Wednesday, January 22, 2025

గ్రామాలను పట్టించుకోని నిర్మల బడ్జెట్

- Advertisement -
- Advertisement -

బడ్జెట్ రూపకల్పన అనేది ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపేదిగా ఉండాలి. అప్పుడే బడ్జెట్ ప్రయోజనం నెరవేరుతుంది. అధికార మార్పిడి జరిగిన దగ్గర నుండి పాలక ప్రభుత్వాలు బడ్జెట్లు ప్రవేశపెడుతూనే ఉన్నా ప్రజల ఏ మౌలిక సమస్యా పరిష్కారం కాలేదు. పాలక ప్రభుత్వాల వర్గ స్వభావాన్ని బట్టి బడ్జెట్ ప్రజానుకూలమా లేక వ్యతిరేకమా అన్నది వెల్లడవుతుంది. దీన్ని అర్థం చేసుకుంటేనే నేటి బడ్జెట్ స్వభావం అర్థమవుతుంది. భారత పాలక పార్టీలు, ప్రభుత్వాలు దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడే విధంగా ఎప్పుడూ బడ్జెట్‌ను రూపొందించలేదు. బడా భూస్వాముల, బడా పెట్టుబడిదారుల, సామ్రాజ్యవాదుల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. అధికార మార్పిడే ఇందుకు దోహద పడింది. నేటి తాత్కాలిక బడ్జెట్ కూడా ఆ కోవకు చెందిందే. ఎన్నికలకు కొద్ది నెలలకు ముందు ప్రవేశపెట్టేదే తాత్కాలిక బడ్జెట్. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 1-2-24న అలాంటి తాత్కాలిక బడ్జెట్‌నే ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ మొత్తం రూ. 47.66 లక్షల కోట్లు. వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయం 30.80 లక్షల కోట్లు. లోటు రూ. 16 కోట్లకు పైగా ఉంది.

ఇది కాకుండా కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ప్రకారం 2023 నవంబర్ నాటికి 9.06 మిలియన్ కోట్ల ఆర్థిక లోటు ఉంది. బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వే రిపోర్టు ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ సంవత్సరం మోడీ ప్రభుత్వం ఎందుకనో అలా ప్రవేశపెట్టలేదు. బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధికి పెద్ద పీట వేసినట్లు నిర్మలా సీతారామన్ చెప్పడం జరిగింది. అందుకు ఆ శాఖకు తాత్కాలిక బడ్జెట్‌లో రూ. 1.79 లక్షల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. 2023 -24 బడ్జెట్‌లో కేటాయింపు రూ. 1.57 లక్షల కోట్లు. ఈ మొత్తంలో గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణం, గ్రామీణ ఉపాధి హామీ పథకం, త్రాగు నీరు, గిరిజన సంక్షేమం, ప్రధాని ఫసల్ బీమా పథకం మొదలగు వాటికి కేటాయింపులు జరిగాయి. స్వాతంత్య్రం వచ్చి 77 సంవత్సరాలైనా కోట్లాది మంది పేదలకు గృహ వసతిని పాలకులు కల్పించలేకపోయారు. రోడ్ల పక్కన, మురుగు కాల్వల పక్కన, గుడారాల్లో సంసారం సాగిస్తున్నారు. గాలి వానలకు గుడారాలు ఎగిరిపోయి తల దాచుకోవడమే సాధ్యం గాని పరిస్థితుల్లో పేదలు వున్నారు. దేశంలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే కోటి 77 లక్షల మంది నిరాశ్రయులున్నారు.

18.78 మిలియన్ల ఇళ్ల కొరత వుంది. ప్రపంచంలో గృహవసతి కల్పించడంలో ఇప్పటికీ భారత దేశం బాగా వెనుకబడి వుంది. 90 మిలియన్లకు పైగా ప్రజలు ఒక డాలర్ కంటే తక్కువ సంపాదిస్తున్నారు. అలాంటి పేదలు సొంత గృహం ఎలా ఏర్పాటు చేసుకోగలరు. 2015లో మోడీ ప్రభుత్వం 30 మిలియన్ల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ప్రకటించి, దానికి ప్రధాని ఆవాస్ యోజనగా పేరు పెట్టి అది ప్రపంచం లోనే పెద్ద గృహ పథకంగా ప్రచారం చేశారు.చరణలో పథకం పూర్తి కాలేదు. పేదలకు ఇళ్లు లభించలేదు. పథకం ప్రారంభ మైన దగ్గర నుండి గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించిన ఇళ్ల సంఖ్య 7 మిలియన్లుగా ఉంది. అదే క్రమంలో బలవంతంగా దేశంలో 1,77,700 ఇళ్ళు కూల్చివేశారు. దేశంలో ఇప్పటి వరకు నిర్మించిన ఇళ్ళు 2 కోట్ల 11 లక్షలు. ఇవి ప్రభుత్వ లెక్కలే. మోడీ ప్రభుత్వం గతంలో ప్రకటించిన మూడు కోట్ల ఇళ్ళకు అదనంగా మరో రెండు కోట్ల ఇళ్లు నిర్మిస్తున్నట్టు బడ్జెట్ ప్రవేశ పెడుతూ ఆర్థిక మంత్రి ప్రకటించారు.ఇందు కోసం తాత్కాలిక బడ్జెట్‌లో రూ. 80,671 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో రూ. 79,590 కోట్లుగా వుంది. 771 కోట్లు ఎక్కువ. బడ్జెట్ అంకెలు వల్లించడం వలన ప్రయోజనం ఏమీ ఉండదు. ప్రభుత్వాలకు ప్రజల అవసరాలను తీర్చడంలో చిత్తశుద్ధి ఉండాలి. కేటాయించిన మేరకైనా ఖర్చు చేసే ఆలోచన ఉండాలి. ఈ రెండు నేటి పాలకులకు, ప్రభుత్వాలకు లేదు. అందుకే పేదలు నేటికీ గృహ వసతిలేక అవస్థలు పడుతున్నారు.

గ్రామీణ ఉపాధి హామీ పథకం
ఈ పథకాన్ని 2- ఫిబ్రవరి 2013లో యుపిఎ ప్రభుత్వ అట్టహాసంగా ప్రారంభించింది. ఈ పథకం ద్వారా గ్రామీణ పేదల ప్రతి కుటుంబానికీ వంద రోజులు పని కల్పించడం ఈ పథకం ఉద్దేశం. నమోదు చేసుకున్న ప్రతి కుటుంబానికీ పని కల్పిస్తామని పాలకులు చెబుతున్నా ఆచరణలో నీటి బుడగలుగా తేలిపోయాయి. ఇప్పటికీ 30% మించి కుటుంబాల పని కల్పించలేదు. పని దినాలు తగ్గిపోతూ వస్తున్నాయి. 2022లో జనవరి నుండి డిసెంబర్ 15 వరకు పథకం అమలు వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం పని దినాలు 289.24 కోట్లు కాగా, జనవరిలో ఉపాధి పొందిన వారు వారు 1.99 కోట్లు. ఫిబ్రవరిలో 2.01 కోట్ల మందికి, డిసెంబర్‌లో 5.8 కోట్ల మందికి మాత్రమే పని లభించింది. పెరిగిన ఉపాధి చాలా తక్కువ. 2023 ఆర్థిక సంవత్సరంలో 6 కోట్ల 49 లక్షల కుటుంబాలు పనిని కోరగా, 5 కోట్ల 7 లక్షల కుటుంబాలకు పని లభించినట్లు తాజా ఆర్థిక సర్వే వెల్లడించింది.

2020-21లో 4.47 కోట్ల కుటుంబాల నుంచి 2021 22లో 4.02 కోట్ల కుటుంబాలకు పని కల్పన తగ్గింది. ఈ పనిలో శ్రమ దోపిడీ ఎక్కువ జరుగుతున్నది. ప్రారంభంలో నిర్దేశించిన పని పూర్తి చేసిన కూలి వానికి 145 రూపాయలు. పూర్తి చేయలేని వారికి ఆ మేరకు కూలి తగ్గుతుంది. ఆ కాలంలో వ్యవసాయ పనులకు రూ. 250 పైగా కూలి లభించింది. ప్రస్తుతం రూ. 257 కూలిగా ఉపాధి హామీ పథకం ఉంది. బయట పనులకు రూ. 400 పైగా ఇస్తున్నారు. దీన్ని గమనిస్తే కూలీలు ఎంత దోపిడీకి గురవుతున్నారో అర్ధమవుతుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికీ పని కల్పించాలంటే బడ్జెట్లో రూ. లక్షా 80 వేల కోట్లు అవసరం. ఇంత వరకూ ఏ బడ్జెట్‌లో అంత మొత్తం కేటాయింపులు జరగలేదు.

తాగు నీటి సమస్య
దేశం ఎంతో అభివృద్ధి చెంది చంద్ర మండలానికి రాకెట్లు పంపుతున్నామని డబ్బా కొట్టుకుంటున్న మోడీ ప్రభుత్వం దేశంలో వున్న తాగు నీటి సమస్యను మాత్రం పరిష్కరించలేకపోయింది. 2018 లెక్కల ప్రకారం దేశంలోని 75% గృహాలకు తాగునీరు అందడం లేదు. 84% గృహాలకు పైపుల ద్వారా తాగునీటి సరఫరా లేదు. దేశంలో ఉన్న నీరు 74% కలుషితమైందే. ప్రపంచ నీటి నాణ్యత జాబితాలో ఉన్న 122 దేశాల్లో భారత దేశం 120వ స్థానంలో వుంది. కలుషిత నీటి వల్ల ప్రతి సంవత్సరం 2 లక్షల మంది చనిపోతున్నారు. గత 30 సంవత్సరాల్లో నీటి స్థాయి 13% తగ్గిపోయిందని 2017-18 సంవత్సర ఆర్థిక సర్వే వెల్లడించింది. ఇప్పటికీ 15 కోట్ల మంది ప్రజలకు కనీసం తాగు నీరు కూడా లభించడం లేదు.

దేశంలో అనేక జీవ నదులు, వాగులు, వంకలు, భూగర్భ జలాలు ఉన్నా ప్రజలకు మాత్రం తాగు నీరు దొరకడం లేదు. 75 సంవత్సరాల స్వతంత్ర భారత్ సాధించిన గొప్ప ప్రగతి ఇది. గిరిజన ప్రాంతాల్లో, వెనుకబడి ప్రాంతాల్లో తాగు నీరు లభించక కలుషితమైన నీరు తాగుతూ రోగాల పాలవుతున్నారు. ఇందుకు కారణం పాలక ప్రభుత్వాలే. దేశంలో వున్న జల వనరులను వినియోగిస్తే తాగు నీటికి, సాగు నీటికి కొరతే ఉండేది కాదు. తాగు నీరు అందించడంలో గత ప్రభుత్వాలు, నేటి మోడీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే విఫలమైనాయి. దేశ వనరులను ప్రజల తాగు నీటికి ఉపయోగించకుండా బహుళ జాతి సంస్థల నీటి వ్యాపారానికి అప్పగిస్తున్నది. ప్రతి బడ్జెట్‌లో తాగు నీటి కోసం నిధులు కేటాయిస్తున్నా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. 2023-24 బడ్జెట్‌లో జలశక్తి మంత్రిత్వ శాఖకు రూ. 96,549 కోట్లు కేటాయించిన మోడీ ప్రభుత్వం, 2024- 25 తాత్కాలిక బడ్జెట్‌లో రూ. 98,418 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్ కన్నా ఎక్కువ కేటాయించినట్లు గొప్పలు పోతున్నది.

దశాబ్దాలు గడుస్తున్నా గిరిజన ప్రాంతాల, ప్రజల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా వుంది. గిరిజనుల అభివృద్ధికి సబ్ ప్లాన్ లాంటి చట్టాలు చేసినా వారికి ఒరిగింది ఏమీ లేదు. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్య సౌకర్యాలు వారికి గగనమైపోతున్నది. రహదారి సౌకర్యం లేక ప్రమాద పరిస్థితుల్లో వున్న వారిని డోలీల్లో మోసుకొని ఆస్పత్రులకు తీసుకు వెళ్ళాల్సిన పరిస్థితుల్లో మార్గమధ్యంలోనే అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆసుపత్రుల్లో డాక్టర్లు ఉండరు. డాక్టర్లు ఉన్నా మందులు ఉండవు. పాఠశాలల్లో టీచర్లు ఉండరు. మంచి నీటి సౌకర్యం లేక కలుషితమైన నీరు తాగి రోగాలకు బలి అవుతున్నారు. వారికి లభించే ఆదాయంతో దారుణమైన పరిస్థితుల మధ్య జీవిస్తున్నారు.అసలు పంటల బీమా పథకం పెట్టిందే దేశ, విదేశీ బీమా కంపెనీల కోసం తప్ప రైతులకోసం కాదు. రైతుల ప్రీమియం లో కొంత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించడం కూడా బీమా కంపెనీల ప్రయోజనం కోసమే.

పంటల బీమా నిబంధనలే రైతాంగానికి వ్యతిరేకంగా వున్నాయి.ఎప్పుడూ పూర్తిగా బీమా కంపెనీలు రైతులకు చెల్లించాల్సిన పరిహారం చెల్లించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాము చెల్లించాల్సిన వాటాలను ఒకరు విడుదల చేస్తే మరొకరు విడుదల చేయకపోవడంతో పరిహారం అందడం రైతులకు సమస్యగా మారింది. బడ్జెట్‌లో ఫసల్ బీమాకి నిధులు పెంచడం రైతుల కోసంకాక బీమా కంపెనీల కోసం అన్నది గ్రహించాలి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బడా పెట్టుబడిదారులకు, బహుళ జాతి సంస్థలకు అనుకూలంగా మాత్రమే మోడీ ప్రభుత్వ బడ్జెట్ ఉంది. గ్రామీణాభివృద్ధికి వ్యవసాయానికి అవినాభావ సంబందం వుంది. గ్రామీణ పేదల ఆర్థిక స్తోమత పెరిగినప్పుడే గ్రామీణాభివృద్ది పెరుగుతుంది. పేదల ఆర్థిక పరిస్థితికి భూమికి విడదీయలేని సంబంధం ఉంది. దేశంలో సేద్య భూమి కొద్ది మంది వద్ద కేంద్రీకరించి వుంది. దాన్ని బద్దలుకొట్టి పేదలకు భూ పంపిణీ జరిగినప్పుడే గ్రామీణాభివృద్ది సాధ్యమవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News