ఇప్పటికీ పాత పన్ను విధానంపైనే టాక్స్ పేయర్ల ఆసక్తి
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్ 2024పై ప్రజల్లో భారీ అంచనాలు
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరంలో మొదటి నెల జనవరి కొద్ది రోజుల్లో ముగియనుంది. ఇక ఫిబ్రవరి 1న సాధారణ బడ్జెట్ ప్రారంభమవుతుంది. నెలరోజుల తర్వాత దేశంలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ ప్రభుత్వానికి ఎంతో కీలకం కాబోతోంది. అందుకే బడ్జెట్‌పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల బడ్జెట్ కావడంతో ప్రభుత్వం దీనిలో పలు ప్రయోజనాలను ప్రకటించవచ్చని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
బడ్జెట్‌కు ముందు ప్రతిసారీ పన్నుల విషయంలో ప్రజలకు అంచనాలు ఉంటాయి. ఈసారి కూడా అలాంటి అంచనాలే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావాలని చూస్తోంది. కొత్త పన్ను విధానాన్ని ఎక్కువ మంది ప్రజలు ఎంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇప్పటికీ పెద్ద సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు పాత పన్ను విధానంలోనే కొనసాగుతున్నారు. పాత పన్ను విధానంలో లభించే అధిక పన్ను ప్రయోజనాలే ఇందుకు కారణం నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో కొత్త పన్ను విధానంలో పన్ను ప్రయోజనాల పరిధిని పెంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
పన్ను రాయితీలో మార్పు ఉండదు
ప్రభుత్వం ఆదాయం పన్ను విషయంలో ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. నివేదిక ప్రకారం, ఈ బడ్జెట్‌లో కొత్త పన్ను విధానంలో పన్ను రాయితీలో పెరుగుదల ఉండదు. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారిని ఉటంకిస్తూ ఒక వార్తా సంస్థ ఈ విషయాన్ని చెప్పింది. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే ఆదాయ పన్ను చెల్లింపుదారులకు రాబోయే బడ్జెట్‌లో ఆదాయపు పన్ను రాయితీ పరిధిని పెంచవచ్చని ప్రజలు ఊహించారు. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను రాయితీ పరిధి రూ.7 లక్షలు ఉంది. సంవత్సరానికి రూ.7.5 లక్షలకు పెంచాలని భావించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతేడాది బడ్జెట్(2023)లో ఈ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
ప్రయోజనాల జోడింపు
కొత్త పన్ను విధానంలో మొదట్లో పన్ను ప్రయోజనాలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ తర్వాత కొత్త పన్ను విధానంపై ఆసక్తి పెంచేందుకు అనేక పన్ను ప్రయోజనాలు జోడించారు. గత ఏడాది బడ్జెట్‌లో పన్ను రాయితీ పరిధిని పెంచడమే కాకుండా, ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. కుటుంబ పించను కోసం రూ.15,000 తగ్గింపును కూడా ప్రభుత్వం ప్రారంభించింది. 2023 బడ్జెట్‌లో కొత్త పన్ను విధానంలో మొదటిసారిగా జీతం పొందిన వ్యక్తులు, పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు స్టాండర్డ్ డిడక్షన్ కోసం ఒక నిబంధన చేశారు.
స్టాండర్డ్ డిడక్షన్ పెంచవచ్చు
జీతం పొందిన తరగతి, పెన్షనర్లు రూ. 40,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్‌ను క్లెయిమ్ చేయవచ్చు. ఎలాంటి పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేకుండా పన్ను మినహాయింపు పొందవచ్చు. కానీ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో మోడీ ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్ క్లెయిమ్ పరిమితిని రూ.40,000 నుంచి రూ.50,000కి పెంచింది. ఇప్పుడు ఎన్నికల ముందు ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌లో మోడీ ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని మళ్లీ రూ.50,000 నుంచి రూ.75,000కి పెంచవచ్చు.
1న మధ్యంతర బడ్జెట్
2024 ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రి సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ సందర్భంగా గత ఏడాది దేశం ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి కేటాయింపులు అవసరమో తెలియజేస్తారు. బడ్జెట్ సమర్పణకు ఒకరోజు ముందు అంటే జనవరి 31న దేశ ఆర్థిక సర్వేను సమర్పిస్తారు. ఆర్థిక మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న ముఖ్య ఆర్థిక సలహాదారు, వారి బృందం రూపొందించిన ఆర్థిక సర్వే జనవరి 31న వెలువడుతుంది. ఇది పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా జనవరి చివరి తేదీన పార్లమెంటు ముందుకు వస్తుంది.