అమరావతి: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు శనివారం నాడు తిరుపతి పర్యటనలో ఘన స్వాగతం లభించింది. ఏపిలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన అమిత్‌షా శనివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ వేచివున్న ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డితోపాటు పలువురు రాష్ట్ర మంత్రులు ,బిజేపి నాయకులు ,కార్యకర్తలు కేంద్ర మంత్రి అమిత్‌షాకు ఘనస్వాగతం పలికారు.అనంతరం కేంద్ర మంత్రి రోడ్డు మార్గంలో తిరుపతిలోని తాజ్‌హోటల్‌కు చేరుకున్నారు.అనంతరం రాత్రి నేరుగా తిరుమలకు చేరుకున్నారు.
ఎపి సిఎం జగన్‌తోపాటు హోంమంత్రి అమిత్ షా శ్రీవారి సేవలో పాల్గొని రాత్రికే తిరిగి తిరుపతికి చేరుకుంటారు. ఆదివారం తిరుపతి తాజ్ హోటల్‌లో జరిగే 29వ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఎపి, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి , అండమాన్ నికోబార్ , లక్షద్వీప్ రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రులు , లెఫ్ట్‌నెంట్ గవర్నర్ లు ,ముఖ్యఅధికారులు హాజరు కానున్నారు. దేశాభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామ్యం పెరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన హోంమంత్రి సూచనలు చేయనున్నారు. బెంగుళూరులో జరిగిన 28వ జోనల్ సదస్సులో తీసుకున్న నిర్ణయాలపై కూడా సమీక్ష చేయనున్నారు. సమావేశంలో ఆయా రాష్ట్రాలకు చెందిన 48అంశాలపై చర్చ జరగనుంది.