సంజయ్ రౌత్‌కు కేంద్ర మంత్రి రాణె హెచ్చరిక
పుణె: అధికారిక హోదాను పక్కనపెట్టి తనను కలవాలని శివసేన(ఉద్ధవ్) ఎంపి సంజయ్ రౌత్ సవాలు విసిరిన నేపథ్యంలో కేంద్ర మంత్రి నారాయణ రాణె శనివారం స్పందిస్తూ తాను త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను కలసి రౌత్ తనతో సాగించిన రహస్య సంభాషణలను బట్టబయలు చేస్తానని వెల్లడించారు. తాను రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన తర్వాత రౌత్ తన వద్దకు వచ్చి తన పక్కన కూర్చునే వారని, ఆయన తనతో ఆయన సాగించిన రహస్య సంంభాషణలను ఉద్ధవ్‌కు, ఆయన భార్య రష్యకి తెలియచేశానంటూ వారే రౌత్‌ను చెప్పుతో కొడతారని రాణె శనివారం ముంబైలో విలేకరుల వద్ద వ్యాఖ్యానించారు.
శివసేనను అంతం చేయడానికి సంజయ్ రౌత్ సుపారీ పుచ్చుకున్నాడని కూడా రాణె ఆరోపించారు. 1969లో శివసేన ఆవిర్భావం నుంచి తాను పార్టీ పురోభివృద్ధికి పాటుపడ్డానని, కాని, పార్టీని అంతం చేయడానికి రౌత్ కంకణం కట్టుకున్నాడని ఆయన ఆరోపించారు. 56 మంది ఎమ్మెల్యేల నుంచి పార్టీని 12 మంది ఎమ్మెల్యేలకు రౌత్ దిగజార్జారని ఆయన అన్నారు. రౌత్‌ను ఎక్కడైనా కలవడానికి తాను సిద్ధమని ఆయన ప్రకటించారు. కేంద్ర మంత్రి తనకు భద్రత ఉంటుందని, తాను దేశమంతటా పర్యటించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
మళ్లీ జైలుకు వెళ్లడానికి రౌత్ మార్గం సిద్ధం చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. రాణె తనపై చేసిన ఆరోపణలపై సంజయ్ రౌత్ ఘాటుగా స్పందిస్తూ&రాణె ఆర్థిక లావాదేవీల గురించి తాను బట్టబయలు చేస్తే ఆయన 50 ఏళ్లు జైలుకు వెళతాడని అన్నారు. తన నోటికి పనిచెప్పవద్దని ఆయన రాణెను హెచ్చరించారు. తాను తన పార్టీ కోసం జైలుకెళ్లానని, ఆయనలాగా పారిపోలేదని రాణెను ఉద్దేశించి రౌత్ వ్యాఖ్యానించారు. తాను బాలాసాహెబ్ థాక్రెకు చెందిన స్వచ్ఛమైన శివసైనికుడినని, తాను ఎవరికీ లొంగబోనని ఆయన స్పష్టం చేశారు.