ప్రధానమంత్రి మోదీది ఏ కులం? రాహుల్ గాంధీది ఏ మతం అనే అంశాలపై చర్చకు తాము సిద్ధమని, ఇదే అంశాన్ని రెఫరెండంగా భావిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి వెళదామా? అంటూ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. కుల గణన తప్పుల తడక, బీసీ జాబితాలో ముస్లింలను కలపడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొందని విమర్శించారు. ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకు ప్రధాని కులంపై సీఎం రేవంత్ రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో శనివారం టూరిజం ప్లాజాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ రిజర్వేషన్లు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమన్న బండి సంజయ్ ముస్లింలను బీసీ జాబితాలో చేర్చి కేంద్రానికి పంపితే ఆమోదించే ప్రసక్తే లేదని అన్నారు. ఈ విషయం తెలిసి కూడా కాంగ్రెస్ డ్రామాలాడుతోందని ధ్వజమెత్తారు. ప్రజలకు, బీసీ సంఘాలకు ఈ విషయం తెలుసునని వ్యాఖ్యానించారు. పది శాతం ఉన్న ముస్లింలను బీసీల్లో కలిపితే కేంద్రం ఒప్పుకోదని అన్నారు. బీసీలను 51 శాతం నుంచి 46 శాతానికి తగ్గించారని ఆయన మండిపడ్డారు. ముస్లింలకు కాంగ్రెస్ ప్రభుత్వమే మద్దతు ఇస్తోందని ఆరోపించారు. హిందువుల జనాభా తగ్గించి ముస్లిం జనాభా పెంచి చూపిస్తున్నారని బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
సిఎం హోదాలో రేవంత్ ప్రధానిపై అవాకులు, చవాకులు సరికాదు
మనిషి పుట్టిన వెంటనే కులం పేరు పెడతామా? రేవంత్ రెడ్డికి అట్లనే చేశారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ప్రధానిపై మాట్లాడేటప్పుడు అవాకులు, చవాకులు మాట్లాడతారా? అని చెబుతూ ఈ విషయాన్ని రేవంత్ విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు. మోదీ ముమ్మాటికీ బీసీనేనని బండి సంజయ్ పేర్కొన్నారు. 1994లోనే గుజరాత్‌లోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే మోదీ కులాన్ని బీసీ జాబితాలో చేర్చిందని గుర్తు చేశారు. ఈ దేశంలోని వెనుకబడిన వర్గాలు, అగ్రవర్ణ పేదలు, దళిత జాతి మొత్తం మోదీ తొలిసారి ప్రధానమంత్రి కాగానే సంబురాలు చేసుకున్నారని అన్నారు. మోదీ సైతం తన తొలి కేబినెట్‌లో 27 మంది బీసీలను మంత్రులుగా చేశారని అన్నారు. అలాగే 12 మంది దళితులను, 8 మంది ఎస్టీలను మంత్రులుగా చేశారని వివరించారు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇద్దరు మాత్రమే బిసిలు ఉన్నారని అన్నారు. కుల గుణన సర్వేలో 46 శాతం మంది బీసీలున్నట్లు మీ ప్రభుత్వం లెక్క తేల్చిందని, అంతకుముందు కేసీఆర్ హయాంలో సర్వే చేస్తే 51 శాతం బీసీలున్నట్లు తేల్చారని చెప్పారు.
ఈ లెక్కన మీ ప్రభుత్వంలో ఎంత మంది మంత్రులుండాలి? మరి మీరు ఎంత మందికి అవకాశం కల్పించారు? అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. అసలు మోదీ కులం గురించి చర్చించాల్సిన అవసరం ఏముంది? ఆ విషయానికొస్తే రాహుల్ గాంధీ కులం, మతం, జాతి గురించి చర్చ చేయాలని అన్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ తాత ఫిరోజ్ ఖాన్, ఆయన తల్లి సోనియాగాంధీ క్రిస్టియన్ అని అన్నారు. ఆమె ఇటలీ దేశస్తురాలైనప్పుడు మరి రాహుల్ ఏ కులమని ప్రోత్సహిస్తున్నారని నిలదీశారు. రాహుల్ కు ఒక కులం లేదు, మతం లేదు, జాతి లేదు. మరి అటువంటి చర్చ చేయాలంటే టెన్ జన్ ఫథ్ నుండే రాహుల్ కులం, మతం గురించి చర్చ చేయాల్సి ఉంటుందని అన్నారు. రాజాసింగ్ హిందూ ధర్మం కోసం పోరాడే నాయకుడని పేర్కొన్నారు. ఆయన ధర్మ పోరాటంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఆయన ఎప్పుడూ మా పార్టీ వారేనని చెబుతూ రాజాసింగ్‌కు అభ్యంతరాలుంటే అంతర్గతంగా మాట్లాడాలి తప్ప మీడియాకు ఎక్కడం సరికాదని హితవు పలికారు.