Friday, November 22, 2024

ఉప్పొంగిన వాగులు

- Advertisement -
- Advertisement -

Uninterrupted rains across Telangana

9 మంది దుర్మరణం

రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేని వానలు
పొంగిపొర్లుతున్న వాగులు
దాటే యత్నంలో మునిగి బలైపోయిన 9మంది
ఆదివారం ఏడుగురు, సోమవారం ఇద్దరు
పలు గ్రామాలకు స్తంభించిన రాకపోకలు

ఆదివారం వికారాబాద్ జిల్లా తిమ్మాపూర్ వాగులో గల్లంతైన కారు గుర్తింపు
వధువు ప్రవళిక, వరుడి సోదరి శ్వేత మృతదేహాలు వెలికితీత, బాలుడు
నిశాంత్ రెడ్డి కోసం గాలింపు, వరదలో చెట్టుకొమ్మను పట్టుకొని బతికి బయటపడిన డ్రైవర్ రాఘవేంద్ర రెడ్డి

నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం దుందుభి వాగులో చిక్కుపడిన ట్రాక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా దోసల
వాగులో ఇద్దరు యువతుల విషాదాంతం
స్కూటీపై వాగు దాటుతుండగా కొట్టుకుపోయిన సింధుజ ఆసుపత్రిలో మృతి, హిమబిందు కోసం గాలింపు
సిద్దిపేట జిల్లా భూపతిరెడ్డి బైక్‌పై కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండలం పెద్దచెరువు కల్వర్టు దాటుతుండగా గల్లంతు, కాపాడిన గజ ఈతగాళ్లు
సిద్దిపేట నుంచి వరంగల్ వైపు కారులో వెళుతూ వరదనీటిలో చిక్కుకున్న
ఇద్దరిని కాపాడిన పోలీసులు
వచ్చే 3రోజులు భారీ వర్షాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు రాష్ట్రంలోని పలు చోట్ల విషాధ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు పలు జిల్లాలో వాగులను దాటుతూ కార్లలో, బైక్‌లపై ప్రయాణించే వారు మృత్యువాత పడుతున్నారు. ఆదివారం సాయంత్రం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారీవర్షాలకు ఏడుగు రు గల్లంతయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలు జి ల్లాలలోని వాగుల దగ్గర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వరద ఉధృతిలో వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని ప్రజలకు ప్రభుత్వం సూచించింది. ఆదివారం సాయంత్రం వికారాబాద్ జిల్లా తిమ్మాపూర్ వాగులో గల్లంతైన కారును గుర్తించిన అధికారులు వధువు ప్రవల్లిక, వరుడి సోదరి శ్వేత మృతదేహాలను వెలికితీశారు. వాగు ఉధృతిని అంచనా వేయలేకపోవడం వల్లే ఘ టన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. కారులో డ్రైవర్ రాఘవేంద్రరెడ్డితో పాటు బాలుడు నిషాంత్‌రెడ్డిలు ఉండగా, డ్రైవర్ రాఘవేంద్రరెడ్డి కొట్టుకుపోతున్న సమయంలో వరదలో చెట్టుకొమ్మను పట్టుకొని సోమవారం ఉదయం క్షేమంగా బయటపడ్డారు.

బాలుడు నిషాంత్‌రెడ్డి కోసం గాలింపు కొనసాగుతున్నదని, వరుడు నవాజ్‌రెడ్డి, వరుడి అక్క క్షేమంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. సోమవారం నాడు మధ్య మానేరు వాగులో ఆర్‌టిసి బస్సు చిక్కుకుంది. ఆ సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా వెంటనే అధికారులు రంగంలోకి దిగి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. నల్లగొండ జిల్లా ముప్పారం వాగు దగ్గర వరద ఉధృతికి తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడంతో మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సోమవారం దోసల వాగులో బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువతులు గల్లంతయ్యారు.

వరద ఉధృతిలో ట్రాక్టర్

నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దుందుభి వాగులో ట్రాక్టర్ నిలిచిపోయింది. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో దానిని బయటకు తీయలేకపోతున్నట్టు అధికారులు తెలిపారు.

దోసల వాగులో ఇద్దరు యువతులు….

రాజపేట మండలం కుర్రారం గ్రామంలోని దోసల వాగులో ఇద్దరు యువతులు గల్లంతు అయ్యారు. హిమబిందు, సింధుజ అనే యువతులు ఇటుకలపల్లి వెళ్లి తిరిగి కుర్రారం గ్రామానికి వెళ్తుండగా వాగులో నీటి ప్రవాహనికి గల్లంతు అయ్యారు. వాగు దాటుతుండగా మధ్యలో స్కూటీ ఆగిపోవడంతో వాగు ఉధృతికి కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికులతో కలిసి గల్లంతైన యువతులిద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఘటనాస్థలికి కొంతదూరంలో కొట్టుకుపోతున్న సింధూజను గమనించిన స్థానికులు ఆమెను కాపాడి బయటకు తీసుకొచ్చారు. అనంతరం సింధూజను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సింధుజ మృతి చెందింది. వాగులో గల్లంతైన హిమబిందు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

కల్వర్టు దాటుతుండగా బైక్‌పై నుంచి జారి పడి…

భారీ వర్షాలకు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో చెరువులు, కుంటలు నిండి వరదనీరు మత్తడి దూకుతోంది. ఈ నేపథ్యంలో సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేట గ్రామానికి చెందిన భూపతిరెడ్డి సోమవారం బైక్‌పై గన్నేరువరం మండల కేంద్ర నుంచి పెద్దచెరువు మత్తడి మీదుగా కల్వర్టు దాటుతుండగా బైక్‌పై నుంచి జారీ పడి వరదనీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. వెంటనే స్పందించిన గజ ఈతగాళ్లు అతడిని కాపాడారు. ఎస్‌ఐ గజ ఈతగాళ్లకు రూ.3 వేలను పారితోషికంగా అందించారు.

మధ్య మానేరు వాగులో ఆర్టీసీ బస్సు

గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో మధ్య మానేరు వాగులో ఆర్‌టిసి బస్సు చిక్కుకుంది. కామారెడ్డి నుంచి గంభీరావుపేట మీదుగా సిద్దిపేట వెళ్తున్న బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిని అధికారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. బస్సును జేసీబీ సహాయంతో అధికారులు బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మిట్టపల్లి బ్రిడ్జిపై వరద నీటిలో కారు

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మిట్టపల్లి బ్రిడ్జిపై వరద నీటిలో ఓ కారు చిక్కుకుపోయింది. సిద్దిపేట నుంచి వరంగల్ వైపు వెళ్తున్న కూడవెల్లి సంతోష్, మురాం భాను వరద నీటిలో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. వెంటనే స్పందించిన పోలీసులు కారులో ఉన్న సంతోష్, భానులను ప్రాణాలతో రక్షించారు. వీరిద్దరిని సిద్దిపేట పట్టణంలోని శివాజీ నగర్‌కు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. వరద ఎక్కువగా ఉండటంతో ఆ మార్గంలో పోలీసులు వాహనాలను నిలిపివేశారు.

మళ్లీ తెగిన మన్‌సాన్‌పల్లి వాగు…

ఎగువన కురుస్తున్న వర్షాలకు వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పరిధిలోని మన్‌సాన్‌పల్లి వాగు మళ్లీ తెగిపోయింది. దీంతో తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అటు హైదరాబాద్ వెళ్లే వారు ఇటు తాండూరు వచ్చేవారు మన్‌సాన్‌పల్లి వాగు దగ్గరకు వచ్చి వెనుతిరిగి వివిధ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు రోజులుగా….

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధాన రహదారులను వర్షపు నీరు ముంచెత్తింది. భారీ వర్షం కురుస్తుండడంతో కాలనీల్లోకి వరద నీరు ప్రవహిస్తూ చెరువులను తలపిస్తున్నాయి. మరోవైపు పాత బస్టాండ్ మొదలుకొని మినీ ట్యాంక్ బండ్ వరకు వర్షం నీరు రోడ్లపై ప్రవహిస్తున్నది. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందుల పడుతున్నారు. పట్టణంలోని అశోక్ నగర్, డాక్టర్ స్ట్రీట్, శాంతినగర్ ప్రాంతమంతా నీటమునిగి, రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఉమ్మడి వరంగల్, సిరిసిల్ల జిల్లాల్లో జోరుగా వాన

ఉమ్మడి వరంగల్, సిరిసిల్ల జిల్లాల్లో జోరుగా వాన కురుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కరీమాబాద్, సాకరిశికుంట, ఏకశిలానగర్‌లో భారీ వర్షానికి ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట, సిరిసిల్ల, తంగళ్లపల్లి, వీర్నపల్లి, ఇల్లంతకుంట మండలాల్లో వాన ఎక్కువగా కురిసిందని అధికారులు తెలిపారు.

నల్లగొండ జిల్లాలో పొంగిపోర్లుతున్న వాగులు

నల్లగొండ జిల్లాలో ఆదివారం రాత్రి కురిసిన వానకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నిడమనూరు మండలం ముప్పారం వాగు దగ్గర వరద ఉధృతికి తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. సమీపంలోని మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఆలేరు మున్సిపల్ ఆఫీస్‌లోకి వరదనీరు

24 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆలేరు మండలంలో వాగులు, చెరువులు ఉప్పొంగుతున్నాయి. వరద నీరు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామీణ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొలనుపాక, రాఘవపురం, ఆలేరు పెద్దవాగు, రత్నాల వాగు, బైరాకుంటా తదితర వాగులు, కుంటలు నిండి భారీస్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఆలేరులోని రంగనాయక వీధి, కుమ్మరివాడ, పెద్దమ్మ వీధి ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలేరు మున్సిపల్ ఆఫీస్‌లోకి వరద నీరు వచ్చి చేరింది.

హైదాబాద్ టు -హన్మకొండ రోడ్డులో రాకపోకలకు అంతరాయం

జనగామ జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి రంగప్ప చెరువు మత్తడి పోస్తుండటంతో జిల్లా కేంద్రం జలదిగ్బంధంలో చిక్కుకుంది. హైదారాబాద్ టు -హన్మకొండ రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జనగామలోని శ్రీనగర్, కుర్మవాడ, జ్యోతినగర్, జయశంకర్ నగర్, శ్రీవిల్లాస్ కాలనీ, సాయినగర్, బీరప్పగడ్డ లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. అలాగే పలు షాపుల సముదాయాల్లోకి భారీగా నీరు చేరడంతో వ్యాపారాలు నిలిచిపోయాయి.

జమ్మికుంట పట్టణంలో 4 గంటల పాటు భారీ వర్షం

ఆదివారం రాత్రి జమ్మికుంట పట్టణంలో భారీ వర్షం కురిసింది. సుమారు నాలుగు గంటల పాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ జలమయం అయ్యింది. కాలనీలోని పలు ఇళ్లలోకి వరదనీరు చేరింది.

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాలలో…

రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. అవసరమైతే తప్ప జనం ఎవరూ బయటకు వద్దని అధికారులు సూచిస్తున్నారు.

దక్షిణ ఛత్తీస్‌ఘడ్ పరిసర ప్రాంతంలో అల్పపీడనం

ఆదివారం ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు దక్షిణ ఛత్తీస్‌ఘడ్ పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కి మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతిదిశ తిరుగుతుందని అధికారులు తెలిపారు. రుతుపవనాల ద్రోణి బికనేర్, అజ్మీర్, దక్షిణ ఛత్తీస్ ఘడ్, పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం విశాఖపట్నం మీదగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం తూర్పు పశ్చిమ షియర్ జోన్ 15ఓ అక్షాంశం వెంబడి 5.8కి మీ నుంచి 7.6 కి మీ మధ్య స్థిరంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షపాతం

సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో 128.8 మిల్లీమీటర్లు, మెదక్‌లో 111, రాజన్న సిరిసిల్లలో 105, కామారెడ్డిలో 92, జగిత్యాలలో 80, పెద్దపల్లిలో 73, ఆదిలాబాద్‌లో 71, నిజామాబాద్‌లో 69, సిద్ధిపేటలో 66, వరంగల్ రూరల్‌లో 48, వరంగల్ అర్భన్‌లో 45 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది. అధిక వర్షపాతం కుమురంభీం ఆసిఫాబాద్, సిద్ధిపేట, వరంగల్ అర్భన్, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరిలో కురిసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News