న్యూఢిల్లీ: రాహుల్ గాంధీని లోక్‌సభనుంచి అనర్హుడిగా ప్రకటించడంపై కేంద్రమంత్రి కిరెన్ రిజిజు తనదైన రీతిలో స్పందించారు. రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించినందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బిజెపిని, చివరికి న్యాయవ్యవస్థను కూడా నిందిస్తోందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీయే మొదట ఒబిసిలను అవమాన పరిచారని, అలా అనమని బిజెపికి చెందిన నేతలెవరూ ఆయనకు సలహా ఇవ్వలేదని రిజిజు అన్నారు.
ఒబిసిలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకుగాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బిజెపిని తప్పుబడుతోందని ఆయన అన్నారు. ఆ పార్టీ చివరికి న్యాయవ్యవస్థను కూడా తప్పుబడుతోందని మంత్రి అన్నారు. ‘దిగజారుడు, బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయమని మేమేమీ రాహుల్‌కు సలహా ఇవ్వలేదు’ అని రిజిజు ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. కాగా రాహుల్ గాంధీ వల్ల కాంగ్రెస్ పార్టీ నష్టపోతోందని అంతకు ముందు రిజిజు వ్యాఖ్యానించారు. అంతేకాదు రాహుల్ ప్రజాస్వామ్యాన్ని, సాయుధ దళాలను, దేశ వ్యవస్థలను అవమానిస్తున్నారన్న కారణంగా గాంధీ పేరున్న వాళ్లందరినీ నిందించలేము కదా అని కూడా రిజిజు వ్యాఖ్యానించారు.