వారణాసి: దేశంలో పెట్రోలు ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని కేంద్ర చమురు వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఆదివారం తెలిపారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు గత నష్టాల నుంచి తేరుకున్న వెంటనే పెట్రోలు ధరలు తగ్గుముఖం పడుతాయని వారణాసిలో ఓ సభలో మాట్లాడుతూ పూరీ చెప్పారు. కరోనా దశలో అంతర్జాతీయ స్థాయిలో ముడిచమురు ధరలు పెరగడం, తరువాతి లాక్‌డౌన్లలో సరఫరా వ్యవస్థకు గండిపడటం, ఆర్థిక సంక్షోభాలు ఉన్నప్పటికీ చమురు సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం సంస్థ, హిందూస్థాన్ పెట్రోలియం లిమిటెడ్‌లు గత 15 నెలల నుంచి పెట్రోలు డీజిల్ ధరలను సవరించలేదని మంత్రి చెప్పారు.
దీనితో పలు చమురు సంస్థలకు తీవ్రనష్టాలు వచ్చాయని, ఇవి తిరిగి క్రూడాయిల్ ధరల తగ్గుముఖంతో గాడిలో పడుతున్నాయని వివరించారు. ఈ నష్టాలు బాట నుంచి ఒక్కసారి బయటపడితే సహజంగానే పెట్రోలు, డీజిల్ ధరలు మరింతగా తగ్గుతాయని, వినియోగదారుడికి సరైన విధంగా మేలు జరుగుతుందని తెలిపారు. ధరలను పెంచరాదని ప్రభుత్వం కోరలేదని, అయితే పలు సమస్యలు ఎదుర్కొంటూనే ఇంతకాలం చమురు సంస్థలు సొంతంగానే ధరల పెరుగుదలకు దిగలేదని మంత్రి తెలిపారు. క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం దశలో మరింతగా నష్టాలు అధిగమించుకుని చమురు సంస్థలు వినియోగదారుడిపై భారం తగ్గిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.