న్యూఢిల్లీ : కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్ వల్ల ప్రజలు వైరస్‌ను వ్యాపింప చేసే ప్రమాదం ఉండదని, అలాగే ఏదోఒక సమయంలో దాని నిర్మూలన సాధ్యమౌతుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ గురువారం పేర్కొన్నారు. టీకాపై కొన్ని వర్గాల సంకోచం వల్ల తలెత్తుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని మంత్రి ఐఇసి పోస్టర్లను ఆవిష్కరించారు. వ్యాక్సిన్ల భద్రత, సామర్ధం వివరిస్తూ వాస్తవంగా పరిశీలిస్తే ప్రపంచం లోని దేశాలు వ్యాక్సిన్ల గురించి మనలను అడుగుతుండగా, మనలోని ఒక వర్గం వారు సంకుచిత రాజకీయ దృష్టితో సందేహాలతోపాటు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దేశం లోని ప్రతివారి సాధన వల్ల క్రియాశీల కరోనా కేసుల సంఖ్య నిదానంగా తగ్గుతోందని మంత్రి గుర్తు చేశారు.
భారీ ఎత్తున సార్వత్రిక టీకా కార్యక్రమాల వల్ల పోలియో, మశూచికం వంటివి నిర్మూలించడం సాధ్యమైందని అలాగే ఒకసారి వ్యాక్సినేషన్ పొందితే ఆ వ్యక్తి వ్యాధికి గురికాడు సరికదా, ఇతరులకు వ్యాపింప చేయలేడని పేర్కొన్నారు. భారీ ఎత్తున సామూహిక టీకా కార్యక్రమాలను 12 వ్యాధులకు వ్యతిరేకంగా, మహిళలకు, పిల్లలకు ఇంద్రధనుష్ మిషన్ కింద చేపట్టడం లోని వ్యూహం ఇదేనని ఆయన అన్నారు. కరోనా వ్యాక్సిన్ల గురించి విశ్వసనీయమైన, అధికారిక సమాచారం పొందాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఉదయం 7 గంటల వరకు 8 లక్షల కన్నా ఎక్కువ మంది హెల్త్ వర్కర్లు వ్యాక్సినేషన్ పొందారని ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది.