, ఆరోగ్య సంరక్షణ, బాలల హక్కుల పరిరక్షణవంటి బాధ్యత యునిసెఫ్ భుజస్కందాలపై వుంది. గత నాలుగైదు సంవత్సరాల కాలంలో బాల కార్మికుల సంఖ్య 8 మిలియన్లు పెరిగి, 160 మిలియన్లకు చేరింది. కోవిడ్ సమయంలో బాలలు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు. అయితే గత దశాబ్ద కాలంగా ప్రపంచంలో 38% బాల కార్మికులు తగ్గారని, ప్రస్తుత బాల కార్మికుల సంఖ్య 152 మిలియన్లుగా ఐఎల్‌ఒ నివేదిక ద్వారా అవగతమవుతున్నది. ప్రపంచంలో ప్రతి 10 మందిలో ఒకరు వివిధ కారణాల వలన బాల కార్మికులుగా మారుతున్నారు. ఆఫ్రికా దేశాల్లో 70 మిలియన్లకు పైగా బాల కార్మికులున్నారు.

తర్వాత ఆసియా, ఫసిఫిక్ దేశాల్లో అధిక శాతం బాల కార్మికులున్నారు. 2025 నాటికి బాలకార్మికుల సంఖ్యను జీరో స్థాయికి తేవాలని ఐఎల్‌ఒ ప్రయత్నం. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని యూనిసెఫ్, ఐఎల్‌ఒలు బాలల భద్రత విషయంలో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలి. వివిధ దేశాల ప్రభుత్వాల, ప్రైవేటు దాతల విరాళాలతో యునిసెఫ్ విస్తృతంగా సేవలనందిస్తున్నది. యునిసెఫ్ విధివిధానాలను అర్ధిక ప్రణాళికలను, కార్యక్రమావళిని నిర్దేశించడానికి 36 మంది కార్యనిర్వాహక సభ్యుల బోర్డు నిర్దేశిస్తుంది. న్యూయార్క్ కేంద్రంగా పని చేస్తున్న యునిసెఫ్‌కు డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్ మానవతా సహాయానికి ప్రధాన కేంద్రంగా వ్యవహరిస్తున్నది. 150 దేశాల్లో విస్తృతమైన నెట్‌వర్క్ కలిగిన యునిసెఫ్ బాలల సమస్యల పరిష్కారం కోసం, వారి భద్రత ఆరోగ్యం కోసం, విద్యా సౌకర్యాల మెరుగుదల కోసం, బాలల హక్కుల పరిరక్షణ కోసం మరింత పటిష్టవంతమైన ప్రణాళికతో ముందుకు సాగాలి. ప్రపంచంలో 14 సంవత్సరాలలోపు గల బాలల సంఖ్య 2 బిలియన్లు. వివిధ సామాజిక, ఆర్థిక కారణాల వలన పాఠశాలలకు దూరంగావున్న బాలల సంఖ్య ప్రపంచ వ్యాప్తం గా 250 మిలియన్లు.

సబ్ సహారన్ ఆఫ్రికాలో 98 మిలియన్లకుపైగా బాలలు చదువుకు దూరంగా ఉన్నారని యునెస్కో అంచనా. నైజీరియాలో 20 మిలియన్లు, ఇథియోపియాలో 10 మిలియన్ల మందికి పైగా, కాంగోలో 6 మిలియన్లు, కెన్యాలో సుమారు 2 మిలియన్ల మంది బాలలు, యువకులు విద్యకు నోచుకోక వెనుకబడి వున్నారు.అఫ్ఘానిస్తాన్‌లో 8 మిలియన్ల మంది బాలల విద్యకు దూరం గా వున్నారు. ప్రపంచంలో 16% మంది బాలలు పాఠశాలలకు దూరంగా వున్నారు. ఇదిలా వుండగా బాలల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపకపోవడం వలన అనారోగ్య కారణాలతో చాలా మంది బాలలు చదువును కొనసాగించలేకపోతున్నారు.కొంతమంది ఆర్ధిక ఒడిదుడుకుల వలన చదువుకు స్వస్తి చెబుతున్నారు. కొన్ని దేశాల్లో పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం వలన బాలల తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపించడం లేదు. పలు కారణాల వలన బాల్యం విద్యా వికాసం లేక వెలవెలబోతున్నది. బాల్యం అనారోగ్యభరితమై, అర్ధాంతరంగా ముగియడం ఒక శాపంగా భావించక తప్పదు. బాలలు ఎదుర్కొంటున్న ప్రమాదకరమైన వ్యాధులకు తగిన చికిత్స సత్వరమే అందించగలగాలి.

బాలల్లో రోగ నిరోధక శక్తి పెంపుదల కోసం, పౌష్టికాహార లోపం నిరోధించడానికి అంతర్జాతీయ బాలల వేదికలు తగిన కృషి చేయాలి. బాలలకు వైద్యం ముఖ్యంగా టీకాల విషయంలో తల్లిదండ్రులు, ప్రభుత్వాలు తగిన జాగరూకతవహించాలి. అనారోగ్యం, ఆకలి కేకలు, ఆర్ధిక అంతరాలు బాలల జీవితాలను శాసిస్తుంటే, బాలల ప్రగతి ఎలా సాధ్యం? బాలలకు కనీసం పాఠశాల విద్య అందించడంలో కూడా కొన్ని దేశాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో 2030 నాటికి అందరికీ నాణ్యమైన విద్య అనే యునెస్కో లక్ష్యసాధన సాధ్యమేనా? ప్రపంచం అనేక రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నది. సాంకేతిక పరిజ్ఞానం సకల రంగాలను శాసిస్తున్నది. మానవ విజ్ఞానం వటవృక్షంలా విస్తరించింది. విజ్ఞానం ఎంతగా పెరిగినా మనిషిని మనిషిగా బతకనిచ్చే పరిస్థితులు నేటి ప్రపంచంలో కానరావడం లేదు. చివరికి బాలలను సైతం తమ స్వార్ధానికి వినియోగించుకుని, ప్రమాదకరమైన పనుల్లో వారిని నియమించుకొని, తక్కువ వేతనాలతో ఎక్కువ లాభాలను గడించడం, బాలలపై శారీరక, లైంగిక హింసకు పాల్పడడం,

మాదక ద్రవ్యాలు, ఉగ్రవాద కార్యకలాపాల వంటి అసాంఘిక వ్యవస్థల వైపు బాలల జీవితాలను విసిరేయడం అత్యంత హేయం. ప్రపంచంలో ఈనాటికీ పలువురు బాలలకు తినడానికి సరైన తిండి లేదు. తాగడానికి సరైన నీరు లేదు, విద్యావకాశాలు లేవు. పారిశుధ్య సౌకర్యాలు లేవు. పోషకాహార లోపంతో పలువురు బాలలు అనారోగ్యవంతులుగా బాల్యంలోనే వృద్ధాప్యాన్ని అనుభవిస్తున్నారు. ఇలాంటి అస్తవ్యస్త పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచం ఎలా పురోభివృద్ధి చెందుతుంది? భావి పౌరులు మానసిక వికాసంతో స్వేచ్ఛగా, ఆరోగ్యవంతమైన వాతావరణంలో జీవించే పరిస్థితులను నెలకొల్పడంలో ‘యునిసెఫ్ పాత్ర’ అత్యంత కీలకం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News