తెలంగాణ బాటలో బిజెపియేతర రాష్ట్రాలు
సెస్ ఆదాయంలో
వాటాలపై రాష్ట్రాలకు
కనువిప్పు
ఆర్థ్ధికశాఖను ఆరా
తీస్తున్న రాష్ట్రాలు
15వ ఆర్థ్ధిక సంఘం
సిఫార్సులు
బుట్టదాఖలు
ఆర్టికల్ 270
ఉల్లంఘించిన
కేంద్రం?
మన తెలంగాణ/హైదరాబాద్ : ‘కంచే చేను మేసినట్లు’గా రాష్ట్రాలను ఆర్థ్ధికంగా ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలకు న్యాయంగా, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన వాటా నిధులను ఎగ్గొట్టిన వైనంపై తెలంగాణ ప్రభుత్వ వాదనకు జాతీయస్థాయిలో మద్దతు పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం వసూలు చే స్తున్న జిఎస్‌టి పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకు 41 శాతం వాటాలు ఇవ్వడంలోగానీ, ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం రాష్ట్రాలు రుణాలను సేకరించుకోవడానికి కేంద్రం సృష్టించిన అనేక అడ్డంకులు, సెస్- చా ర్జీల రూపంలో దేశ ప్రజల నుంచి ఇబ్బడి ముబ్బడిగా వసూ లు చేస్తున్న అదనపు ఆదాయంలోనూ రాష్ట్రాలకు వాటాలు ఇవ్వకుండా కేంద్రం తన ఖజానాలో వేసుకోవడంపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీసిన వైనంపై జాతీయస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.
ఇప్పటికే తెలంగాణ ప్ర భుత్వ వాదనను సమర్థించిన ఒడిశా ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖలు రాయడమే కాకుండా ఆయన పార్టీకి చెందిన ఎంపిలు కూడా పార్లమెంటులో నిలదీయగా, తాజాగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలిని తూర్పారపట్టారు. ఇప్పటి కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు కూడా తెలంగాణ వాదనలను బలపరచగా మిగతా బిజెపియేతర రాష్ట్రాలు తెలంగాణ దారిలోకి వస్తున్నాయి. మిగతా రాష్ట్రాల ఆర్థ్ధికశాఖల ఉన్నతాధికారులు తెలంగాణ రాష్ట్ర ఆర్థ్ధికశాఖాధికారులకు ఫోన్లు చేసి ఆర్థ్ధిక వ్యవహారాలు, వనరుల సమీకరణకు కేంద్రం అడ్డుపుల్లలు వేస్తున్న వైనంపై ఆరాతీస్తున్నారని తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థ్ధిక సంఘం, 15వ ఆర్థ్ధిక సంఘం, నీతి ఆయోగ్‌ల సిఫారసులు మేరకు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు 34,149 కోట్ల రూపాయల బకాయిలను ఎగ్గొట్టిందని, అంతేగాక ఎఫ్‌ఆర్‌బిఎం చట్టానికి లోబడి అప్పులు తెచ్చుకోవడానికి తెలంగాణ చేసిన ప్రతిపాదనలకు కేంద్రం అనుమతులు ఇవ్వకపోవడం, కాలంచెల్లిన రూల్సుతో తెలంగాణ అభివృద్ధిని కేంద్రమే అడ్డుకుంటోందనే అంశాలను సాక్షాధారాలతో సహా వివరించడంతో బిజెపియేతర రాష్ట్రాలు ఆలోచనలో పడ్డాయి.
పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకు ఇస్తానన్న 41 శాతం నిధుల్లో కూడా అనేక రకాలుగా అంకెల నిధులు రాష్ట్రాలకు ఇవ్వకుండా కేంద్రం చేస్తున్న మోసాలను ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఆర్థ్ధిక శాఖ మంత్రి టి.హరీష్‌రావు వివరించిన ఆంశాలు కూడా సరికొత్త చర్చకు దారితీశాయి. ఇక సెస్, సర్‌చార్జీల రూపంలో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల నుంచి గడచిన ఏడేళ్లల్లో వసూలు చేసిన మొత్తం 15,47,560 కోట్ల రూపాయలు కాగా, ఈ ఏడాదిలోనే 5,35,112 కోట్ల రూపాయలను సెస్, సర్‌చార్జీల రూపంలో కేంద్రం వసూలు చేసిందని, మొత్తం సెస్‌ల రూపంలో రికార్డుస్థాయిలో 21 లక్షల కోట్ల రూపాయల నిధులను సమకూర్చుకొన్న కేంద్రం రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘించడమే కాకుండా 15వ ఆర్థ్ధిక సంఘం సిఫారసులను కూడా పూర్తిగా బుట్టదాఖలు చేసిందనే అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు ఉన్నతాధికారులు కసరత్తులు చేస్తున్నారు. 15వ ఆర్థ్ధిక సంఘం కూడా కేంధ్ర ఖజానాకు వస్తున్న ఆదాయం మొత్తం బడ్జెట్ 63 శాతం మేరకు ఉండగా అందులో కేవలం 38 శాతం నిధులను కేంద్రం ఖర్చు చేస్తోందని కూడా 15వ ఆర్థ్ధిక సంఘం గత ఏడాది కేంద్రానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది.
అంతేగాక రాష్ట్రాలు అభివృద్ధి పథకాలకు ఏకంగా 62 శాతం మేరకు ఖర్చు చేస్తుండగా అందులో కేవలం 37 శాతం నిధులనే కేంద్రం రాష్ట్రాలకు ఇస్తోందని కూడా 15వ ఆర్థ్ధిక సంఘం నిగ్గుతేల్చిందని ఆర్థ్ధికశాఖలోని కొందరు అధికారులు వివరించారు. ఆదాయ, వ్యయాల్లో అంతులేని వ్యత్యాసం ఉందని, ఈ వ్యత్యాసాలను తొలగించడానికి కనీసం అయిదేళ్లకు ఒక్కసారైనా సెస్, సర్‌చార్జీల ఆదాయంలో నుంచి రాష్ట్రాలకు వాటా నిధులను ఇవ్వాలని కూడా 15వ ఆర్థ్ధిక కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కానీ ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్ధిక సంఘం సిఫారసులను అమలు చేయలేదని, ఆర్థ్ధిక సిఫారసులను అమలు చేస్తే అన్ని రాష్ట్రాలకూ 8 లక్షల 60 వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాల్సి ఉంటుందని వివరించారు. తెలంగాణ రాష్ట్రానికి 2.102 వాటా లెక్కన 42వేల కోట్ల రూపాయల నిధులు వస్తాయని తెలిపారు.
రాష్ట్రాలకు పన్నుల ఆదాయంలో 41 శాతం నిధులు వాటా ఇస్తున్నట్లుగానే చెబుతున్న కేంద్రం మరోవైపు జిఆర్‌జిఎఫ్, మోడల్ స్కూల్స్‌ను రద్దు చేయడం మూలంగా అవి అమలులో ఉండటం మూలంగా అర్ధాంతరంగా నిలిపివేస్తే ప్రజలు, విద్యార్థిలోకం ఇబ్బందులు పడే అవకాశాలున్నందున రాష్ట్రాలు సొంత ఖర్చులతో ఆ పథకాలను కొనసాగిస్తున్నాయని, దీంతో రాష్ట్రాలపై ఆర్థ్ధిక భారం పెరిగిందని అధికారులు వివరించారు. వాస్తవానికి సర్‌చార్జి పేరుతో పన్నులు వేయడమంటే పన్నులపైనా అదనంగా పన్నులు వేయడమేనని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 270ను ఉల్లంఘించినట్లేనని వివరించారు.
కొన్ని పథకాల్లో కేంద్ర ప్రభుత్వ వాటా 80 శాతం నుంచి 90 శాతం వరకూ ఉండేవని, వాటిని 60 శాతానికి తగ్గించడంతో రాష్ట్రాలకు ఇస్తున్న పన్నుల వాటా 41 శాతం కాస్తా 29.6 శాతానికి పడిపోయినట్లయ్యిందని వివరించారు. పిఎం కిసాన్ యోజన, సడక్ యోజన, ఐసిడిఎస్ తదితర అనేక పథకాలకు కేంద్రం తన వాటాను 60 శాతానికి తగ్గించడంతో రాష్ట్రాలపై ఆర్థ్ధికంగా పెను భారం పడిందని తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన వాదనకు ఆర్థ్ధికయేతర రాష్ట్రాలు వంతపాడుతున్నాయి. ఇలా కేంద్రం అంకెల గారడీతో, జిఎస్‌టి పన్నుల రూపంలో వసూలు చేస్తే రాష్ట్రాలకు 41 శాతం వాటా నిధులు ఇవ్వాల్సి ఉంటుందని, అలాకాకుండా మొత్తం నిధులను తాను స్వాహా చేయడం కోసమే సెస్, సర్‌చార్జీల పేరుతో దేశ ప్రజల నుంచి ఏకంగా 21 లక్షల కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం వసూలు చేసి రాష్ట్రాలకు ఒక్క రూపాయిని కూడా ఇవ్వలేదని గళమెత్తిన తెలంగాణ ప్రభుత్వానికి ఇతర రాష్ట్రాలు కూడా మద్దతుగా నిలుస్తున్నాయి.
బిజెపియేత రాష్ట్రాలే కాకుండా చివరకు బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టే రోజులు వస్తాయని కూడా ఆ అధికారులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. పరిస్థితులు చేయిదాటిపోక ముందే కేంద్రం తన వ్యవహారశైలిని మార్చుకొని సెస్, సర్‌చార్జీల్లో రాష్ట్రాలకూ వాటాలు ఇవ్వడం, ఎఫ్.ఆర్.బి.ఎం.చట్ట పరిమితుల్లో తెచ్చిన కొత్త రూల్సును రద్దు చేసి రాష్ట్రాలకు సహకరిస్తుందా? లేదా?, పన్నుల ఆదాయంలో రాష్ట్రాల వాటాలను 41 శాతం నుంచి 45 శాతానికి పెంచుతుందా? లేదా? అనేది వేచిచూడాలి.