సుప్రీంకోర్టుపై న్యాయమంత్రి స్పందన
పరస్పర గౌరవాలు అవసరం
కట్టుబాట్లను కాదంటే కుదరదు
న్యూఢిల్లీ : దేనికైనా లక్ష్మణరేఖ ఉంటుందని, దీనిని ఎవరూ అతిక్రమించరాదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజూ వ్యాఖ్యానించారు. తరాల నాటి దేశద్రోహం చట్టంపై తాత్కాలిక స్టేను సుప్రీంకోర్టు వెలువరించిన నేపథ్యంలో దీనిపై మంత్రి బుధవారం ఘాటుగానే స్పందించారు. న్యాయస్థానాలను వాటి స్వేచ్ఛా స్వాతంత్రాలను తాము గౌరవిస్తామని , అయితే లక్ష్మణ రేఖ దాటడం కుదరదని తెలిపారు. న్యాయస్థానాల వరకూ వెళ్లిన ఈ చట్టంపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని తెలియచేసింది. ప్రధాని నరేంద్ర మోడీకి దీనిపై ఉన్న ఉద్ధేశాన్ని అఫిడవిట్‌లో నివేదించాం. ఇప్పుడు కోర్టు తీర్పు వెలువడింది. దీనిని తాము మన్నిస్తామని న్యాయ శాఖ మంత్రి తెలిపారు. వ్యవస్థలోని అన్ని విభాగాలు తమకు నిర్ధేశించిన అధికారాల పరిధిలోనే వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఖచ్చితంగా పరిమితిని పాటించాల్సి ఉంటుంది. ఇది పూర్తిస్థాయి చిత్తశుద్ధితో అమలు కావాల్సి ఉంటుంది. ఏ చట్టానికి సంబంధించి అయినా ఏ వ్యవస్థ అయినా భారతదేశ రాజ్యాంగంలోని అధికరణలు, నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి.
ఇదే క్రమంలో ఇప్పుడున్న చట్టాలను గౌరవించాలని న్యాయశాఖ మంత్రి విలేకరుల సమావేశంలో తెలిపారు. పరస్పర గౌరవం అవసరం. కోర్టులు ప్రభుత్వాన్ని, లెజిస్లేచర్‌ను ఆదరించాలి. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా న్యాయస్థానాలను గౌరవిస్తుంది. ఇదంతా పరస్పర గౌరవ వినిమయంగా ఉంటుంది. ఉండాలని రిజిజూ స్పష్టం చేశారు. పలు అధికారాలపై విధులు బాధ్యతలపై సరైన రీతిలో నిర్థిష్ట విభజన రేఖలు ఉన్నాయని , ఈ కట్టుబాట్లకు అనుగుణంగా అంతా వ్యవహరించాల్సి ఉందని న్యాయశాఖ మంత్రి తెలిపారు. ఆ చట్టంపై సుప్రీంకోర్టు నిర్ణయం తప్పని అనుకుంటున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా దీనికి న్యాయశాఖ మంత్రి నేరుగా జవాబివ్వలేదు.