Monday, December 23, 2024

పన్ను భారం తగ్గేనా..!

- Advertisement -
- Advertisement -
Union Budget 2022 on February 1‌
సామాన్యులకు ఊరట లభిస్తుందా..
బడ్జెట్ 2022పై పన్ను చెల్లింపుదారుల ఎన్నో ఆశలు

న్యూఢిల్లీ : ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై సామాన్యుల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కోవిడ్-19 కారణంగా గత రెండేళ్లలో చిన్న ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, మధ్యతరగతి వారు ఆర్థికపరంగా సవాళ్లు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని నెలలుగా పన్ను వసూళ్లు పెరిగిన నేపథ్యంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను విషయంలో భారీ మినహాయింపును కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించవచ్చని భావిస్తున్నారు. చిన్న ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించడం, వారి కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా డిమాండ్‌ను పెంచే వ్యూహాన్ని ఆర్థిక మంత్రి అనుసరించవచ్చని అంటున్నారు. గత రెండేళ్ళలో కరోనా కారణంగా భారీ సంఖ్యలో ప్రజలు తమ ఉద్యోగాలు కోల్పోగా, వేతనాల్లో కోతలు విధించారు. ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కారణంగా కొన్ని పన్ను మినహాయింపులు తగ్గించారు. మరోవైపు డిజిటల్ టెక్నాలజీ, బ్రాడ్‌బ్యాండ్, కరెంటు బిల్లులు వంటి ఖర్చులు పెరగడం వల్ల చిన్న పన్ను చెల్లింపుదారుల ఆదాయంపై ప్రభావం పడింది. మరోవైపు ద్రవ్యోల్బణం కూడా పెరుగుతోంది. 2021 డిసెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.59 శాతానికి పెరిగింది. పెట్రోలు, డీజిల్ ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అందువల్ల పన్నుల్లో ఊరట అవసరం.

భారాన్ని తగ్గించేందుకు ప్రోత్సాహకాలు

కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న చిన్న పన్ను చెల్లింపుదారులు, మధ్యతరగతి కొనుగోలు శక్తిని పెంచడానికి గత ఏడాది బడ్జెట్‌లో పెద్దగా ఊరట చర్యలు చేపట్టలేదు. ఈసారి పన్ను భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుందని భావిస్తున్నారు. పాత ఆదాయపు పన్ను శ్లాబులను తిరిగి నిర్ణయించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఐటి చెల్లింపుదారులకు ఉపశమనం కల్పిస్తూ ప్రభుత్వం పన్ను మినహాయింపు పరిమితిని రూ. 5 లక్షలకు రెట్టింపు చేయాలని కోరుతున్నారు.

స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంచాలి

ఈ బడ్జెట్‌లో కార్మిక వర్గానికి స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.75,000కి పెంచాలని కోరుతున్న వారు ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం సెక్షన్ 80సి కింద రూ. 1.5 లక్షల వరకు మినహాయింపు ఉంది. దీనిలో ఇపిఎఫ్, పిపిఎఫ్, ఎన్‌ఎస్‌సి, జీవిత బీమా, పిల్లల ట్యూషన్ ఫీజు, గృహ రుణాల ప్రధాన చెల్లింపులు ఉన్నాయి. పెరుగుతున్న ఇళ్ల ధరలను పరిగణనలోకి తీసుకుంటే సెక్షన్ 80సి కింద రూ.1.5 లక్షల మినహాయింపు సరిపోదు. ఈ మినహాయింపు పరిమితిని పెంచాలనే డిమాండ్ ఉంది. అనేక పన్ను ఆదా పెట్టుబడులు ఈ విభాగం కిందకు వస్తాయి. ఇది ప్రజలను పొదుపు చేయడానికి మరింత ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వం బడ్జెట్‌లో గృహ రుణ వడ్డీపై పన్ను మినహాయింపును రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచాలి. దీంతో ఇళ్ల విక్రయాలు మరింత వేగవంతం అయ్యే అవకాశముంది.

ఆరోగ్య బీమా వాడుకలో లేదు

ఐటి చట్టంలోని సెక్షన్ 80డి కింద పన్ను మినహాయింపు పరిమితిని కూడా ప్రభుత్వం పెంచాలనే డిమాండ్ ఉంది. కరోనా సవాళ్లు ఉన్నప్పటికీ దేశంలో ఆరోగ్య బీమా ఇప్పటికీ అంతగా వినియోగంలో లేదు. 80డి కింద ఆరోగ్య బీమాపై ప్రీమియం పన్ను విధిస్తారు. పన్ను చెల్లింపుదారులను ఆరోగ్య బీమా వైపు ప్రేరేపించేలా మినహాయింపును పెంచాలి. ఆరోగ్య బీమాను అందుబాటులోకి తీసుకురావాలి. దీనిపై ఉన్న 18 శాతం జిఎస్‌టిని తగ్గించాలి. దేశంలో 14 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు ఉండగా, వీరంతా చిన్న పొదుపు పథకాల వడ్డీపై ఆధారపడి ఉన్నారు. వాటిపై వడ్డీ రేటు తగ్గించినందున ఐటి మినహాయింపు పరిమితిని పెంచడం ద్వారా వారికి ఊరట కలిగించాలి.

పన్ను ఎగవేతను అరికట్టాలి

బడ్జెట్‌లో ఆదాయపు పన్ను సంస్కరణలు తేవాలి. 2020 సంవత్సరం నుండి ఐటి శాఖ పన్ను చెల్లింపుదారుల చార్టర్, ఫేస్‌లెస్ అసెస్‌మెంట్, ఫేస్‌లెస్ అప్పీల్ సిస్టమ్‌ను అమలు చేసింది. ఇప్పుడు పన్ను ఎగవేతను అరికట్టడానికి ప్రయత్నాలు చేపట్టాల్సి ఉంది. మంచి ఆదాయం ఉన్నప్పటికీ చాలా మంది ఆదాయపు పన్ను చెల్లించడం లేదు. నిజాయితీ పన్ను చెల్లింపుదారులపై భారంగా పడుతోంది. మంచి ఆదాయం ఉన్నప్పటికీ ఆదాయపు పన్ను చెల్లించని వారిని స్కానర్ కిందకు తీసుకురావడానికి మరింత సమర్థవంతమైన ప్రయత్నాలు చేయాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News