ఆలేర్ పోలీస్ సిబ్బందికి సన్మానం
ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ప్రకటించిన కేంద్రహోం శాఖ
సర్టిఫికేట్లను అందజేసిన రాచకొండ సిపి మహేష్ భగవత్
హైదరాబాద్ : అవార్డు పొందిన పోలీసులు మరింత కష్టపడి పనిచేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఆలేరును ఎంపిక చేయడంతో సిబ్బందికి నేరెడ్‌మెట్‌లోని తన కార్యాలయంలో శుక్రవారం సన్మానం చేశారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఏడాది పోలీస్ స్టేషన్ ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఎంపికవుతోందని అన్నారు. పోలీసులు ప్రజలకు మంచి సేవలు అందివ్వడం వల్లే అవార్డుకు ఎంపిక అవుతున్నారని తెలిపారు. పోలీసులు నిరంతరం కష్టపడి పనిచేయడం వల్లే రాష్ట్రంలో క్రైం రేటు తగ్గిందని తెలిపారు.
కేంద్ర హోం శాఖ నియమించిన కమిటీ అక్టోబర్ 2, 2021న ఆలేరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించిందని, పోలీసుల పనితీరు, ప్రజల నుంచి అభిప్రాయం తీసుకుందని తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో మౌలిక సదుపాయాలు అన్ని ఉండడంతో ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఎంపిక చేశారని తెలిపారు. దేశంలో ఎంపిక చేసిన 75 ఉత్తమ పోలీస్ స్టేషన్లలో తెలంగాణలో 5 ఉన్నాయని తెలిపారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర హోం సెక్రటరీ అజయ్‌కుమార్ భల్లా సంతకం చేసి పంపించిన సర్టిఫికేట్‌ను ఆలేరు ఎస్సైకి అందజేశారు. గతంలో నారాయణపూర్ పోలీస్ స్టేషన్ గతంలో 13వ ర్యాంక్ పొందిందని తెలిపారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది కష్టపడి పనిచేసి అవార్డును నిలుపుకోవాలని అన్నారు. కార్యక్రమంలో డిసిపి యాదగిరి, ఎసిపి సిసిఆర్‌బి జగదీష్ చందర్, పోలీసులు పాల్గొన్నారు.