కొచ్చి : వక్ఫ్ చట్టంపై నిరసనలు వ్యక్తం చేయాలని ప్రజలను కోరుతూ చేసిన వ్యాఖ్యల ద్వారా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ‘హింసాకాండను ప్రేరేపించార’ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మంగళవారం ఆరోపించారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కొచ్చిలో విలేకరుల గోష్ఠిలో మాట్లాడుతూ, పార్లమెంట్ ఆమోదించిన సవరించిన వక్ఫ్ చట్టాన్ని తాను అమలు చేయబోనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ‘ఎలా? దానిని తాను అమలు చేయబోనని ఆమె ఎలా అంటారు? ఆమె ఒక రాజ్యాంగ పదవిని నిర్వహిస్తున్నారు, ఆ చట్టాన్ని ఒక రాజ్యాంగ సంస్థ ఆమోదించింది, రాజ్యాంగబద్ధమైన అంశాన్ని తాను అనుసరించబోనని ఆమె ఎలా అంటారు’ అని ఆయన నిలదీశారు.
వక్ఫ్ చట్టం పశ్చిమ బెంగాల్‌లో అమలు కాబోదన్న మమతా బెనర్జీ ప్రకటనకు సంబంధించిన ప్రశ్నలకు రిజిజు అలా స్పందించారు. ఆ రాష్ట్రంలో వక్ఫ్ చట్టానికి సంబంధించిన దౌర్జన్య ఘటనల గురించిన ప్రశ్నలకు సమాధానంగా రిజిజు అందుకు మమతదే బాధ్యత అని నిందించారు. ‘నిరసనలు వ్యక్తం చేయవలసిందిగా ప్రజలను కోరడం, పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని తాను అమలు చేయబోనని చెప్పడం ద్వారా సిఎం దౌర్జకాండకు ప్రేరేపించినట్లు కనిపిస్తోంది’ అని రిజిజు ఆరోపించారు. వక్ఫ్ (సవరణ) చట్టానికి సంబంధించి తాజాగా దౌర్జన్య సంఘటనలు సోమవారం పశ్చిమ బెంగాల్ 24 పరగణాల జిల్లా భంగర్ ప్రాంతాన్ని కుదిపివేశాయి. ఇంతకుముందు ఆ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లాలో ఆ చట్టానికి సంబంధించి దౌర్జన్య సంఘటనలు చోటు చేసుకున్నాయి.