Wednesday, January 22, 2025

ముంపుపై అధ్యయనం చేయాల్సిందే

- Advertisement -
- Advertisement -

Union Jal Shakti Ministry holds key meeting on Polavaram

పోలవరం ముంపుపై అధ్యయనం జరిపితీరాల్సిందే
వరదల్లో నష్టపోయిన వారికే ఆ కష్టాలు తెలుస్తాయి
నష్ట నివారణ చర్యలు తక్షణం చేపట్టాలి
ఢిల్లీ భేటిలో కేంద్రం ముందు తెలంగాణ ఏకరువు
తెలంగాణ బాటలోనే ఒడిశా చత్తీస్‌గఢ్
ప్రాజెక్టుకు అనుమతులపై ఘాటు ప్రశ్నలు
బ్యాక్ వాటర్ ముంపు లేదని తోసిపుచ్చిన కేంద్రం
వచ్చేనెల 7న మరోసారి చర్చకు జల్‌శక్తిశాఖ నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్: ఏపిలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల గోదావరి బ్యాక్ వాటర్ ప్రభావంపై థర్డ్ పార్టీతో అధ్యయనం జరిపితీరాల్సిందే అని తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గురువారం పోలవరం బ్యాక్‌వాటర్ ముంపు సమస్యలపై కేంద్ర జల్ శక్తిశాఖ అధ్వర్యంలో కేంద్ర జల్‌శక్తిశాఖ అధికారులతోపాటు భాగస్వామ్య రాష్ట్రాల ప్రతినిధుల సమావేశం జరిగింది. తెలంగాణతోపాటు ఒడిశా, చత్తిస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఉన్నతాధికారులు ఈ సమవేశంలో పాల్గొన్నారు.గోదావరి వరదలు, పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల పెరుగుతున్న ముంపు సమస్యలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి నదికి ఇరువైపులా మునుగుతున్న గ్రామాలు, వ్యవసాయంతోపాటు ఇతర అనుబంధ రంగాలకు జరుగుతున్న నష్టాలు తదితర సమస్యలను నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ సమావేశంలో వివరించారు. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపైన స్వంతంత్ర సంస్థతో శాస్త్రీయంగా సమగ్ర అధ్యయనం జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇటీవల కురిసిన భారీవర్షాలకు, పోలవరం బ్యాక్ వాటర్ పోటువల్ల తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదీతీర ప్రాంతాల్లో వరదల తీవ్రత, వివిధ రంగాలకు జరిగిన నష్టాలను గణాంకాలతో సహా వివరించారు. చారిత్రాత్మక భద్రాచలం పట్టణంతోపాటు పవర్ ప్లాంట్ల ముంపు దృశ్యాలకు సంబంధించిన ఫోటోలను సమావేశం ముందు పెట్టారు. పోలవరం కాఫర్‌డ్యాం వల్లనే ఇంతటి నష్టాలు జరిగితే ఇక ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక బ్యాక్ వాటర్ తీవ్రత మరెంతగా ఉంటుందో గమనించి భవిష్యత్‌లో రానన్ను కష్ట నష్టాలను ఒక సారి అంచనా వేయాలని కోరారు.జాతీయ ప్రాజెక్టుగా చేపట్టిన పోలవరం నిర్మాణం పట్ల భాగస్వామ్య రాష్ట్రాల అభ్యంతరాలను పరిశీలించి సందేహాలు నివృత్తి చేయకుండా ముందుకెళ్లటం కేంద్రానికి తగదని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాదనలతో చత్తిస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు ఏకీభవించాయి. తమ రాష్ట్రాల్లో కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల జరిగే నష్టాలపై తాజాగా అధ్యయనం జరపాలని ఆ రాష్ట్రాల అధికారులు కేంద జల్‌శక్తి శాఖను డిమాండ్ చేశారు. యుద్ద ప్రాతిపదికన వరద నష్టాల నివారణకు రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. నదికి ఇరువైపులా రక్షణ పనులకు అయ్యే వ్యయాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీనే భరించాలని కోరారు. గోదావరి నదికి క్రాస్ సెకక్షన్స్ పైనా అధ్యయనం చేయాలని కోరారు. పబ్లిక్‌హియరింగ్ జరిపి ప్రజాభిప్రయాలను తెలుసుకోకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎలా అనుమతులు ఇస్తారని ఒడిశా అధికారులు ఘాటుగానే ప్రశ్నిస్తూ కేంద్రాన్ని నిలదీశారు. నదికి ఇరువైపులా 30కిలోమీటర్ల నిడివిన 15మీటర్ల ఎత్తుతో రక్షణ గోడల నిర్మాణం ఏవిధంగా సాధ్యపడుతుందో తెలపాలన్నారు. అంత భూమి ఎలా సేకరిస్తారని ప్రశ్నించారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు పరిశీలన చేయాలన్నారు.
బ్యాక్ వాటర్ ముంపులేదు.. కేంద్రం అభయం:
పోలవరం ప్రాజెక్టు వల్ల బ్యాక్ వాటర్ ముంపు భయం ఏమాత్రం వద్దని కేంద్ర జల్‌శక్తి శాఖ అధికారులు వివరించే ప్రయత్నం చేశారు. 2009లో, 2011లో ముంపు సమస్యలపైన సమగ్ర సర్వేలు నిర్విహించినందున మళ్లీ సంయుక్త సర్వే అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర అభ్యంతరాలను త్రోసిపుచ్చే ప్రయత్నం చేవారు. దీనిపై తెలంగాణ, చత్తిస్‌గఢ్ రాష్ట్రాలు అభ్యంతరాలు తెలిపాయి. రాష్ట్ర వాదనలు విన్న కేంద్ర జల్‌శక్తి శాఖ అధికారులు స్పందిస్తూ మరో సారి అన్ని అంశాలు చర్చిద్దామని తెలిపారు. అక్టోబర్ 7న మరో సారి సమావేశం నిర్వహిస్తామని ప్రకటించి సమావేశాన్ని అసంపూర్తిగా ముగించారు.

Union Jal Shakti Ministry holds key meeting on Polavaram

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News