దేశంలోని అతిపెద్ద పారామిలిటరీ దళం కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం (సిఆర్‌పిఎఫ్)కు చెందిన కొందరు మహిళా సిబ్బంది సిఆర్‌పిఎఫ్ డిఐజి ఖజన్ సింగ్ లైంగిక అక్రమ ప్రవర్తనకు పాల్పడినట్లు చేసిన ఆరోపణలపై అతనిని కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చేసింది. సిఆర్‌పిఎఫ్ డిఐజి, మాజీ క్రీడల అధికారి ఖజన్ సింగ్‌ను ‘సర్వీస్ నుంచి బర్తరఫ్ చేస్తూ’ రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఒక ఉత్తర్వు మే 30న జారీ అయింది. సర్వీస్ నుంచి బర్తరఫ్ మే 31 నుంచి అమలులో ఉంటుందని ఆ ఉత్తర్వు తెలిపింది. ఆఫీసర్‌కు గత కొన్ని నెలల్లో సిఆర్‌పిఎఫ్ రెండు సంజాయిషీ నోటీసులు జారీ చేసిన తరువాత బర్తరఫ్ తుది ఉత్తర్వును కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) ఆమోదించాయి.
సిఆర్‌పిఎఫ్ పశ్చిమ రంగం కింద నవీ ముంబయిలో నియుక్తుడైన ఖజన్ సింగ్ లైంగిక వేధింపుల ఆరోపణలను ఖండించారు. అవి ‘పూర్తిగా తప్పు’ అని, తన ‘ప్రతిష్ఠ’ను దెబ్బ తీసేందుకు చేసినవని ఖజన్ అన్నారు. అంతర్గత కమిటీ రూపొందించిన దర్యాప్తు నివేదికను సిఆర్‌పిఎఫ్ ప్రధాన కార్యాలయం ఆమోదించి, దానిని సముచిత క్రమశిక్షణ చర్య నిమిత్తం యుపిఎస్‌సికి, హోమ్ మంత్రిత్వశాఖకు పంపింది. ఆఫీసర్ ఖజన్ రెండు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నారు. సిఆర్‌పిఎఫ్ చీఫ్ స్పోర్ట్ ఆఫీసర్ అయిన ఖజన్ సింగ్ 1986 సియోల్ ఏషియన్ గేమ్స్‌లో 200 మీటర్ల బటర్‌ఫ్లై ఈత పందెంలో రజత పతకం గెలుపొందారు. 1951లో ఏషియాడ్ మొదలైన తరువాత ఆ టోర్నమెంట్‌లో ఈతలో భారత్‌కు తొలి పతకం అది.