మన తెలంగాణ/హైదరాబాద్ : నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరవాసులు వణికి పోతున్నారు. నగరంలో గడిచిన 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటీకే నగరవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. శనివారం ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షంతో మరింత భయాందోళనలకు గురైయ్యారు. అదే పనిగా వర్షం కురుస్తుండడంతో నగర మొత్తం చిత్తడి చిత్తడి మారడమే కాకుండా పలు ప్రధాన మార్గాల్లో వరద నీటితో పాటు బురద పెరుకుపోతోంది. దీంతో నగర ప్రయాణికులు గడిచిన వారం రోజులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు లొతట్టు ప్రాంతాలు మాటిమాటికీ జలమయం కావడం, ఇళ్లలోకి వరద నీరు చేరుతుండడంతో స్థానికులు అష్ట కష్టాలు పడుతున్నారు. మరోవైపు డ్రైనేజీలు పొంగిపొర్లుతుండడంతో మురుగు నీరుతో కారణంగా దుర్వాసనతో పలుకాలనీలు, బస్తీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు.
అప్రమత్తమైన బల్దియా
భారీ వర్షాల నేపథ్యంలతో బల్దియా అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ మాస్సూన్ ప్రత్యేక సహాయక బృందాలను మోహరించారు. రోడ్లపై నిలిచిన నీటిని ఎప్పటికప్పుడు ఈ బృందాలు తొలగిస్తున్నాయి. అయితే వర్షం ఏకదాటిగా కురుస్తుండడంతో నగరవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటీకే కురిసిన వర్షాలతో నగరంలో అన్ని చెరువులు, కుంటలు నిండిపోవడంతో ఎగువనుంచి దిగువ ప్రాంతాల చెరువులు, కుంటల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ఆయా ప్రాంతాల్లో చెరువులు కుంటులను ఎప్పటీకప్పుడు పరిశీలిస్తూ లొతట్టు ప్రాంత వాసులతో పాటు నాలా పక్క ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
నగరంలో ఎడ తెరిపి లేని వర్షం
శనివారం నగరంలో ఎడ తెరిపిలేని వర్షం కురిసింది. ఉదయం మొదలైన వర్షం రాత్రి వరకు దఫాలుదఫాలుగా కురిసింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షం పడింది. గాజుల రామారం, షాపుర్‌నగర్, చంద్రాయణ్‌గుట్ట, కాప్రా, అల్వాల్, తిరుమల్ గిరి, మల్లాపూర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్ , మల్కాజ్‌గిరి, ఫలక్‌నుమా, సికింద్రాబాద్, వెస్ట్‌మారెడ్‌పల్లి, నాచారం, బేగంపేట్, మొండా మార్కెట్, మచ్చ బొల్లారం, నాంపల్లి, మెహిదిపట్నం, లక్డీకాపూల్ , ఖైరతాబాద్, అమీర్‌పేట్, సనత్‌నగర్, మూసాపేట్, కూకట్‌పల్లి, కొండాపూర్,మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, రాయదుర్గు, లంగర్‌హౌజ్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఎల్‌బినగర్, కొత్తపేట, దిల్‌సుఖ్ నగర్, నాగోల్, ఉప్పల్, హయత్‌నగర్, బిఎన్‌రెడ్డి నగర్, కర్మన్‌ఘాట్, సంతోష్ నగర్, ఐఎస్ సదన్, చార్మినార్ తదితర ప్రాంతాల్లో మోస్తారు వర్షం పడింది.