Monday, December 23, 2024

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణకు పసుపుబోర్డు ..గిరిజన వర్శిటీ
కృష్ణా జలాల వివాదంపై విధివిధానాలు?
ఉజ్వల పరిధి సిలిండర్ల సబ్సిడీ పెంపు

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి మండలి బుధవారం నాటి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవి ప్రధానంగా తెలంగాణకు సంబంధించివే. తెలంగాణ పసుపు బోర్డు ఏర్పాటు, తెలంగాణలోని ములుగులో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మంత్రి మండలి సమ్మతి తెలిపింది. తెలంగాణలో గిరిజనులకు ఉన్నత విద్యకోసం ఉద్ధేశించిన ఈ విద్యాలయానికి రూ 889.07 కోట్ల వ్యయ అంచనా వేశారు.

కేంద్ర కేబినెట్ వివరాలను కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్‌లు మీడియాకు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నడుమ కృష్ణా నదీజలాల వివాద పరిష్కారానికి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ జలవివాద పరిష్కారానికి అనుగుణంగా విధివిధానాల రూపకల్పనకు రెండవ కృష్ణా ట్రిబ్యునల్‌కు మంత్రిమండలి అభ్యర్థన వెలువరించనుంది. ఈ నిర్ణయం వల్ల 50 లక్షల మంది రైతులకు మేలు చేకూరుతుందని మంత్రి వివరించారు.

కృష్ణాజలాలలో తమ వాటాను ఖరారు చేయాల్సి ఉందని, తగు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఇప్పటి, ఇక ముందటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని జలాల పంపిణీ చేయాల్సి ఉంటుంది. ట్రిబ్యునల్ విధివిధానాలను రూపొందించడం జరిగితే దీని వల్ల తెలంగాణ ఆకాంక్ష నెరవేరుతుందని తెలంగాణకు చెందిన మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా కూడా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు సంబంధించిన నిర్ణయాలను ప్రత్యేకంగా వివరించారు.

వంటగ్యాసు సిలిండరు సబ్సిడీ ఇక రూ 300
ఉజ్వల పథకం పరిధిలోని వంటగ్యాసు సిలిండర్ల లబ్ధిదారులకు ఇప్పుడున్న రూ 200ల సబ్సిడీని రూ 300కు పెంచారు. ఈ మేరకు తీసుకున్న నిర్ణయానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 14.2 కిలోల సిలిండర్‌ను ఇప్పుడు మార్కెట్‌లో రూ 903కు విక్రయిస్తున్నారు. ఉజ్వల పరిధిలోని లబ్ధిదారులు దీనిని రూ 703లకు పొందుతున్నారు. ఇప్పుడు సబ్సిడీ పెంపుదలతో ఉజ్వల లబ్ధిదారులు సిలిండర్‌కు రూ 603 చెల్లించాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News