Saturday, January 11, 2025

కేరళ సిఎంకు లేఖ రాసిన కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

- Advertisement -
- Advertisement -

శబరిమలలో అయ్యప్ప భక్తులకు కనీస ఏర్పాట్లు చేయాలి

మన తెలంగాణ/హైదరాబాద్: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి క్షేత్రంలో కనీస ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.  భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు శనివారం లేఖ రాశారు. శబరిమలలో అయ్యప్పస్వాములకు కనీస సౌకర్యాలు కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి భక్తులు 40 రోజులపాటు చేసే ఆధ్యాత్మిక భావనతో కూడిన మండల దీక్ష తరువాత శబరిమలలో కొలువైన స్వామివారిని దర్శించుకోవడం హిందూ ధర్మంపట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.

ప్రతి ఏటా నవంబర్ నుంచి జనవరి మధ్యలో కోటిమందికిపైగా భక్తులు వివిధ రాష్ట్రాలనుంచి మండలదీక్షను పూర్తిచేసుకుని అయ్యప్పస్వామి దర్శనం కోసం కేరళ రాష్ట్రంలోని శబరిమలకు వస్తున్న విషయం మీకు తెలిసిందేనన్నారు. ప్రతి ఏటా శబరిమలకు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య 15 లక్షలకు పైగానే ఉంటారని తెలిపారు. ఈసారి శబరిమలలో అయ్యప్పస్వామి సన్నిధానంలో ఏర్పాట్లు సక్రమంగా లేకపోవడంతో భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు మీడియా ద్వారా తెలుస్తోందన్నారు. ఇటీవలే శబరిమల అయ్యప్ప సన్నిధానంలో దర్శనం సందర్భంగా కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో తొక్కిసలాటలో ఓ బాలిక చనిపోయిన విషయం తెలిసి చాలా బాధకలిగిందని లేఖలో తెలిపారు.

శబరిమలలో అయ్యప్ప స్వాములకు తీవ్ర అసౌకర్యం ఎదురవుతున్న సందర్భంలో ప్రభుత్వం తరపున తగిన సంఖ్యలో ఉద్యోగులను, ఇతర సిబ్బందిని శబరిమలలో మోహరించి భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పినరయి విజయన్ కోరారు. శబరిమలలో భక్తుల పాదయాత్ర మార్గాల్లో భోజనం, నీరు, వైద్యంతో సహా స్వాములకు అవసరమైన ఇతర ఏర్పాట్లను వెంటనే చేయాలని ప్రస్తావించారు. భక్తులకు ఏర్పాట్లు చేసే విషయంలో పంబానది పరిసరాలు, సన్నిధానం వరకు పాదయాత్ర, ట్రెక్కింగ్ జరిగే ప్రాంతాల్లో భక్తులకు సహాయం చేసే విషయంలో స్వచ్ఛంద సేవాసంస్థలను కూడా భాగస్వాములను చేసే దిశగా చొరవ తీసుకోవాలని కోరుతున్నాని పేర్కొన్నారు. భక్తులకు సౌకర్యాలు మీరు(పినరయి విజయన్) వీలైనంత త్వరగా ప్రత్యేక చొరవ తీసుకుంటారని, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగంని మోహరించి చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.

Letter

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News