Monday, December 23, 2024

శుభవార్త: విశ్వకర్మ పథకానికి కేంద్ర కేబినెట్ ఓకే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సంప్రదాయ వృత్తుల్లో నైపుణ్యం గల వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ. 13 వేల కోట్ల వ్యయంతో దాదాపు 30 లక్షల మంది వృత్తి పనివారికి , వారి కుటుంబాలకు ప్రయోజనం కలిగించే “పిఎం విశ్వకర్మ ” పథకానికి కేంద్ర మంత్రి వర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వేలు, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలిపారు. ఈ పథకం గురించి మోడీ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా చేసిన ప్రసంగంలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

అశ్విని వైష్ణవ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించిందని తెలిపారు. ఈ పథకం కోసం ఐదేళ్లపాటు రూ. 13,000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. తొలిదశలో 18 సంప్రదాయ వృత్తులకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. వారికి పిఎం విశ్వకర్మ సర్టిఫికేట్లను జారీ చేసి గుర్తిస్తామని, ఆ తరువాత తొలిదశలో వారికి రూ.1 లక్షవరకు , రెండోదశలో రూ.2 లక్షల వరకు రుణసదుపాయం కల్పిస్తామని తెలిపారు. ఈ రుణంపై రాయితీ వడ్డీ రేటు 5 శాతం అని చెప్పారు. నైపుణ్యాభివృద్ధి , వృత్తి సంబంధిత పరికరాల కొనుగోలుకు ప్రోత్సాహం, డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ మద్దతు అందజేయనున్నట్టు చెప్పారు.

వడ్రంగి పనివారు, పడవల తయారీదారులు, బ్లాక్‌స్మిత్, లాక్‌స్మిత్, గోల్డ్‌స్మిత్, కుండల తయారీదారులు, శిల్పులు, చర్మకారులు , తాపీ మేస్త్రీలు, తదితరులు ఈ పథకం కింద లబ్ధి పొందవచ్చని చెప్పారు. ఈ పథకం కింద రెండు శిక్షణ కార్యక్రమాలను తీసుకురానున్నట్టు వెల్లడించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకున్న వారికి రోజుకు రూ.500 ఉపకార వేతనంతో మెరుగైన శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. శిక్షతరువాత పరికరాల కొనుగోలుకు రూ. 15 వేల ఆర్థిక సాయం అందించనున్నట్టు చెప్పారు. సెప్టెంబరు 17 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News