Monday, December 23, 2024

మార్చి 3న కేంద్ర మంత్రిమండలి భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి మండలి సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మార్చి 3వ తేదీన జరుగుతుంది. దీనికో ప్రత్యేకత ఉంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు జరిగే తుది మంత్రివర్గ సమావేశం ఇదే అవుతుంది. ఈ విషయాన్ని అధికార వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఈ సారి మంత్రివర్గ సమావేశం చాణక్యపురి డిప్లోమాటిక్ ఎన్‌క్లేవ్‌లోని సుష్మా స్వరాజ్ భవన్‌లో జరుగుతుంది.

దాదాపుగా ప్రతివారం ప్రధాని అధ్యక్షతన మంత్రి మండలి భేటీ, ఇందులో కీలక విధాన విషయాలపై చర్చ, తరువాత కొన్ని నిర్ణయాల ప్రకటన జరుగుతుంది. ప్రతి సారి కేబినెట్ భేటీలో ప్రధాని పాలనా వ్యవహారాలపై తమ అభిప్రాయాలు తెలియచేయడం, తగు సూచనలు తమ బృందానికి వెలువరించడం అంతర్గతంగా జరుగుతుంది. ఈసారి జరిగే సమావేశంలో ఎన్నికల సంసిద్ధత గురించి కూడా విశ్లేషించుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల జనం స్పందన, వీటి గురించి కార్యక్షేత్రంలో సమగ్రరీతిలో ప్రచారానికి ఇప్పటి భేటీలో ప్రధాని తగు సూచనలు వెలువరిస్తారని భావిస్తున్నారు.

ఈ క్రమంలో ఇప్పుడు జరిగే భేటీ సుదీర్ఘం అవుతుందని వెల్లడైంది. కాగా లోక్‌సభ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం వివిధ రాష్ట్రాలవారిగా సంసిద్ధతపై సమీక్షలు చేపట్టింది. వచ్చే నెల మధ్యలోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడే వీలుంది. 2014లో తొమ్మిది దశల ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 5వ తేదీన ఎన్నికల సంఘం వెలువరించింది. ఫలితాలు మే 16వ తేదీన వెలువడ్డాయి. 2019లో ఏడు దశల షెడ్యూల్‌ను మార్చి 10వ తేదీన విడుదల చేశారు. ఫలితాలు మే 23న ప్రకటించారు. ఈ క్రమంలో ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ మార్చి పది నుంచి పదిహేనులోపు ఎప్పుడైనా వెలువడే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News