Monday, December 23, 2024

బడ్జెట్ 2023పై కసరత్తు

- Advertisement -
- Advertisement -

 

21న వివిధ రంగాల ప్రతినిధులతో నిర్మలా సీతారామన్ భేటీ

న్యూఢిల్లీ : వచ్చే వారం అంటే నవంబర్ 21 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తును ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించనున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కోసం వివిధ రంగాల ప్రతినిధులతో ఆమె సమావేశం కానున్నారు. నాలుగు రోజుల పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులతో ఆర్థిక మంత్రి మొత్తం ఏడు సమావేశాలు నిర్వహించనున్నారు. దీంతో పాటు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో జరిగే జిఎస్‌టి సమావేశంతోపాటు బడ్జెట్‌పై చర్చ జరుపనున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్రాల డిమాండ్లను తెలుసుకునేందుకు ఆర్థిక మంత్రి ప్రీ-బడ్జెట్ భేటీ నిర్వహిస్తారు.

నవంబర్ 21 నుండి 24 వరకు జరిగే ప్రీ-బడ్జెట్ సమావేశంలో సీతారామన్ పరిశ్రమలు, వ్యాపార చాంబర్లు, వ్యవసాయ రంగం, వ్యవసాయ ప్రాసెసింగ్ పరిశ్రమ, ఆర్థిక రంగం, క్యాపిటల్ మార్కెట్లు, సామాజిక రంగం, సేవలు, వాణిజ్యం ప్రతినిధులతో హాజరుకానున్నారు. కార్మిక సంఘాలు, కార్మికులు, సంస్థతో పాటు, ఆర్థికవేత్తలతో సమావేశాలు నిర్వహించి బడ్జెట్‌కు సంబంధించి వారి సూచనలను తీసుకుంటారు.

ప్రతి సంవత్సరం బడ్జెట్‌ను సిద్ధం చేయడానికి ముందు ఆర్థికమంత్రి వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులతో పాటు ఆర్థిక మంత్రిత్వశాఖలోని ఉన్నత అధికారులు, ముఖ్య ఆర్థిక సలహాదారుతో సమావేశమై వారి సూచనలను స్వీకరిస్తారు. దీంతో పాటు అన్ని రంగాల ప్రతినిధులు ఆర్థికమంత్రికి తమ సూచనల లేఖలను సమర్పిస్తారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన ఐదో బడ్జెట్‌ను 2023 ఫిబ్రవరి 1న సమర్పించనున్నారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధిని ముందుకు తీసుకెళ్లడంతోపాటు ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంపై ఈసారి బడ్జెట్‌లో దృష్టి కేంద్రీకరించబోతున్నట్లు ఆర్థిక మంత్రి ఇప్పటికే తెలిపారు.

బడ్జెట్ ఎలా ఉండనుంది?
2023 ఆర్థిక సంవత్సరానికి జిడిపిలో ఆర్థిక లోటు 6.4 శాతంగా ఉంటుందని కేంద్రం అంచనా వేసింది. వృద్ధిని కొనసాగించడానికి, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి తదుపరి కేంద్ర బడ్జెట్‌ను చాలా జాగ్రత్తగా సిద్ధం చేయాల్సి ఉంటుందని ఆర్థికమంత్రి ఇటీవల తెలిపారు. ఐఎంఎఫ్ 2023ఆర్థిక సంవత్సరానికి దేశం జిడిపి వృద్ధిలో కోత విధించింది. జిడిపిని 6.8 శాతంగా అంచనా వేసింది. తదుపరి కేంద్ర బడ్జెట్ కూడా వృద్ధి వేగాన్ని కొనసాగించేందుకు దోహదం చేసేలా ఉండాల్సి ఉంది. అధిక ఇంధన ధరలు భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యగా చెప్పవచ్చు.

ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం, గ్లోబల్ డిమాండ్ మందగించడం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలు అధిక ద్రవ్యోల్బణం, నెమ్మదిగా ఆర్థిక వృద్ధి వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. సమీప భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో అధిక ఇంధన ధరలు ఒకటని సీతారామన్ అన్నారు. ప్రపంచ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా చాలా ఏజెన్సీలు ద్రవ్య విధానం, అనిశ్చిత బాహ్య వాతావరణం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి అంచనాలను తగ్గించాయి. అయితే భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News