Monday, December 23, 2024

విభజన సమస్యలకు తెరపడేనా?

- Advertisement -
- Advertisement -

 

23న మరో భేటీకి కేంద్ర హోం శాఖ సన్నద్ధం

కేంద్ర ప్రభుత్వం తాను రూపొందించిన చట్టాన్ని తానే తుంగలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని రూపొందించిన కేంద్రం దాన్ని
గౌరవించడం లేదు. రాష్ట్రాల విభజన జరిగిన ఎనిమిదేళ్ల తర్వాత చట్టంలో సవరణలు చేయడం అర్ధరహితం. ఇలా చేస్తే ఆ చట్టానికి హేతుబద్ధత ఉండదు. కేంద్ర ప్రభుత్వ తీరు ఇలా ఉంది గనుకనే హోం చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోంది. గతంలో మాదిరిగానే ఈ సమావేశం కూడా మొక్కుబడిగా సాగుతుందా? లేక ఏ ఒక్క సమస్యనైనా పరిష్కరిస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మన తెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం హామీలిచ్చి ఏడేళ్ళ సమయం పూర్తయింది. సంవత్సరాల తరబడి కాలయాపన చేసిన కేంద్ర ప్రభుత్వం ఈనెల 23వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశమై విభజన సమస్యలను పరిష్కరిస్తామని, తప్పకుండా సంసిద్ధంగా ఉండాలని కోరుతూ ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ లేఖలు రాసింది. తెలుగు రాష్ట్రాలు లేవనెత్తిన సమస్యలు, డిమాండ్లలో ఎవరి వాదనల్లో న్యాయం ఉంది, ఏ రాష్ట్రం వారు న్యాయానికి, ధర్మానికి విరుద్ధంగా వాదనలను వినిపిస్తున్నారనే అంశాలపై కేంద్ర హోం మంత్రిత్వశాఖలోని ఏ ఒక్క అధికారికి కూడా స్పష్టత లేకపోవడం, కొద్ది గా అవగాహన వచ్చిన ఉన్నతాధికారులను బదిలీ లు చేయడం, కొత్త వారు వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలను పరిష్కరించేందుకు పూనుకునే సరికి కనీసం రెండేళ్ళ సమయం పడుతుండటం వంటి ఆచరణాత్మకమైన సమస్యలతో అంతులేని జాప్యం జరుగుతోందనే విమర్శలున్నాయి. అయితే ఈసారి కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న అజయ్‌కుమార్ భల్లా అధ్యక్షతన ఈ నెల 23వ తేదీన జరుగనున్న సమావేశం రెండవది కావడంతో కొద్దిగానైనా ఆయనకు అవగాహన వచ్చి ఉంటుందని అనుకుంటున్నారు. ఇకనైనా న్యాయమైన తెలంగాణ రాష్ట్ర వాదనలకు ఆమోదముద్ర వేస్తారా? లేక తెలంగాణ ప్రజలకు రొటీన్‌గా అన్యాయం చేస్తారన్నది కొందరు సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 9వ షెడ్యూలులోని 91 సంస్థల విభజన విషయంలో డాక్టర్ షీలాభిడే నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫారసులను కూడా అమలు చేయించడంలో కేంద్రం విఫలమైందని పరిష్కారానికి నియమించిన సబ్- మూడు దశల్లో ఈ సంస్థలను విభజించాలని సిఫారసు చేసిందని, అందులో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే అంశాలున్నాయని తెలంగాణ అధికారులు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఎపి ప్రభుత్వం మాత్రం షీలాభిడే సిఫారసులను యధావిధిగా ఆమోదించిందని, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే అంశాలన్నీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని, ఆ కేసులు తేలాల్సి ఉందని, మరి ఈ సమస్యను ఈనెల 23న జరగబోయే సమావేశంలో ఎలా పరిష్కరిస్తారోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం కోర్టులో ఉంది గనుక తీర్పు వచ్చే వరకూ తుది నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేసే అవకాశాలున్నాయని కూడా ఆ అధికారులు వివరించారు. అంతేగాక డెక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డిఐఎల్‌ఎల్-దిల్), ఎపి డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ల వివాదాల పరిష్కారంపై తెలంగాణ ఇచ్చిన విన్నపాలను గత సమావేశంలో కేంద్ర న్యాయశాఖ పరిశీలనకు పంపించారని, ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరిస్తూ అజయ్ భల్లా ఏమైనా నిర్ణయం తీసుకొంటారా? లేక మళ్లీ వాయిదా వేస్తారా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఎపి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వివాదంపైనా చర్చ జరుగుతుందని తెలిపారు. ఇక అత్యంత కీలకమైన 10వ షెడ్యూలులోని 142 ఇన్‌స్టిట్యూషన్ల విషయంలో కూడా ఎలాంటి ముందడుగు పడలేదని, తెలుగు అకాడెమీ విషయంలో కోర్టులో కేసులు నడుస్తున్నాయని, ఈ సంస్థల విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను భంగం కలిగించేవిగా ఉన్నాయని, గత సమావేశంలోనూ తాము వ్యతిరేకించామని, ఈ సారైనా కేంద్రం పరిష్కరిస్తుందా? తెలంగాణకు న్యాయం జరుగుతుందా? అనేది తేలాల్సి ఉందన్నారు. ఇక సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్), ఎపి హెవీ మెషినరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ (ఎపిహెచ్‌ఎంఇఎల్)లు పూర్తిగా తెలంగాణకు చెందిన ఆస్తులని, ఇందులో విభజన అనంతర ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సంబంధంలేదని, ఎపిహెచెంఇఎల్ సంస్థ కేవలం సింగరేణికి అనుబంధ సంస్థ మాత్రమేనని, అందుకే సింగరేణిలో వాటాలు కోరుతున్న ఎపి ప్రభుత్వ ప్రయత్నాలను తెలంగాణ పూర్తిగా వ్యతిరేకిస్తోందని, ఇదే అంశాన్ని గత సమావేశంలో కూడా చాలా స్పష్టంగా, మరింత కఠినంగా తెగేసి చెప్పామని వివరించారు. ఈసారి సమావేశంలో కూడా అంతే తీవ్రతతో ప్రతిపాదనలను వ్యతిరేకిస్తామని అధికారులు గట్టిగా చెబుతున్నారు. సింగరేణి కాలరీస్‌ను కాపాడుకోవడానికి ఎంతదాకైనా వెళతామని, ఇందులో రాజీపడే ప్రసక్తేలేదని, వీసమెత్తు అయినా సింగరేణి గనుల్లో ఎపికి వాటాలు ఇచ్చే ప్రసక్తేలేదని వివరించారు. ఇక సివిల్ సప్లయీస్ కార్పోరేషన్‌కు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇచ్చిన నిధుల్లో వివాదాస్పదమైన 354 కోట్ల రూపాయల సబ్సిడీలో తెలంగాణ రాష్ట్ర వాటా తేలే వరకూ ఆ నిధులను విడుదల చేసేదిలేదని ఆ అధికారులు పునరుద్ఘాటించారు. అంతేగాక విభజన చట్టంలో ప్రస్తావన లేనటువంటి 12 ఇన్‌స్టిట్యూట్‌లను విభజించడానికి ఎపి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు తాము గండికొట్టామని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఉన్న ఎపి ప్రభుత్వ ప్రయత్నాలను తప్పకుండా మళ్లీ అడ్డుకుంటామని చెబుతున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు, బ్యాంక్ బ్యాలెన్స్‌లపైన కూడా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సలహాలు తీసుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు గత సమావేశంలోనే అంగీకారం తెలిపామని, మళ్లీ అదే విషయానికి కట్టుబడి ఉంటామని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి న్యాయంగా రావాల్సిన నిధులను విడుదల చేయించాలని అధికారులను కోరామని, అందుకు అజయ్ భల్లా గత సమావేశంలోనే ఆర్థికశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారని, కానీ ఇప్పటి వరకూ కేంద్ర ఆర్ధిక శాఖ నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని, ఆ విషయాన్ని ఈ సమావేశంలో తప్పకుండా లేవనెత్తుతామని తెలిపారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని విభజన చట్టంలోనే ఉన్న అంశాన్ని మళ్లీ చేస్తామని చెప్పారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తెలంగాణలో ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉన్న అంశాన్ని గుర్తు చేయడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వమే తాను రూపొందించిన చట్టాన్ని తానే తుంగలోతొక్కుతోందని, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని రూపొందించిన కేంద్రం ఆ చట్టాన్ని గౌరవించడం లేదని చెబుతూ నిరసన వ్యక్తం చేయనున్నామని తెలిపారు. విభజన చట్టంలోని సెక్షన్ 50, 51, 56లను సవరణలను చేయాలనే ఎపి ప్రభుత్వ ప్రయత్నాలను మళ్లీ వ్యతిరేకిస్తామని చెబుతున్నారు. రాష్ట్రాల విభజన జరిగిన ఎనిమిదేళ్ల తర్వాత చట్టంలో సవరణలు చేయడం అర్థరహితమని, ఇలా చేస్తే ఆ చట్టానికి హేతుబద్ధత ఉండదని ఆ అధికారులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరు ఇలా ఉంది గనుకనే హోం చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోందని, గతంలో మాదిరిగానే ఈ సమావేశం కూడా మొక్కుబడిగా సాగుతుందా? లేక ఏ ఒక్క సమస్యనైనా పరిష్కరిస్తారా? అనే అనుమానాలను ఆ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

Union Home Ministry to meet telugu states Officials on Nov 23

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News