Thursday, December 26, 2024

పార్లమెంట్‌లో సంచలన బిల్లులు.. వాటి స్థానాల్లో కొత్త చట్టాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత్‌లో నేర సంబంధిత న్యాయవ్యవస్థలో కీలక మార్పులకు కేంద్రం సిద్ధమైంది. బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ,సీఆర్‌పిసీ, ఎవిడెన్స్ చట్టాలను వేరే కొత్త చట్టాలతో భర్తీ చేయనుంది. రాజద్రోహ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయడంతోపాటు మూక దాడులకు పాల్పడితే మరణశిక్ష విధించేలా కొత్త చట్టాన్ని రూపొందించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటితోపాటు సాయుధ తిరుగుబాటు, విధ్వంసచర్యలు, వేర్పాటువాద కార్యకలాపాలు, దేశ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే నేరాలకు సంబంధించి కొత్త చట్టాల్లో ప్రతిపాదనలు పొందుపరిచినట్టు తెలిపింది.

కొత్తగా ప్రవేశ పెట్టిన భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్) బిల్లులో దేశద్రోహ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయడం కీలక ప్రతిపాదన. దీంతోపాటు మూక దాడులు, మైనర్లపై అత్యాచారానికి పాల్పడితే గరిష్ఠంగా మరణశిక్ష విధించే ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. చిన్న నేరాలకు పాల్పడే వారికి సమాజ సేవ వంటి శిక్షను తొలిసారి అమలు చేసే ప్రతిపాదన పొందుపరిచారు. వీటితోపాటు సాయుధ తిరుగుబాటు, విధ్వంస చర్యలు, వేర్పాటువాద కార్యకలాపాలు, దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే చర్యలను నేరాలుగా పరిగణిస్తూ ఈ బిల్లుల్లో పొందుపరిచారు.

పోలీస్‌లు తమ అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నిందితులు పరారీలో ఉన్నా వారిపై విచారణ జరిపే నిబంధన చేర్చారు. పోలీస్‌లు చేసే సెర్చి ఆపరేషన్లలో వీడియోగ్రఫీ , ఏడేళ్లు అంతకంటేఎక్కువ జైలు శిక్ష పడే కేసుల్లో నేరం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్ బృందం వెళ్లి పరిశీలించడం తప్పనిసరివంటి అంశాలు ఇందులోఉన్నాయి. న్యాయస్థానాల్లో తీర్పుల నిష్పత్తి ని 90 శాతానికి తీసుకెళ్లడమే లక్షంగా ఈ బిల్లులను రూపొందించామని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.

కేంద్ర మంత్రి హోం మంత్రి షా ఈమేరకు మూడు బిల్లులను లోక్‌సభలో శుక్రవారం ప్రవేశ పెట్టారు. భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023, భారతీయ సాక్ష బిల్లు2023 లను తదుపరి పరిశీలన కోసం పార్లమెంటరీ స్థాయి సంఘానికి పంపిస్తామని చెప్పారు. “ ఐపిసి, సీఆర్‌పిసీ, ఎవిడెన్స్ యాక్ట్‌లు బ్రిటిష్ కాలం నాటి చట్టాలు… ఆంగ్లేయుల పాలనను రక్షించడం, బలోపేతం చేయడంతోపాటు శిక్షించడమే లక్షంగా వాటిని ప్రవేశ పెట్టారు. బాధితులకు న్యాయం చేయడం వాటి ఉద్దేశం కాదు.. వాటి స్థానంలో ప్రవేశ పెట్టనున్న కొత్త మూడు చట్టాలు , భారత పౌరుల హక్కులను పరిరక్షిస్తాయి” అని లోక్‌సభలో అమిత్‌షా వ్యాఖ్యానించారు.

“ శిక్ష వేయడం కాదు, న్యాయం అందించడం ఈ కొత్త చట్టాల లక్షం. అయితే నేరాలను అరికట్టేందుకు శిక్షలు ఉంటాయి. ” అని షా చెప్పారు. ఇక శాంతికి భంగం కలిగించే నేరాలు, సాయుధ తిరుగుబాటులు, విధ్వంసకర చర్యలు, విభజనవాద కార్యకలాపాలు లేదా భారత ఐక్యత, సమగ్రతకు సంబంధించిన చట్టాలను సవరించిన చట్టాల్లో చేర్చనున్నారు. మరోవైపు మహిళలు, పిల్లలు, హత్యలు, ప్రభుత్వ వ్యతిరేక నేరాలను కొత్తబిల్లుల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

ఇక తొలిసారిగా చిన్నచిన్న నేరాలకు సంఘ సేవను శిక్ష విధించబోతున్నారు. అంతేకాదు లింగసమానత్వంతో కొత్త చట్టాలను రూపొందించారు. ఇక వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాలు, ఉగ్రవాదానికి సంబంధించిన కొత్త కార్యకలాపాలను నియంత్రించేలా కఠినమైన శిక్షలను చేర్చారు. వేర్వేరు నేరాలకు సంబంధించిన జరిమానాలు, శిక్షలను పెంచారు. ఇదిలా ఉండగా ఇండియన్ పీనల్ కోడ్‌ను 1860 లో బ్రిటిష్ వారు ప్రవేశ పెట్టారు.

మూడు బిల్లుల్లోని ముఖ్యమైన మార్పులు…
మైనర్లను అత్యాచారం చేస్తే ఉరిశిక్ష
సామూహిక అత్యాచారానికి పాల్పడితే 20 ఏళ్ల జైలు.
మూక దాడులకు ఏడేళ్ల జైలు
7 సంవత్సరాలకు పైగా శిక్ష విధించే కేసుల్లో ఫోరెన్సిక్ సాక్షాలు తప్పనిసరి.
ఎక్కడి నుంచైనా ఈ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవచ్చు.
సెర్చ్ ఆపరేషన్ చేస్తే సెర్చ్‌వారెంట్‌తోపాటు ఎవరి వద్దకైనా వెళ్తే వీడియోగ్రఫీ చేయాల్సిందే.
ఎఫ్‌ఐఆర్ నుంచి ఛార్జిషీట్ వరకు అన్ని డిజిటిలైజ్ చేయాలి.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News