Saturday, December 21, 2024

సగం రైతులకే పిఎం కిసాన్

- Advertisement -
- Advertisement -

Union govt negligent in implementing PM Kisan for new farmers

రాష్ట్రంలో 30లక్షల మందికిపైగా ఎదురుచూపులు

మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో రైతుల ఆదాయాన్ని 2022నాటికి రెట్టింపు చేస్తామన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడి కేంద్ర ప్రభుత్వ పధకాల అమలులో మాత్రం రైతుల పట్ల కఠిన వైఖరి వీడటం లేదు. ప్రధానమంత్రికిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కొత్త రైతులకు అమలు చేయటంలో కేంద్ర ప్రభుత్వం అలవిమాలిన నిర్లక్ష్యం కనబరుస్తోందన్న విమర్శలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి. 2019 జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమల్లోకి తెచ్చింది. పొలం గరిష్ట విస్తీర్ణంతో పనిలేకుండా ఒక్కో రైతుకు ఏటా రూ.6000 మాత్రమే ఈ పధకం కింద రైతులకు అందజేస్తోంది. అది కూడా రూ.2000 వంతున మూడు విడుతలుగా ఏటా రూ.6000 అందిస్తోంది. 2019 జనవరి 31కంటే ముందుగానే పట్టాదార్ పాస్‌పుస్తకం పొందిన రైతుల్లో గుంట నుంచి గరిష్టంగా 45ఎకరాలు మించకుండా పొలం ఉన్న రైతులు ఈ పథకాన్ని వర్తింపచేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో పట్టాదార్ పాస్‌పుస్తకం కలిగి పొలం ఉన్న రైతుల సంఖ్య గత యాసంగి నాటికే 62.99లక్షలు దాటింది. అయితే ఇంత పెద్ద మొత్తంలో రైతులు ఉన్నప్పటికీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 2019జనవరి నాటికి రాష్ట్రంలో 35.19లక్షల మంది రైతులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి అర్హులుగా గుర్తించింది.

అప్పటి నుంచి ఏటా మూడు దఫాలుగా రెండేసి వేల రూపాయల వంతున ఇప్పటివరకు 10 విడుతలుగా రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు జమ చేస్తూవస్తోంది. అయితే రాష్ట్రంలో ఉన్న ఇంకా సగం మంది రైతులను కేంద్ర ప్రభుత్వం ప్రధాని కిసాన్ పథకానికి దూరం పెట్టింది. ఈ మూడేళ్లలో ఎంతో మంది కొత్త రైతులు పుట్టుకొచ్చారు. భూముల క్రయ , విక్రయాల ద్వారా లక్షల సంఖ్యలో లావాదేవీలు జరిగాయి. కొత్త రిజిస్ట్రేషన్ల ద్వారా లక్షల్లోకి రైతుల సంఖ్య పెరిగిపోయింది. వీరంతా గత మూడేళ్లుగా ప్రధానమంత్రి కిసాన్ పధకం కింద నిధులు పొందేందుకు ఎంతో ఆశకగా ఎదురు చూస్తూన్నారు. 2019జనవరి నాటికి ఈ పధకం పరిధిలో చేరి ఉండి ఆ తరువాత వివిధ కారణాలరిత్యా మృతి చెందిన రైతులకు సంబంధించిన పొలం పట్టా ఇతరుల పేరుమీద బదాలాయింపుతో పట్టాదార్ పాస్‌బుక్ మార్పిడి జరిగివుంటే అటువంటి వారిని మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి అర్హులుగా గుర్తించి ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.6000 అందజేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ,2004కు ముందు అప్పటి ప్రభుత్వం గ్రామాల్లో వృద్దాప్య పించన్ కొత్తవారికి మంజూరులో ఎవరైనా గ్రామంలో మృతి చెందితేనే వారి స్థానంలో కొత్తవారికి పించన్ మంజూరు చేస్తూవచ్చిన తీరును గుర్తు చేస్తూ కేంద్ర ప్రభుత్వంపైన రైతులు మండి పడుతున్నారు. ఒక వైపున బిజేపి పాలనలో అచ్చేదిన్ అంటూనే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి అమలులో సచ్చేదిన్ రీతిలో వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రైతు వ్యతిరేక చట్టాలజోలికి పోయి చేయికాల్చుకున్న కేంద్ర ప్రభుత్తం తన విధానాలు ఇలాగే కొనసాగిస్తూ పోతే రైతుల ఆదాయం 2022నాటికి కాదుకదా మరో 20ఏళ్లయినా ఇలాగే వుంటుందని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి.

సాగు ఖర్చులు పెరిగాయి..రూ. 20వేలకు పెంచాలి :

ఈ వానాకాలం పంటల సాగు సీజన్ నుంచైనా కేంద్ర ప్రభుత్వం ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిబంధనలు మార్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో పొలం ఉన్న ప్రతిరైతుకు పిఎం కిసాన్ నిధి అమలు చేయాలని కోరుతున్నారు. కొత్త రైతులతో కలిపి మొత్తం 63లక్షల మందికి పైగానే రైతులు ఈ పధకం కింద అర్హత కల్పించాలని కోరుతున్నారు. అంతే కాకుండా 2019 జనవరి నుంచి ఈ మూడేళ్ల కాలంలో వ్యయసాయ యాంత్రీకరణకు పనులకు ఉపయోగిస్తున్న పెట్రోల్ ,డీజిల్ ధరలు మూడు రెట్లు పెరిగాయని గుర్తు చేస్తున్నారు. పంటలకు ఉపయొగించే రసాయనిక ఎరువులు , క్రిమిసంహారక మందుల ధరలను కూడా కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచుతూ వచ్చింది. పంటల సాగులో అన్ని విధాలుగా సాగు ఖర్చులు భారీగా పెరిగిన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా వీటన్నిటినీ పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పధకం కింద అర్హత ఉన్న ప్రతిరైతుకు ఏటా రూ.20వేలు అందజేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News