ఎరువులపై రూ.51,875 కోట్ల సబ్సిడీకి ఆమోదం
కేంద్ర మంత్రి మండలి భేటీలో నిర్ణయం
సత్తువ పెంచే రకాలకు తగ్గింపు వర్తింపు
రబీ కాలానికి సంబంధించి ప్రకటన
న్యూఢిల్లీ: ఎరువులపై రూ.51,875 కోట్ల సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం వెలువడింది. ఫాస్పేట్, పోటాసియం (పికె) ఎరువులకు సంబంధించి 202223 సంవత్సరం రెండో అర్థభాగంలో రైతులకు ఈ సబ్సిడీని ఉద్ధేశించారు. రైతులకు చవకధరలకు భూసార పరిరక్షక మందులను అందించే యత్నాలలో భాగంగా ఫాస్పేట్ ఎరువులకు ఈ పోషక ఆధారిత సబ్సిడీ (ఎన్‌బిఎస్) ఊతం కల్పించారని అధికార వర్గాలు కేబినెట్ భేటీ తరువాత ప్రకటన వెలువరించాయి. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో రబీ పంటకాలానికి సంబంధించి ఈ సబ్సిడీ మొత్తానికి ఆమోదం దక్కింది. నత్రజని ఎరువులకు కిలోకు రూ.98.02, ఫాస్పరస్ ఎరువులకు కిలోకు రూ.66.93, పొటాస్ ఎరువులకు కిలోకు రూ 23.65, సల్ఫర్ ఎరువులకు కిలోకు రూ.6.12 చొప్పున తగ్గింపు ఉంటుంది.
కేంద్ర మంత్రిమండలి తాజా సమావేశంలో ఎన్‌బిఎస్ రబీ 2022 అంటే 1/10/2022 నుంచి 31/03/2023 వరకూ పరిగణనలోకి వచ్చే సమయంలో రూ.51,875 కోట్ల సబ్సిడీని దేశీయ స్థాయి ఎరువుల ప్రోత్సాహక దిశలో సబ్సిడీగా తీసుకున్న నిర్ణయానికి ఆమోదం దక్కిందని ప్రకటనలో తెలిపారు. ఇంతకు ముందు ప్రభుత్వం ఎప్రిల్‌లో ఈ రకం ఎరువులకు ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రూ.60,939.23 కోట్లను తొలి ఆరు నెలల కాలానికి ప్రకటించారు. దేశంలో ఎన్‌బిఎస్ స్కీంను 2010 ఎప్రిల్ నుంచి అమలులోకి తీసుకువచ్చారు.
డెన్మార్క్‌తో జలవనరుల ఎంఒయుకు ఓకె
జలవనరుల అభివృద్ధి, నిర్వహణకు సంబంధించి భారతదేశం డెన్మార్క్‌తో కుదుర్చుకున్న సహకారం సంబంధిత అవగావహన ఒప్పందం పత్రాలపై కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జలవనరులను ఇనుమడింపచేయడం, వీటిని సరైన విధంగా వాడుకోవడం వంటి అంశాలపై ఇరుదేశాల మధ్య పరస్పర సహకారం ఏర్పడుతుంది. ప్రత్యేకించి సంబంధిత విషయాలపై సమాచార అనుసంధానం, సమీకృత, అధునాతన జల వనరుల నిర్వహణ, అభివృద్ధి , భూగర్భ జలాల ఇనుమడింపులు , పర్యవేక్షణ, నిల్వలను పెంచడం వంటి విషయాలపై సహకారం ఉంటుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ డెన్మార్క్‌లో మే 3వ తేదీన పర్యటించినప్పుడు ఇరు దేశాల మధ్య ఈ విషయంపై ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దీనికి ఇప్పుడు కేబినెట్ ఆమోదముద్ర పడింది.
ఇథనాల్ ధరకు స్పల్పంగా పెంపుదల
ఇథనాల్ ధరలను పెంచే నిర్ణయానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పెట్రోలులో ఇథనాల్ మిళితం ద్వారా ముడిచమురు దిగుమతి కోటాను తగ్గించుకోవాలనే ఆలోచనలో భాగంగా ఇథనాల్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా మూడు రకాల ఇథనాల్ ధరలను పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోద ముద్ర వేశారు. దీనితో చెరకు నుంచి తీసే ఇథనాల్ ధర లీటర్‌కు ఇప్పుడు రూ.63.45 ఉండగా ఇది ఇకపై రూ. 65.61 అవుతుంది. డిసెంబర్ 2022 ఇథనాల్ సరఫరా దశ కాలం నుంచి ఈ హెచ్చింపు ధర అమలులోకి వస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక సి హెవీ మెలాసిస్ ఉత్పాదక ఇథనాల్ రేటును ఇప్పుడు లీటరుకు రూ. 49.41గా ఖరారు చేశారు. ఇది ఇంతకు ముందు లీటరుకు రూ 46.66 గా ఉంటూ వచ్చింది. ఇక బి హెవీ రూటు ఇథనాల్ రేటు ఇప్పటివరకూ లీటరుకు రూ 59.08 ఉంది. దీనిని రూ 60.73గా ఖరారు చేశారు. ఇథనాల్ వాడకం దిశలో చర్యలు తీసుకోవడం ద్వారా ముడిచమురు దిగుమతుల ఖర్చు తగ్గుతుంది. ఈ మేరకు ఫారెక్స్ వ్యయంలో రూ.40,000 కోట్ల మేర ఆదా ఉంటుంది. అంతేకాకుండా చెరకు రైతుకు ఆదాయ వృద్థి జరుగుతుందని అధికారవర్గాలు తెలిపాయి.
Union Cabinet Approves Rs.1875 crore Subsidy for fertilisers