ముంబై: కేంద్ర యువజన వ్యవహారాల సహాయ మంత్రి రక్షా ఖడ్సే జల్‌గావ్ జిల్లాలోని ముక్తాయ్‌నగర్‌లో శివరాత్రి సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో కొందరు పోకిరీ యువకులు తన కుమార్తెను వేధించారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఆమె ఆదివారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు చేసేప్పుడు ఆమె వెంట చాలామంది పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు ఆమె వెంట ఉన్నారు. ‘మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం కొథాలీలో సంత్ ముక్తాయ్ యాత్ర నిర్వహిస్తుంటారు. మొన్న నా కూతురు స్నేహితులతో కలిసి ఆ యాత్రకు వెళ్తానని కోరడంతో సెక్యూరిటీ సాయంతో అక్కడక పంపించాను. ఈ సందర్భంగా ఆమెను కొందరు పోకిరీ యువకులు వెంబడించి వేధించారు.
అడ్డుకున్న భద్రతా సిబ్బందిపైనా దురుసుగా ప్రవర్తించారు. గుజరాత్ పర్యటన నుంచి రాగానే నా కూతురు ఈ విషయం చెప్పింది. ఓ ఎంపీ లేదా కేంద్ర మంత్రి కుమార్తెకే ఈ దుస్థితి అంటే…సాధారణ మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. నేను న్యాయం కోసం ఓ తల్లిగానే పోలీస్ స్టేషనుకు వచ్చాను. ఎంపీగానో, కేంద్ర మంత్రిగానో కాదు’ అని పోలీస్ స్టేషన్ బయట ఆమె విలేకరులకు తెలిపారు.
రక్షా ఖడ్సే మామ, మాజీ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే ఇదే అంశంపై మాట్లాడుతూ ‘ ఈ పోకిరీ యువకులపై గతంలోనూ పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
వారు కరుడుగట్టిన నేరస్థులు. మహారాష్ట్రలో మహిళలపై నేరాలు ఘోరాలు పెరుగుతున్నాయి. నేరస్థులు పోలీసులకు భయపడ్డం లేదు. బాధిత యువతులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు. వారి తల్లిదండ్రులు కూడా తమ కుమార్తెల పేర్లు బయటకు రాకూడదని భావిస్తున్నారు. మాకు ప్రత్యామ్నాయం లేకనే ఫిర్యాదు చేశాము’ అన్నారు. ‘పోలీస్ స్టేషన్‌కు వెళితే రెండు గంటలు మమ్మల్ని కూర్చోబెట్టారు. అమ్మాయి విషయం కావడంతో పునరాలోచించుకోమని పోలీసులు కోరారు. ఆ పోకిరి యువకులు పోలీసులపైనా దాడి చేసిన సందర్భాలున్నాయి.
వాళ్లు ఎంతకు తెగిస్తారో ఊహించుకోవచ్చు. వాళ్లకు రాజకీయ నాయకుల అండ పుష్కలంగా ఉంది. ఈ విషయాన్ని డిఎస్పీ, ఐజితోనూ మాట్లాడాను’ అని రక్షా ఖడ్సే తెలిపారు. ముక్తాయ్‌నగర్ డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ కుషానత్ పింగ్డే మాట్లాడుతూ నిందితులు అనేక మంది యువతులతో అల్లరిచిల్లరగానే వ్యవహరిస్తున్నారు. అంతేకాక ఆ అమ్మాయిల బాడీగార్డ్‌లు కలుగజేసుకుంటే వారితోనూ పెట్టుకుంటున్నారు. ఈ కేసులోని ఏడుగురి నిందితుల పేర్లను ఆయన వివరించారు. వారిలో ఒకరిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో రాజకీయ వొత్తిడి ఏదీ లేదన్నారు. ఈ కేసులో నిందితులపై అత్యాచారం, పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
యువతుల వీడియోలు తీసినందుకు వారి మీద ఐటి చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
రక్షా ఖడ్సే మూడు సార్లు రావర్ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. మహారాష్ట్ర అంతటా మహిళలపై నేరాలు పెరిగిపోయాయని, నేరస్థులకు చట్టం అంటే భయంలేకుండా పోయిందని అన్నారు. ఇదిలావుండగా మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్ధన్ సప్కల్ ఈ ఘటనపై ప్రతిస్పందిస్తూ ‘ముఖ్యమంత్రి పదవి నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ దిగిపోవాలి. అంతేకాక దీనికంతటికీ బిజెపి నేతృత్వం వహిస్తున్న మహాయుతి సంకీర్ణమే కారణం. మహారాష్ట్రలో శాంతిభద్రతలు తీవ్రంగా దెబ్బతిన్నాయి’ అన్నారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ ‘నిందితులు ఓ పార్టీకి చెందిన కార్యకర్తలు. అందులో కొందర్ని పోలీసులు అరెస్టు చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మిగతావారిని కూడా త్వరలో పట్టుకుంటాం. ఎవరినీ వదిలిపెట్టేది లేదు’ అన్నారు. కాగా ఈ ఘటన పూణే అత్యాచారం కేసు నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది. గత మంగళవారం పూణే నగరంలో పార్కింగ్ చేసిన ఖాళీ వాహనంలో ఓ 26 ఏళ్ల మహిళ అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. విస్తృత గాలింపు తర్వాత నిందితుడు దత్తాత్రేయ రాందాస్ గడేను పొలంలో పట్టుకున్నారు. దానికంటే ముందు ఓ దోపిడి కేసులో కూడా అతడు అరెస్టయ్యాడు. కానీ 2019 నుంచి బెయిల్‌పై బయట ఉన్నాడు. అతడిపై అనేక దొంగతనం కేసులున్నాయి.