Wednesday, January 22, 2025

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్/చురాచంద్‌పూర్: మణిపూర్‌లో ఇటీవల చెలరేగిన హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.10 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించాయి. అదే విధంగా మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వనున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ మధ్య సోమవారం రాత్రి జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాగా , మణిపూర్‌లో తిరిగి శాంతి నెలకొల్పే ప్రయత్నంలో భాగంగా నాలుగు రోజుల పర్యటన కోసం వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం పెద్ద ఎత్తున హింసాకాండ చోటు చేసుకున్న చురాచంద్‌పూర్ ప్రాంతంలో పర్యటించారు.

ఇంటెలిజన్స్ బ్యూరో చీఫ్ తపన్ కుమార్ డేకా, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా తదితరులు వెంట రాగా హెలికాప్టర్‌లో చురాచంద్‌పూర్ చేరుకున్న అమిత్ షా చర్చి నాయకులతో పాటుగా కుకి తెగకు చెందిన మేధావులు, సభ్య సమాజం నేతలు, మహిళా సంఘాల నేతలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణిపూర్‌లో ఇటువంటి సంఘటనుల జరగడం దురదృష్టకరమన్నారు. ప్రాణనష్టం జరిగిన కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. వంటగ్యాస్, పెట్రోల్, ఇతర నిత్యావసర వస్తువులకు కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇదిలా ఉండగా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో ఈ నెల 3న ఉన్నట్లుండి అల్లర్లు చెలరేగి మారణకాండకు దారితీయడంతో యావద్భారతం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. హింసాకాండలో ఇప్పటివరకు 80 మందికి పైగా మృతి చెందగా వేలాది కుటుంబాలు నిరాశ్రయులుగా మారాయి. ఇదిలా ఉండగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ మంగళవారం పుణెలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మణిపూర్‌లో సమస్యలు పూర్తిగా సమసి పోలేదని, దీనికి కొంత సమయం పడుతుందన్నారు. అంతా సర్దుకుంటుందని సిఎపిఎఫ్ ఇతర బలగాల సాయంతో అక్కడి ప్రభుత్వం దీన్ని సాధించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

సిఆర్‌పిఎఫ్ ఐజిని మణిపూర్‌కు పంపిన కేంద్రం
ఇదిలా ఉండగా ప్రస్తుతం సిఆర్‌పిఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా పని చేస్తున్న సీనియర్ ఐపిఎస్ అధికారి రాజీవ్ సింగ్‌ను కేంద్రం మణిపూర్‌కు పంపించింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని చక్కదిద్దడం కోసం కీలక పదవిలో ఆయనను నియమించవచ్చని తెలుస్తోంది. త్రిపుర కేడర్ ఐఎఎస్ అధికారి అయిన సింగ్‌ను మూడేళ్ల పాటు అంతర్గత కేడర్ డిప్యుటేషన్‌పై మణిపూర్‌కు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. తక్షణమే తన బాధ్యతలను చేపట్టేందుకు వీలుగా సింగ్‌ను తన బాధ్యతలనుంచి రిలీవ్ చేయాలని కేంద్ర హోం శాఖ సిఆర్‌పిఎఫ్‌ను ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News