Monday, December 23, 2024

మళ్ళీ లైసెన్స్ రాజ్!

- Advertisement -
- Advertisement -

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి కనీస విజ్ఞత కూడా లోపిస్తున్నట్టు రుజువవుతున్నది. డొల్లబారిన స్వావలంబన (ఆత్మనిర్భరత) పథకం సత్ఫలితాలిస్తున్నదని చెప్పుకోడానికి విదేశీ పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, సర్వర్లు మున్నగు వినిమయ ఎలెక్ట్రానిక్స్ పరికరాల దిగుమతిని నిషేధిస్తున్నట్టు గురువారం నాడు ప్రకటించిన కేంద్రం 24 గం. తిరగకుండానే ఆ నిర్ణయాన్ని రద్దు చేసుకొన్నది. వాణిజ్య అవసరాలకు విదేశీ కంప్యూటర్లు తదితరాలను దిగుమతి చేసుకోదలచినవారు ఇక నుంచి ప్రభుత్వం వద్ద లైసెన్స్ పొందాలని గురువారం నాటి ప్రకటన పేర్కొన్నది. అంతవరకూ లేని లైసెన్స్ పద్ధతిని ప్రవేశపెట్టడం వెనుక ఆ పరికరాల దేశీయోత్పత్తిని పెంచాలన్న దృఢ సంకల్పం వున్నట్టు ప్రభుత్వం చెప్పుకొన్నది.

యాపిల్, శామ్‌సంగ్ వంటి అతిపెద్ద విదేశీ కంపెనీలు సహా అందరూ వీటి దిగుమతిని నిలిపివేసి దేశీయంగానే వాటిని రూపొందించుకోవాలని ప్రభుత్వం ఆశించింది. అంతలోనే ఈ నిర్ణయాన్ని మార్చుకోడం వెనుకనున్నది దానిలో ఆలస్యంగా అంకురించిన వాస్తవిక దృక్పథమేనని బోధపడుతున్నది. ప్రభుత్వం లైసెన్స్ పద్ధతిని ప్రకటించగానే శామ్‌సంగ్, యాపిల్ తదితర కంపెనీలు తమ అవసరాల కోసం తెచ్చుకోదలచిన ఈ పరికరాల దిగుమతులను నిలిపివేశాయని తెలుస్తున్నది. దీనితో ప్రధాని మోడీ ప్రభుత్వంలో వణుకు మొదలైంది. ఈ పరికరాలను దేశంలోనే తయారు చేయదలిస్తే ఆ ప్రక్రియ ఏనాడో మొదలై వుండవలసింది. అలా తయారు చేసిన పరికరాలు అంతర్జాతీయ ప్రమాణాల గీటురాయి మీద రుజువు చేసుకొన్న తర్వాత వాటి దిగుమతిని నిలిపివేస్తే సమంజసంగా వుండేది.

ప్రధాని మోడీ 2020 మే లో రూ. 20 లక్షల కోట్ల వ్యయ అంచనాతో ఆత్మనిర్భర్ అభియాన్ పథకాన్ని ప్రకటించినప్పటి నుంచే ఈ ప్రక్రియ మొదలై వుండవలసింది. దేశీయం గా తయారు చేసే పరికరాల ధరలు అధికంగా వుంటాయి. ఆ రేట్లకు బలవంతంగా కొనిపించడం సమంజసం కాబోదు. దేశం ఎప్పుడో విడిచిపెట్టిన లైసెన్స్ రాజ్‌ను మోడీ ప్రభుత్వం తిరిగి ప్రవేశపెడుతున్నదంటూ సామాజిక మాధ్యమాల్లో దాడి ముమ్మరం కావడంతో కొత్త విధానంపై త్వరలో ప్రకటన చేస్తామని అప్పటి వరకు వీటి దిగుమతులపై ఎటువంటి ఆంక్షలు వుండబోవని కేంద్ర ఐటి, ఎలెక్ట్రానిక్స్ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించారు. కొత్త విధానాన్ని అమల్లోకి తేడానికి ముందు తగినంత వ్యవధి వుంటుందని కూడా ఆయన చెప్పారు. ఇది ఒక సాకు మాత్రమే అని భావించవలసి వుంది. దేశీయ ఉత్పత్తిని పెంచడం కోసం విదేశీ దిగుమతులను నిషేధించడమనేది ఇక ముందు జరగబోదనే ఆశించాలి. నిషేధ నిర్ణయానికి సంబంధించి ప్రభుత్వం చెబుతున్న మరో కారణం భద్రతాపరమైనది.

మనం దిగుమతి చేసుకొంటున్న పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు వగైరాల్లో అత్యధిక భాగం చైనా నుంచి వస్తున్నవే. అందుచేత వాటిలో మన భద్రతకు ముప్పు కలిగించే లక్షణాలు వుండవచ్చనే అనుమానంతో వాటి దిగుమతిని నిషేధించే నిర్ణయాన్ని తీసుకొన్నామని ప్రభుత్వం చెబుతున్నది. ప్రపంచీకరణ మొదలైన తర్వాత ఏ వస్తువు ఎక్కడ తయారవుతూ వుంటే అక్కడి నుంచి తెచ్చుకొని అవసరాన్ని తీర్చుకోడం మామూలైపోయింది. చైనా నుంచి కొన్ని వస్తువులను మనం తెచ్చుకోగా మన నుంచి మరి కొన్నింటిని అది కొనుగోలు చేస్తున్నది. ఇందులో భద్రతాపరమైన భయాలు పెద్దగా వుండేందుకు ఆస్కారం లేదనే చెప్పాలి. అసలు విషయమేమిటంటే మనం చేసుకొంటున్న ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లు తదితరాల దిగుమతుల విలువ 5.33 బిలియన్ డాలర్లు కాగా, ఇందులో 75 శాతానికి పైబడి చైనా నుంచే తెచ్చుకొంటున్నాము. ఇవి 202223 ఆర్థిక సంవత్సరం గణాంకాలు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలని ప్రధాని మోడీ ప్రభుత్వం ఆరాటపడడాన్ని అర్ధం చేసుకోవచ్చు.

కాని అందుకు తగిన పకడ్బందీ ప్రణాళిక లేకుండా అది సులభసాధ్యం కాదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హార్డువేర్ రంగంలో ఉత్పత్తిని బట్టి ప్రోత్సాహకాలు ఇచ్చే విధానాన్ని కేంద్రం ఇటీవల పొడిగించింది. ఎలెక్ట్రానిక్స్ రంగంలో స్వావలంబనను పెంపొందించాలని ఈ పని చేసింది. కాని అది తక్షణమే జరిగే పని కాదు. సంస్కరణల బాటలో వెనకడుగు ప్రసక్తే లేదని చెప్పి దేశంలోని విలువైన ప్రభుత్వరంగ పరిశ్రమలను, గనులను అదానీలకు, అంబానీలకు కట్టబెడుతూ మరొక వైపు కాలం చెల్లిన లైసెన్స్ పద్ధతిని రుద్దడంలో ప్రధాని మోడీ ప్రభుత్వ అవధులు మీరిన అవకాశవాదమే రుజువవుతున్నది. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి మత ప్రాతిపదికన మందు పాతరలు రగిలించడమే పనిగా వ్యవహరిస్తున్న బిజెపి ఇకనుంచైనా తన రూటు మార్చుకొని దేశాన్ని స్వావలంబన దిశగా నడిపించడానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News