బిఎస్‌ఎన్‌ఎల్ కు
రూ 1.64 లక్షల కోట్ల బాగోగుల ప్యాకేజ్
గ్రామీణ ప్రాంతాలకు 4 జి విస్తరణ
బిఎస్‌ఎన్‌ఎల్ బిబిఎన్‌ఎల్ విలీనం
కేంద్ర కేబినెట్ నిర్ణయం …
పలు విధాలుగా మద్దతు చర్యలు
న్యూఢిల్లీ : కుంటుపడుతున్న ప్రభుత్వ అధీనభారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ( బిఎస్‌ఎన్‌ఎల్) పునరుద్ధరణ ప్యాకేజ్‌కు కేంద్ర మంత్రి మండలి బుధవారం ఆమోదం తెలిపింది. రూ 1,64,156 కోట్ల మేర అంచనాలతో దీనికి సమ్మతి తెలిపినట్లు టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులకు సమాచారం ఇచ్చారు. 4జి సేవల పటిష్టతకు స్పెక్ట్రమ్ వినియోగానికి ఈ మొత్తం దోహదపడుతుంది. చాలా కాలంగా బిఎస్‌ఎన్‌ఎల్ సేవలు సాంకేతికంగా బాగా ఉన్నప్పటికీ ప్రైవేటు టెలీకం సంస్థల ప్రచార ఆర్భాటంలో ఈ సంస్థకు ఆదరణ తగ్గింది. అదే విధంగా బిఎఎన్‌ఎల్ విస్తరణ సేవల మెరుగుకు పలు చర్యలు తీసుకునే నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. బిఎస్‌ఎన్‌ఎల్ , భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ లిమిటెడ్‌ను విలీనం చేసే ప్రతిపాదనకు కూడా ఆమోదం దక్కింది. ఈ ప్యాకేజీలో భాగంగా మూడు అంశాలను పొందుపర్చారు. సేవలను మెరుగుపర్చడం, డి స్ట్రెస్ బ్యాలెన్స్ షీట్, ఫైబర్ నెట్‌వర్క్ విస్తరణ పనులను చేపడుతారు. ఇక అత్యంత కీలకమైఊన స్పెక్ట్రమ్ నిర్వహణ కేటాయింపును కల్పిస్తారు. దీని వల్ల బిఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు అత్యవసరం అయిన 4 జి సేవలను మరింతగా కల్పించేందుకు వీలేర్పడుతుంది.
ప్యాకేజ్‌లో భాగంగా వచ్చే నాలుగేళ్లలో రూ 43,964 కోట్ల మేర నగదు మొత్తం, రూ 1.2 లలక్ష కోట్ల మేర నగదేతర మొత్తం సంస్థకు అందుతుంది. 4 జి సేవల విస్తరణతో ప్రైవేట్ టెలికం సంస్థల అధునాతన ఏర్పాట్లతో పోటీ పడేందుకు మార్గం సుగమం అవుతుందని కేంద్రం భావిస్తోంది. ఇక బ్యాలెన్స్ షీటుపై ఒత్తిడిని తగ్గించేందుకు రూ 33000 కోట్ల బకాయిలను ఈక్విటీ లోన్లుగా మార్చడం, ఇదే విలువైన బ్యాంకు రుణాల మొత్తాలను తక్కువ వడ్డీ బ్యాండ్ల ద్వారా తిరిగి చెల్లించాలని నిర్ణయించారని మంత్రి తెలిపారు. ప్రస్తుత రుణాల చెల్లింపునకు వీలుగా డబ్బు సేకరించుకునేందుకు సంస్థకు ప్రభుత్వం అధీకృత గ్యారంటీ ఇస్తుంది. బిఎస్‌ఎన్‌ఎల్, బిబిఎన్‌ఎల్ విలీనంతో దేశంలో అదనంగా 5.67 లక్ష కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ లైన్ ఏర్పడుతుంది. దీని వల్ల 1.85 లక్షల గ్రామ పంచాయతీలకు సేవల సౌకర్యం పెరుగుతుంది. ఇప్పటికే 6.83 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్ ఉంది. బిఎస్‌ఎన్‌ఎల్ పునరుద్ధరణ సంబంధించి ఇంతకు ముందు ఓ ప్యాకేజ్‌ను 2019లో తీసుకువచ్చారు. తరువాత చేపట్టే ప్యాకేజ్ ఇదే.
చాలా కాలంగా మార్కెట్‌లో వినియోగదారులకు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ సరైన సమగ్ర సేవలను అందించలేకపోతోంది. ప్రత్యేకించి రిలయన్స్, జియో, భారత్ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా వంటి సంస్థలు అత్యంత అధునాతన 4 జి సేవలను వినియోగదారులకు అందిస్తున్నాయి. పైగా దూకుడుగా డాటా రేట్లను తగ్గిస్తూ , పలు రాయితీలను ఆకర్షణీయ ప్రకటనలతో కల్పిస్తూ వస్తున్నాయి. దీనితో బిఎస్‌ఎన్‌ఎల్ వాడకందార్లు తమ ఫోన్లను ప్రైవేటు సంస్థల సేవలకు మార్చుకుంటున్నారు.