రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ లేఖ
న్యూఢిల్లీ: హిల్ స్టేషన్లతోసహా దేశంలోని అనేక ప్రాంతాలలో యథేచ్ఛగా కొవిడ్-19 నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని, మార్గదర్శకాల ప్రకారం ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర హోం శాఖ బుధవారం ఆదేశించింది. ప్రజా రవాణతోపాటు మార్కెట్ ప్రదేశాలలో సామాజిక దూరాన్ని పాటించకుండా ప్రజలు గుంపులుగా తిరుగుతున్నారని, కొవిడ్-19 నిబంధనలను పూర్తిగా విస్మరిస్తున్నారని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన ఒక లేఖలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని, నిర్లక్ష్యానికి తావివ్వకుండా కొవిడ్ నిబంధనలను కచ్ఛితంగా అందరూ పాటించాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. యాక్టివ్ కేసులు తగ్గుముఖం పడుతుండడంతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ ఆర్థిక కార్యకలాపాలకు తలుపులు తీయడం ప్రారంభించాయని, అయితే ఆంక్షల సడలింపు ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా అమలుచేయవలసి ఉందని భల్లా తెలిపారు.