బెగుసరాయ్(బీహార్): దేశంలో 1950 నుంచి ముస్లిం జనాభా పెరగడానికి కాంగ్రెస్ అవలంబించిన బుజ్జగింపు రాజకీయాలే కారణమని కేంద్ర మంత్రి, బిజెపి నాయకుడు గిరిరాజ్ సింగ్ గురువారం ఆరోపించారు. 1971 తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బంగ్లాదేశీ అక్రమ వలసదారులు, రోహింగ్యాలకు దేశంలో ప్రత్యేకంగా బీహార్‌లో ఆశ్రయం ఇచ్చిందని గురువారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఆరోపించారు.
ప్రధానికి చెందిన ఆర్థిక సలహా మండలి(ఇఎసి-పిఎం) నివేదికపై స్పందన కోరినపుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 1947లో దేశ జనాభాలో 88 శాతం హిందువులు ఉన్నారని, ఇప్పుడు అది 70 శాతానికి పడిపోయిందని గిరిరాజ్ తెలిపారు. మరోపక్క 1947లో 7 శాతం ఉన్న ముస్లిం జనాభా ఇప్పుడు దాదాపు 20 శాతానికి పెరిగిందని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాల వల్లే ఇదంతా జరిగిందని ఆయన ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలపై కూడా ఆయన మండిపడ్డారు. బీహార్‌లోని బెగుసరాయ్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గిరిరాజ్ సింగ్ ప్రస్తుత ఎన్నికలలో అదే స్థానంలో మహాగట్బంధన్‌లో భాగస్వామ్య పక్షమైన సిపిఐ అభ్యర్థి అవధేష్ రాయ్‌ను ఎదుర్కొంటున్నారు. మే 13న ఈ స్థానానికి ఎన్నిక జగరనున్నది.