Sunday, December 22, 2024

ఈ నెల 28న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరీంనగర్ పర్యటన

- Advertisement -
- Advertisement -

వేలాది మంది కార్యకర్తలతో జరిగే సమ్మేళనానికి హాజరు
బిజెపిని గెలిపిస్తే తెలంగాణకు కేంద్రం అదనపు నిధులు: బండి సంజయ్

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 28న కరీంనగర్ పర్యటించి, బిజెపి నిర్వహించే క్లస్టర్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైతారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. దీంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని క్రియాశీల కార్యకర్తలతో నిర్వహించే సమ్మేళనంలో పాల్గొని ప్రసంగిస్తారని, ఈ సమ్మేళనంలో ఒక్కో పోలింగ్ బూత్ పరిధిలోని 20 మంది కార్యకర్తల చొప్పున పార్లమెంట్ పరిధిలో దాదాపు 40 వేల మంది కార్యకర్తలు పాల్గొనున్నట్లు చెప్పారు. గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని లహరి ఫంక్షన్ హాలులో జరిగిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశానికి హాజరైన అమిత్‌షా పర్యటలన వివరాలు ప్రకటించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని గెలిపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, కేంద్రంలో మళ్లీ వచ్చేది మోడీ సర్కారేననే ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యధిక మంది ఎంపీలు గెలిస్తేనే తెలంగాణకు అదనపు నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే మోడీతోనే సాధ్యమనే భావన కాంగ్రెస్, బిఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉందన్నారు. తాను ఎంపీగా గెలిపించిన తరువాత చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన తరువాత ఏనాడూ ఖాళీగా కూర్చోలేదని, బిజెపి కార్యకర్తలు తలెత్తుకుని కాషాయ జెండా పట్టుకుని తిరిగేలా పోరాటాలు చేశానన్నారు.

కరీంనగర్ జిల్లాకు బండి సంజయ్, మోదీ చేసిందేమిటని కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నేతలు పసలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎంపీగా గెలిచాక దాదాపు రూ. 10 వేల కోట్ల నిధులు తెచ్చి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్దికి పాటుపడ్డానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏ గ్రామానికి ఎన్ని నిధులు ఇచ్చిందనే పూర్తి వివరాలను వెల్లడించడంతోపాటు అతి త్వరలో గ్రామ గ్రామాన ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేసి కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నేతల నోళ్లు మూయిస్తానని చెప్పారు. ఈకార్యక్రమంలో సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల అధ్యక్షులు ప్రతాప రామక్రిష్ణ, గంగాడి క్రిష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బొమ్మ జయశ్రీ, అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి, రాష్ట్ర నాయకులు మీసాల చంద్రయ్య, క్రిష్ణారెడ్డి, చెన్నమనేని వికాస్ రావు, ఆరెపల్లి మోహన్, బాస సత్యనారాయణ, బోయినిపల్లి ప్రవీణ్ రావు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News